న్యూఢిల్లీ: అపర కుబేరుడు ముకేశ్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఇక పిల్లలకు అప్పగించబోతున్నారా! ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవునననిపిస్తున్నది. తన 50 బిలియన్ డాలర్ల కంటే అధిక విలువ కల వ్యాపారాన్ని ఆకాశ్, ఇషా అంబానీలకు కట్టబెట్టబోతున్న వార్త హల్‌చల్ చేస్తున్నది. 

వచ్చే దశాబ్దిలో ఈషా, ఆకాశ్‌లదే కీలక పాత్ర
గతేడాది ఆకాశ్, ఇషా అంబానీ వివాహాలు జరిపిన ముకేశ్ అంబానీ, వచ్చే దశాబ్దిలో వీరిద్దరూ రిలయన్స్ ఇండస్ట్రీ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు. వీరిని 2014లోనే రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ సంస్థ బోర్డుల్లో సభ్యులుగా నియమించారు ముకేశ్ అంబానీ. ఈషా అంబానీ, ఆకాశ్ అంబానీ జంట ముంబైలోని రిలయన్స్ గ్రూప్ కార్పొరేట్ పార్క్ ఆఫీసులో ఓపెన్ ఆఫీస్ సంస్క్రుతి ప్రారంభించడంలో కీలక భూమిక వహించారంటే అతిశయోక్తి కాదు. 

ఈ-కామర్స్ రంగ పరిస్థితులు పర్యవేక్షిస్తున్న యువ అంబానీలు
ఈ-కామర్స్ రంగంలోకి ప్రవేశించాలని చూస్తున్న ముకేశ్ అంబానీ.. ఇందుకు తగిన పరిస్థితులను వీళ్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రపంచ ఇంధన రంగంలో అగ్రగామి సంస్థ సౌదీకి చెందిన సౌదీ అర్మాకో..రిలయన్స్ లో 20 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపింది. టెలికం రంగ సంస్థ జియో మార్కెట్లో ప్రవేశించడానికి వీరిద్దరు ప్రధాన సూత్రదారులు. 

ఈషా అంబానీ కెరీర్ ఇలా
యాలే యునివర్సిటిలో గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన ఇషా అంబానీ.. రిలయన్స్ ఈ-కామర్స్ రంగంలోకి ప్రవేశించడానికి ఆమె కీలక పాత్ర పోషించారు. ఆమె భర్త ఫార్మా నుంచి రియల్ ఎస్టేట్ వరకు సేవలు అందిస్తున్న అజయ్ పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమల్. 

శ్లోకా మెహతాను పెండ్లాడిన ఆకాశ్
బ్రౌన్ యునివర్సిటీ అల్యుమ్నస్‌లో ఈ-కామర్స్‌లో శిక్షణ పొందిన ఆకాశ్ అంబానీ.. ఆయన చిన్ననాటి స్నేహితురాలు శ్లోకా మెహతాను పెళ్లి చేసుకున్నారు.ముంబై కేంద్రంగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న డైమండ్స్, జ్యువెల్లరీ వ్యాపారి కూతురే శ్లోకా మెహతా. 

భవిష్యత్‌లో అనంత్ కూడా కీలక బాధ్యతలు
ఈషా అంబానీ, ఆకాశ్ అంబానీలకు అనంత్ అంబానీ అనే సోదరుడు ఉన్నారు. సమీప భవిష్యత్‌లో అనంత్ అంబానీ రిలయన్స్ సంస్థలో కీలక బాధ్యతలు చేపడతారని క్రిష్ ఇన్వెస్ట్ మెంట్ అడ్వైజరీ సంస్థ ఫౌండర్ అరుణ్ కేజ్రీవాల్ తెలిపారు. కన్జూమర్ బిజినెస్‌ ఆఫరింగ్‌లో కీలక భూమిక వహించారు యువ అంబానీలు. 

