Asianet News TeluguAsianet News Telugu

లక్ష్మీ మిట్టల్ చేతుల్లోకి ఎస్సార్ స్టీల్?!

గ్లోబల్ స్టీల్ జెయింట్.. ఆర్సెలార్ మిట్టల్ దేశీయ స్టీల్ రంగంలో కీలక ముందడుగు వేసింది. ఇప్పటికే దివాళా దశకు చేరుకున్న ఎస్సార్ స్టీల్ సంస్థను కైవసం చేసుకునేందుకు లక్ష్మీ మిట్టల్ సారథ్యంలోని ఆర్సెలార్ మిట్టల్ దాఖలు చేసిన బిడ్‌ ప్రతిపాదనను ఎస్సార్ స్టీల్ రుణదాతలు అంగీకరించారు. దీనికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నుంచి ఎస్సార్ స్టీల్ కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ ఆమోదం తెచ్చుకోవాల్సి ఉంటుంది. 

Arcelor Mittal Emerges as Highest Bidder for Essar Steel
Author
New Delhi, First Published Oct 21, 2018, 11:15 AM IST

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకున్ను ఎస్సార్ స్టీల్‌ను ప్రపంచంలో స్టీల్ తయారీలో అగ్రగామి సంస్థ లక్ష్మీ మిట్టల్ సారథ్యంలోని ఆర్సెలార్ మిట్టల్ కైవసం చేసుకోనున్నది. ఈ విషయమై జరిగిన వేలంలో ఆర్సెలార్ మిట్టల్ ప్రతిపాదించిన రుణ పరిష్కార ప్రణాళికకు ఎస్సార్ స్టీల్ రుణదాతలు అంగీకరించారు.

ఎస్సార్ స్టీల్ కైవసానికి ఇప్పటి వరకు వచ్చిన రుణ పరిష్కార ప్రణాళికల్లో ఇదే అతిపెద్దది కావడం విశేషం. ఈ బిడ్ విలువ రూ.42 వేల కోట్లు. ఎస్సార్ స్టీల్ కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ ఇప్పుడు దీనికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నుంచి ఆమోదముద్ర తెచ్చుకోవాల్సి ఉంది. 

ఇటీవల ఆర్సెలార్ మిట్టల్, వేదాంత గ్రూపుల రుణ ప్రణాళికలను కమిటీ క్రెడిటార్స్(సీవోసీ) పరిశీలించింది. ఇప్పటి వరకు వచ్చిన బిడ్లలో ఈ రెండు కంపెనీలే తుదివరకు నిలిచాయి. రష్యాకు చెందిన వీటీబీ బ్యాంక్ ప్రమోట్ చేస్తున్న న్యూమెటల్ బిడ్‌కు అర్హత సాధించలేకపోయింది.

ఎస్సార్ స్టీల్ గత ప్రమోటర్లు ఈ కంపెనీలో ఉండటమే దీనికి కారణమని తెలుస్తున్నది. తొలుత ఆర్సెలార్ మిట్టల్ దీనికి రూ.38 వేల కోట్ల మేరకు రుణ ప్రణాళికను ప్రతిపాదించింది. కానీ ఆ తర్వాత దీనిని రూ.42 వేల కోట్లకు సవరించింది. దీంతో ఇక మరో విడుత బిడ్డింగ్ ఉండకపోవచ్చని ఓ బ్యాంకర్ తెలిపారు. పదేళ్ల క్రితం జార్ఖండ్, ఒడిశాల్లో 1.2 కోట్ల టన్నుల సామర్థ్యం కలిగిన స్టీల్ ప్లాంట్లను ఎస్సార్ స్టీల్ ఏర్పాటుచేసింది.

ఈ నెలారంభంలో ఆర్సెలార్ మిట్టల్ చైర్మన్, సీఈవో మిట్టల్ మాట్లాడుతూ ఎస్సార్ స్టీల్ విక్రయం విషయమై ఏదో ఆశ్చర్యం జరుగబోతున్నదని ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆర్సెలార్ మిట్టల్ ఈ వారం మొదట్లో ఉత్తమ్ గల్వా, కేకేఎస్ పెట్రోన్‌లను కొనుగోలు చేయడానికి రూ.7,469 కోట్ల నిధులను వెచ్చించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఎస్సార్ స్టీల్‌ను కొనుగోలు కోసం ఆర్సెలార్, న్యూమెటల్ సంస్థలకు సుప్రీంకోర్టు ఈ నెల 4న మరోదఫా అవకాశం కల్పించింది. ఈ బిడ్ ప్రతిపాదనను ఎస్సార్ స్టీల్ బోర్డు సభ్యులు విశ్వసించారని, భవిష్యత్‌లో మెరుగైన వృద్ధికి ఈ ఒప్పందం దోహదం చేయనున్నదని ఆర్సెలార్ మిట్టల్ ఒక ప్రకటనలో తెలిపింది.

అధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న దేశీయ స్టీల్ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, భవిష్యత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆర్సెలార్ మిట్టల్ పేర్కొంది. 

ఎస్సార్ స్టీల్ కొనుగోలు విషయమై తమకు స్పష్టత నివ్వాలని ఈ నెల 4న రష్యాకు చెందిన వీటీబీ బ్యాంక్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రుణ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఎస్సార్ స్టీల్‌ను కైవసం చేసుకోవడానికి ఒంటిరిగా బిడ్ దాఖలు చేయాలనుకుంటున్నట్లు రష్యా బ్యాంక్ ఇటీవల ప్రకటించింది.

ఈ నెల 4 నుంచి రెండు వారాల్లోగా ఎస్సార్ స్టీల్‌కు సంబంధించి కార్పొరేట్ రుణాలను చెల్లించాలని జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, ఇందు మల్హోత్రా నేతృత్వంలోని ప్రత్యేక బెంచ్ ఇరు సంస్థలను ఆదేశించింది. 

ప్రస్తుతం 60 దేశాల్లో వ్యాపారాలను నిర్వహిస్తున్న ఆర్సెలార్ మిట్టల్ వీటిలో 18 దేశాల్లో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసింది. 2017లో కంపెనీ ఆదాయం 68.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. 9.31 కోట్ల టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేసింది. న్యూయార్క్, ప్యారిస్, లగ్జెంబర్గ్, స్పెయిన్ దేశాల స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది.

Follow Us:
Download App:
  • android
  • ios