ఒకప్పుడు దేశీయ టెలికాం రంగంలో ఓ వెలుగు వెలిగిన రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్).. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి దివాళా దశకు చేరుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ నేతృత్వంలోని ఆర్‌కామ్ దివాలా అభ్యర్థనను నేషనల్ కంపెనీ లా  ట్రైబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) అంగీకరించింది.   

ఎస్బీఐ సహా పలు బ్యాంకులకు ఆర్‌కామ్ దాదాపు రూ.50వేల కోట్ల వరకు అప్పులు చెల్లించాల్సి ఉంది. అయితే, ఆర్థిక ఇబ్బందుల కారణంగా సంస్థ రుణాలు చెల్లించలేని పరిస్థితికి దిగజారింది. దీంతో దివాలా పెట్టేందుకు కంపెనీ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. దీనిపై గురువారం మరోసారి విచారణ జరిపిన ట్రైబ్యునల్.. కంపెనీ దివాలా ప్రక్రియకు  అనుమతినిచ్చింది. 

సంస్థ బోర్డును రద్దు చేసి కొత్త దివాలా పరిష్కార నిపుణుడిని నియమించింది. రుణదాతల కమిటీని ఏర్పాటు చేసేందుకు ఎస్బీఐ నేతృత్వంలోని 31 బ్యాంకుల కన్సార్టియంకు అనుమతిచ్చింది. 
ఇక దివాలా ప్రక్రియలో 357 రోజులు(మే 30, 2018 నుంచి ఏప్రిల్ 30, 2019) కాలానికి మినహాయింపు ఇవ్వాలని ఆర్‌కామ్ కోరగా.. ట్రైబ్యునల్ ఇందుకు అంగీకరించింది. 

ఇదివరకే దాఖలైన దివాలా పిటిషన్‌పై నేషనల్ కంపెనీ లా అప్పెలట్ ట్రైబ్యునల్, సుప్రీంకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ఈ 357 రోజుల కాలానికి మినహాయింపు ఇవ్వాలని ఆర్‌కామ్ కోరింది. ఇందుకు ట్రైబ్యునల్ ఒప్పుకుంది. 

ఈ కేసులో తదుపరి విచారణను మే 30 నాటికి వాయిదా వేసింది. ఆలోగా కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని ప్రస్తుత దివాలా పరిష్కార నిపుణుడిని ఆదేశించింది. కాగా, గత కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు సతమతమవుతున్న ఆర్‌కామ్ రెండే క్రితం సేవలను కూడా నిలిపేసింది.