ముంబై: అడాగ్‌ గ్రూపు అధినేత అనిల్‌ అంబానీపై ముప్పేట దాడి జరుగుతోంది. ప్రారంభంలో వీలైన చోటల్లా అప్పులు తెచ్చినందుకు అనిల్ అంబానీ సారథ్యంలోని అడాగ్ గ్రూప్ తీవ్ర ఒత్తిళ్లకు గురవుతోంది. ఇప్పటికే అనిల్ అంబానీ బిలియనీర్‌ క్లబ్‌నుంచి కిందికి పడిపోయారు. 

2008 లో 42 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో ఆరో స్థానంలో నిలిచిన అనిల్ అంబానీ ఇప్పుడు ప్రస్తుతం ఆ స్థానం కోల్పోయారు. 11 ఏళ్లలో అనిల్ అంబానీ మొత్తం వ్యాపార సామ్రాజ్యం ఈక్విటీ విలువ రూ. 3,651 కోట్లకు (523 మిలియన్ డాలర్లు) కుప్పకూలడం వల్లే ఈ దుస్థితి నెలకొంది. 

అప్పుల సంక్షోభం, టెలికాం సంస్థ ఆర్‌కాంతోపాటు ఇతర గ్రూపు సంస్థల వరుస నష్టాల నేపథ్యంలో అనిల్ అంబానీ సామ్రాజ్యం కుప్పకూలింది. ముఖ్యంగా  మ్యూచుఫల్‌ ఫండ్‌ జాయింట్‌ వెంచర్‌ రిలయన్స్‌ నిప్సాన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్మెంట్‌లో బ్యాంకులు 43% వాటాల విక్రయం షాకింగ్‌ పరిమాణం. 

రుణాలను తీర్చేందుకు ప్రధాన ఆస్తుల, వ్యాపారాల అమ్మకానికి పూనుకోవడంతో అనిల్‌ అంబానీ సంపద బాగా క్షీణించింది. ఇటీవలే ఆస్తులలమ్మైనా మొత్తం రుణాలను తీరుస్తామని అనిల్‌ అంబానీ హామీ ఇచ్చారు. గత 14 నెలల్లో  రూ.35 వేల కోట్లకు పైగా రుణాలు తీర్చామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

రిలయన్స్ గ్రూప్ విలువ నాలుగు నెలల క్రితం రూ.8వేల కోట్లకు పైగా ఉండటం గమనార్హం. ఆయన మొత్తం సంపద 42 బిలియన్‌ డాలర్లనుంచి 0.5  బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. 2018 మార్చి నాటికి అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ గ్రూప్ కంపెనీల మొత్తం రుణం 1.7 లక్షల కోట్లకు పైగా ఉంది.

ఇదిలా ఉంటే ప్రపంచానికే రుణదాతగా మారిన చైనా అనిల్ అంబానీకి కూడా అప్పులు ఇచ్చింది. ఒక రకంగా అనిల్‌ అంబానీకి చెందిన ఆర్‌కామ్‌కు అతిపెద్ద రుణదాతగా చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ నిలిచింది. నిన్న ఆర్‌కామ్‌ దివాళా ప్రక్రియలో భాగంగా రుణదాతల జాబితాను విడుదల చేసింది. 

ఇక మిగిలిన బ్యాంకులతో కలిపి మొత్తం 2.1బిలియన్‌ డాలర్లను చైనాకు చెందిన బ్యాంకులకు అనిల్ అంబానీ చెల్లించాల్సి ఉంది. వీటిని చెల్లించాలని ఆయా బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయి. ఆర్‌కామ్‌ చెల్లించాల్సిన అప్పుల విలువ రూ.57,382 కోట్లని ఈ జాబితాలో పేర్కొన్నారు. 

చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంకుకు రూ.9,860 కోట్లు చెల్లించాలి. ఎక్సిమ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనాకు రూ.3,360 కోట్లు, ఇండస్ట్రియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనాకు రూ.1,554 కోట్లు చెల్లించాలి. ఇప్పటికే అప్పులు తిరిగి చెల్లించేందుకు అనిల్‌ అంబానీకి చెందిన ఆర్‌కామ్‌ ఆస్తులను రూ.17,300 కోట్లకు జియోకు విక్రయించేలా డీల్‌ చేసుకొన్నారు. 

కానీ, వివిధ న్యాయ, ఇతర అంశాలతో ఈ డీల్‌ నిలిచిపోయింది. మార్చిలో అనిల్‌ అంబానీ జైలు శిక్షను ఎదుర్కొనే పరిస్థితి రావడంతో ఆయన సోదరుడు ముఖేష్‌ రంగంలోకి దిగి 80 మిలియన్‌ డాలర్లను ఎరిక్సన్‌కు చెల్లించారు. 

రష్యాకు చెందిన బీటీబీ క్యాపిటల్‌ ఆఫ్‌ రష్యాకు రూ.511 కోట్లు చెల్లించాలి. స్టాండర్డ్‌ ఛార్టర్డ్ బ్యాంక్ ‌(లండన్‌), డాయిష్‌ బ్యాంక్‌ (హాంగ్‌కాంగ్‌), డీబీఎస్‌ బ్యాంక్‌, ఎమిరేట్స్‌ ఎన్‌బీడీ బ్యాంక్‌ల నుంచి అనిల్ అంబానీ రుణాలు తీసుకున్నారు. ఇక భారత్‌కు చెందిన బ్యాంకులు ఇచ్చిన రుణాలను చూస్తే ఎస్‌బీఐకు రూ.4,910, ఎల్‌ఐసీకు 4,760 కోట్లు చెల్లించాలి.