రిలయన్స్ క్యాపిటల్ జై అన్మోల్
2028 నాటికి సంస్థ కీలక ఇంధన బిజినెస్‍లో ముకేశ్ అంబానీ ప్రధాన పాత్ర పోషించనున్నారు. అంతేకాదు ఇంటర్నెట్ బిజినెస్, జియో ఇన్ఫోకామ్ సంస్థల్లో క్రెడిట్‌ను తన కూతురు ఈషా అంబానీ, కొడుకు ఆకాశ్ అంబానీలకే అప్పగించారు. మరోవైపు ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ తన సారథ్యంలోని రిలయన్స్ క్యాపిటల్ సంస్థలో తన కొడుకు జై అన్మోల్‌ను నియమించారు. 

రిలయన్స్‌ రేటింగ్‌ను పెంచిన ఫిచ్‌
దేశీయ ప్రైవేట్‌ రంగ ఉత్పత్తి దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) రేటింగ్‌ను నిలకడ (స్టేబుల్‌) నుంచి సానుకూలానికి (పాజిటివ్‌) పెంచినట్లు రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ ప్రకటించింది. 2021 మార్చి నాటికి అప్పుల భారాన్ని పూర్తిగా తొలగించుకోనున్నట్లు ఆర్‌ఐఎల్‌ ప్రకటించటంతో పాటు వృద్ధి ప్రణాళికలను ఆవిష్కరించటంతో రేటింగ్‌ను మార్చినట్లు తెలిపింది. 

బీబీబీ మైనస్‌గా రిలయన్స్ క్రెడిట్
ఆర్‌ఐఎల్‌ దీర్ఘకాలిక స్థానిక (లోకల్‌) కరెన్సీ ఇష్యూయర్‌ డిఫాల్ట్‌ రేటింగ్‌ (ఐడీఆర్‌)ను నిలకడ నుంచి పాజిటివ్‌కు మార్చటంతో పాటు రేటింగ్‌ను ‘బీబీబీ’గా స్థిరంగా ఉంచింది. ఇదే సమయంలో ఫారిన్‌ కరెన్సీ ఐడీఆర్‌ను బీబీబీ మైనస్‌ /నిలకడగా ఉంచినట్లు ఫిచ్‌ ప్రకటించింది. సౌదీ అరామ్కోకు 20 శాతం వాటాలను విక్రయించనున్నట్లు ఆర్‌ఐఎల్‌ ప్రకటించిన నేపథ్యంలో రేటింగ్‌ను సవరించినట్లు ఫిచ్‌ వెల్లడించింది. 
రుణ రహిత రిలయన్స్ కావడం సానుకూలమే
మరోవైపు 2020-21 ఆర్థిక సంవత్సరం నాటికి రుణ రహిత కంపెనీగా మారనున్నట్లు ప్రకటించటం కూడా ఇందుకు ఒక కారణమని పేర్కొంది. పెట్రోకెమికల్స్‌ విభాగంలో రోజుకు 12 లక్షల బ్యారళ్ల సామర్థ్యంతో ఆర్‌ఐఎల్‌ దేశీయ మార్కెట్లో కీలకంగా ఉంది. కంపెనీ కార్యకలాపాలను ఒకేతాటిపైకి తెచ్చేందుకు పెట్టిన పెట్టుబడులు పూర్తి కావటం కూడా సంస్థ సామర్థ్యాలను పెంచిందని రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ వెల్లడించింది. 

డిజిటల్ సర్వీస్ బిజినెస్ జియోలో జోరు ఇలాగే..
ఇక రిలయన్స్ డిజిటల్‌ సర్వీసుల వ్యాపారమైన జియో.. తన జోరును కొనసాగిస్తూనే ఉందని పేర్కొంది. వైర్‌లెస్‌ సబ్‌స్ర్కైబర్‌ విభాగంలో అగ్రస్థానాన్ని దక్కించుకున్న జియో తాజాగా ఫైబర్‌ టు ద హోమ్‌ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించటం కూడా ఎంతగానో కలిసిరానుందని తెలిపింది. పెట్రోకెమికల్స్‌, రిఫైనింగ్‌ వ్యాపార విస్తరణతో ఆర్‌ఐఎల్‌ ఆర్థికంగా మరింత బలపడనుందని తెలిపింది.