న్యూఢిల్లీ: రుణభారంతో దివాళా దశకు చేరుకున్న ఎస్సార్‌ స్టీల్‌ను స్వాధీనం చేసుకునేందుకు రూ.42,000 కోట్లతో వేసిన బిడ్‌తో విజయం సాధించామని ఎన్నారై బిలియనీర్ లక్ష్మీ మిట్టల్‌ నేతృత్వంలోని ఆర్సెలార్‌ మిట్టల్‌ ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యధికంగా ఉక్కును తయారు చేస్తున్న లక్ష్మీమిట్టల్‌, దేశీయంగా కూడా స్టీల్‌ ప్లాంట్‌ కలిగి ఉండాలని భావిస్తున్నారు. ఈ ఆకాంక్ష తాజా బిడ్‌తో నెరవేరినట్లైంది. 

ఈనెల 19వ తేదీన అత్యధిక మొత్తం బిడ్డర్‌గా గుర్తించిన రుణదాతల కమిటీ (సీఓసీ), విజయవంతమైన దరఖాస్తుదారుగా ప్రకటించింది. 
తదుపరి ఈనెల 25వ తేదీన ఆర్సెలార్‌ మిట్టల్‌ను విజయవంతమైన బిడ్డర్‌గా ఎంపిక చేసింది. అదే రోజు రుణదాతలకు రూ.54,389 కోట్లు ఇస్తామని ఎస్సార్‌ స్టీల్‌ ప్రమోటర్లైన రుయా కుటుంబం ఆఫర్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముందస్తుగా రూ.47,507 కోట్ల నగదును బ్యాంకులకు చెల్లిస్తామని, దీనివల్ల బకాయిలన్నీ తీరిపోతాయని పేర్కొంది. తమ ప్రధాన కంపెనీ చేజారకుండా చూసేందుకు ఈ ప్రకటన చేసింది. 

‘ఎస్సార్‌ స్టీల్‌ బకాయిపడిన రూ.49 వేల కోట్ల రుణాలను వసూలు చేసుకునేందుకు రుణదాతలు ఆ సంస్థను వేలం వేశారు. ఇందులో బకాయిల కింద రూ.42,000 కోట్లు, మరో రూ.8,000 కోట్లను సంస్థ కార్యకలాపాల కోసం మూలధనంగా వాడాలన్నది మా ప్రణాళిక’ అని ఆర్సెలార్‌ మిట్టల్‌ పేర్కొంది. 

ఎస్సార్‌స్టీల్‌ను స్వాధీనం చేసుకునే ప్రక్రియలో ఆర్సెలార్‌ మిట్టల్‌తో కలిసి ముందుకెళ్తున్నట్లు నిప్పన్‌ స్టీల్‌ అండ్‌ సుమితోమో మెటల్‌ కార్పొరేషన్‌ ప్రకటించింది. జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ ఆమోదం అనంతరం, స్వాధీన ప్రక్రియ ముందుకెళ్తుందని తెలిపింది.

ఎస్సార్‌స్టీల్‌ ప్రమోటర్లు మాత్రం, తమ ప్రతిపాదన వల్ల వాటాదార్లందరికీ అత్యధిక విలువ సమకూరుతుంది కనుక, సీఓసీ పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్సెలార్‌ మిట్టల్‌ బిడ్‌ కన్నా, తమ ప్రతిపాదన మొత్తమే అధికమని, రుణదాతలందరికీ 100 శాతం చెల్లింపులు పూర్తి చేయవచ్చని, ఇతర వాటాదార్ల ప్రయోజనాలు కూడా పరిరక్షించవచ్చని కంపెనీ ప్రతినిధి వివరించారు. అయితే ఈ ప్రతిపాదనను రుణదాతలు కనీసం పరిశీలించారా, లేదా అనేది కూడా వెల్లడికాలేదు.