బడ్జెట్‌ నుంచి నష్టాల్లో ఉన్న మార్కెట్లకు సూచీలకు కశ్మీర్‌ రూపంలో మరో షాక్‌ తగిలింది. దీనికి అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు సైతం ఆజ్యం పోయడంతో అంతర్జాతీయ మార్కెట్లూ డీలాపడ్డాయి. ఆ మేరకు మన సూచీలపై ప్రభావం పడి భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. ఫలితంగా సోమవారం ఒక్కనాడే రూ.1.6 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. ఎఫ్‌పీఐలతో సంప్రదింపులు జరుపుతామన్న ఆర్థికమంత్రి  ప్రకటన కాస్త కోలుకునేలా చేసింది.

అంతర్జాతీయంగా సుంకాల యుద్ధం, చైనా కరెన్సీ యువాన్‌ క్షీణత, దేశీయంగా కశ్మీర్‌ పరిణామాలు, రూపాయి బలహీనత, దేశీయ మార్కెట్లపై బేర్‌ దాడికి కారణం అయ్యాయి. ఫలితంగా సెన్సెక్స్‌ దాదాపు 5 నెలల కనిష్ఠానికి, నిఫ్టీ 10,900 పాయింట్ల దిగువకు చేరాయి. 

కంపెనీల త్రైమాసిక ఫలితాలు కూడా ఇందుకు తోడయ్యాయి. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి 113 పైసలు కోల్పోయి 70.73 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.1.6 లక్షల కోట్లు తగ్గి రూ.138.37 లక్షల కోట్లకు చేరింది.

వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో డాలర్‌తో పోలిస్తే చైనా కరెన్సీ యువాన్‌ దాదాపు 11 ఏళ్ల కనిష్ఠానికి చేరింది. ఒకానొకదశలో 7.03 స్థాయికి చేరి బెంబేలెత్తించింది. 2008 ఆగస్టు తర్వాత యువాన్‌కు ఇదే కనిష్ఠ స్థాయి. యువాన్‌ పతనంతో ఆసియా మార్కెట్లు డీలాపడ్డాయి. టోక్యో 1.7 శాతం, షాంఘై 1.6 శాతం నష్టపోయాయి.

సెన్సెక్స్‌ ఉదయం 36,842.17 పాయింట్ల వద్ద బలహీనంగా ప్రారంభమైంది. కశ్మీర్‌ పరిణామాల నేపథ్యంలో అంతర్గత ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ 700 పాయింట్లు నష్టపోయి నేలచూపులు చూసింది. రోజంతా నష్టాల్లోనే కదలాడిన సూచీ.. ఏదశలోనూ కోలుకోలేకపోయింది. 

ఒకానొకదశలో 36,416.79 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరిన సూచీ.. చివరకు 418.38 పాయింట్ల నష్టంతో 36,699.84 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 134.75 పాయింట్లు కోల్పోయి 10,862.60 పాయింట్ల దగ్గర స్థిరపడింది. అంతర్గత ట్రేడింగ్‌లో ఈ సూచీ 10,782.60- 10,895.80 పాయింట్ల మధ్య కదలాడింది.

ఆడిటర్‌గా డెలాయిట్‌ తప్పుకోవడంతో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేరు డీలాపడింది. అంతర్గత ట్రేడింగ్‌లో 12.43 శాతం కోల్పోయిన షేర్, రూ.40.85 వద్ద 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. చివరకు 10.08 శాతం నష్టంతో రూ.41.95 వద్ద ముగిసింది.
సెన్సెక్స్‌ 30 షేర్లలో 21 నష్టాలు చవిచూశాయి.

యెస్‌ బ్యాంక్‌ 8.15%, టాటా మోటార్స్‌ 5.25%, పవర్‌గ్రిడ్‌ 4.42%, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 3.48%, కోటక్‌ బ్యాంక్‌ 3.13%, ఎస్‌బీఐ 2.66%, బజాజ్‌ ఫైనాన్స్‌ 2.43%, టాటా స్టీల్‌ 2.43%, ఓఎన్‌జీసీ 2.34%, ఎన్‌టీపీసీ 2.06% చొప్పున డీలాపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్‌ 3.96%, టీసీఎస్‌ 1.93%, టెక్‌ మహీంద్రా 1.42%, హెచ్‌డీఎఫ్‌సీ 1.37%, బజాజ్‌ ఆటో 0.75% మేర రాణించాయి.

రంగాల వారీ సూచీల్లో ఐటీ మినహా అన్ని సూచీలు నీరసపడ్డాయి. ఇంధన, లోహ, బ్యాంకింగ్‌, వాహన, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఫార్మాలు 2.7% వరకు నష్టాలు నమోదు చేశాయి. బీఎస్‌ఈలో 1737 షేర్లు ప్రతికూలంగా, 698 షేర్లు సానుకూలంగాను ముగిశాయి. 128 షేర్లలో ఎటువంటి మార్పు లేదు. ఇక భారత కాలమానం ప్రకారం సోమవారం అర్థరాత్రి 12 గంటల సమయానికి డోజోన్స్‌ 750 పాయింట్ల నష్టంతో ట్రేడ్‌ అవుతోంది.