బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా కొత్తగా ఏర్పడనున్న ఎన్‌డీఏ-2 సర్కార్‌లో ఆర్థికశాఖ పగ్గాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐదేళ్లుగా పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న అమిత్‌షా.. బీజేపీకి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక సీట్లను సాధించిపెట్టారు. దీంతో ఆయన ఇక ప్రభుత్వంలోనూ క్రియాశీలంగా వ్యవహరించాలని భావిస్తున్నట్లు సమాచారం. 

ఈ విషయమై ప్రధాని మోదీకి అమిత్ షా సంకేతాలిచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన అమిత్‌షాకు కీలక శాఖను అప్పగించాలని మోదీ కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఆర్థిక-కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ, రక్షణ, రైల్వే శాఖను ఆయనకు అప్పగించే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ (66) మధుమేహంతోపాటు కిడ్నీ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఫలితంగా ఆయన ఎక్కువ కాలం చికిత్స నిమిత్తం ఇంటికే పరిమితం కావాల్సి వస్తోంది. గురువారం పార్టీ ఘన విజయం సాధించిన క్షణాల్లోనూ ఆయన ఢిల్లీలో ఉన్నా సంబరాల్లో పాలుపంచుకోలేక పోయారు. 

జైట్లీ ఆరోగ్యం పూర్తిగా సహకరించక పోవడంతో ఆయన మరోసారి ఆర్థిక శాఖ పగ్గాలను చేపట్టకపోవచ్చని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గంలో చేరినా ఆయన ఆరోగ్య కారణాల రీత్యా ఈసారి కీలక ఆర్థిక శాఖను చేపట్టేందుకు సుముఖంగా లేరని వారు చెబుతున్నారు. కేవలం నామమాత్రంగా ఉండే శాఖను ఎంచుకోవాలని జైట్లీకి ఆయన కుటుంబ సభ్యులూ సూచిస్తున్నట్టుగా సమాచారం. 

ఆనారోగ్యం కారణంగా జైట్లీకి గత ఏడాది మే నెలలో కిడ్నీ మార్పిడీ శస్త్రచికిత్స నిర్వహించారు. తర్వాత ఆయన ఆరోగ్యం మరోమారు క్షీణించడంతో అమెరికాలో చికిత్సకు వెళ్లారు. దీంతో జైట్లీ గత ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ సమావేశాలకూ హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో మోదీకి కుడిభుజంలా ఉండే అమిత్‌షాకు కీలకమైన ఆర్థిక శాఖను అప్పగించాలని పార్టీ వర్గాలు కూడా మోదీకి సూచిస్తున్నట్టుగా సమాచారం. 

2001లో నరేంద్ర మోదీని గుజరాత్‌ సీఎం పీఠంపై కూర్చోబెట్టడంలో కీలక పాత్ర పోషించిన అమిత్ షాకు అప్పట్లోనే మోదీ కీలకమైన హౌంశాఖతో సహా 12 కీలక శాఖలను కట్టబెట్టారు. అంతకు ముందు గుజరాత్‌ స్టేట్‌ ఫైనాన్సియల్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌గా పని చేసిన అనుభవం అమిత్‌షా సొంతం. దీనికి తోడు గొప్ప ట్రబుల్‌ షూటర్‌గా కూడా షాకు పేరుంది.

ప్రస్తుతం దేశంలో మందగమనం నెలకొనడంతోపాటు ఆర్థిక అంశాల విషయంలో మోదీ సర్కార్ పనితీరు చాలా పేలవంగా ఉన్నదని విమర్శలు వస్తున్నాయి. దీంతో ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు అమిత్‌షాకు ఉన్న సమయస్ఫూర్తి, ఓర్పు, చాణిక్యత బాగా కలిసి వస్తుందని మోదీ వర్గం భావిస్తోందని సమాచారం.

దీంతో ఆర్థిక శాఖ పగ్గాలను అప్పగించేందుకు అమిత్‌షా అసలైన అభ్యర్థి అని ఎన్‌డీఏ వర్గాలు భావిస్తున్నాయి. అమిత్‌షా వద్దనుకుంటే పీయూష్‌ గోయల్‌కు గానీ నిర్మలా సీతారామన్‌కు గానీ ఆర్థిక శాఖ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. 

లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి ప్రజలు మరోమారు పట్టం కడుతూ తీర్పునిచ్చిన మరునాడే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ తన పనిలో వేగం పెంచారు. తీవ్ర అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నా శుక్రవారం ఆర్థిక శాఖలోని ముఖ్య అధికారులతో సమావేశమయ్యారు. 

మోదీ ప్రభుత్వం రెండోసారి అధికార పగ్గాలు చేపట్టనున్న తరుణంలో 2019-20 బడ్జెట్‌ పనులను ముమ్మరం చేయాలని అధికారులకు జైట్లీ దిశానిర్ధేశం చేశారు. 16వ లోక్‌సభను రద్దు చేయాలని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకోవాడానకి కొన్ని గంటల ముందు ఆయన ఈ సమావేశం నిర్వహించడం విశేషం. 

ఈ సమావేశంలో ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను గురించి జైట్లీ సమగ్రంగా చర్చించినట్టు ఈ సమావేశానికి హాజరైన అధికారులు తెలిపారు. జైట్లీ నివాసంలో దాదాపు గంటకు పైగా ఈ సమావేశం జరిగింది. అరణ్‌ జైట్లీ ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఎన్‌డీఏ విజయోత్సవ కార్యక్రమాలకు కూడా హాజరు కాలేకపోయారని వార్తలు వస్తున్న తరుణంలో జైట్లీ ఈ సమావేశం నిర్వహించడం విశేషం.

అరుణ్ జైట్లీ ఆరోగ్యంగానే ఉన్నారని ఈ సమావేశానికి హాజరైన మరో అధికారి తెలిపారు. అయితే తాము మళ్లీ ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టే అవకాశం లేనందున.. తన విధి నిర్వహణలో సహకారం అందించిన కీలక అధికారులకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు మార్గనిర్ధేశం చేసేందుకే జైట్లీ ఈ సమావేశం నిర్వహించారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 

కాగా, జైట్లీని ఆర్థిక శాఖ నుంచి తప్పించనున్నారన్న వార్తల నేపథ్యంలో తాను ఆరోగ్యంగానే ఉన్నానన్న సందేశం పైవారికి చేరవేసేందుకే ఆయన ఈ సమావేశం నిర్వహించి.. ఇందుకు సంబంధించిన ఒక గ్రూపు ఫొటోను మీడియాకు విడుదల చేసినట్టు మరో సన్నిహిత వర్గం చెబుతోంది. ఆర్థిక శాఖకు కొత్త మంత్రి ఎవరు అన్న విషయం తేలేందుకు మరోవారం వేచి ఉండాల్సిందే.