రోజూ ఇంట్లో భర్త, పిల్లలు, కుటుంబసభ్యులందరికీ వంట చేసి పెట్టే మహిళకు.. ఒక్కసారైనా భర్త చేతి వంట రుచి చూడాలని అనిపించడంలో తప్పులేదు. ఇలాంటి కోరిక ప్రముఖ బిజినెస్ మేన్ , మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా భార్యకు కూడా కలిగింది. అయితే.. భార్య అడిగిన కోరికను... ఆనంద్ మహీంద్రా చాలా తెలివిగా తప్పించుకున్నారు. ఆ విషయాన్ని ఆయనే ట్విట్టర్ వేదికగా అందరితో పంచుకున్నారు.

ఇంతకీ మ్యాటరేంటంటే... ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం మనకు తెలిసిందే. అయితే... తాజాగా ఆయన పెట్టిన ఓ ట్వీట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘‘ ఓ వర్షాకాలపు సాయంత్రం మేమిద్దరం ఇంట్లో ఉన్నాం. తన కోసం ఏదైనా వంట చేయాల్సిందేగా నా భార్య నన్ను కోరింది. అప్పుడు తనకు ఇదిగో ఈ ఫోటో పంపించాను. నిజంగా ఇలా చేస్తే బాగుంటుందా అని తనని అడిగాను’ అని ట్వీట్ చేసి ఓ ఫోటో షేర్ చేశారు. ఆ ఫోటోలో ఓ వ్యక్తి ఇస్త్రీ పెట్టెతో చపాతీని కాలుస్తున్నారు. కాగా.. ఈ ట్వీట్ కి నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది.

ఈ ఫోటో చూసి మీ భార్య మరోసారి మిమ్మల్ని వంట చేయమని అడగరని ఈ ఫోటో పంపారా అని ఓ నెటిజన్ మెసేజ్ చేయగా... ఎలక్ట్రిక్ కార్లతోపాటు... ఎలక్ట్రిక్ చపాతీలు కూడా తయారు చేస్తున్నారా అంటూ మరో నెటిజన్ మెసేజ్ చేశారు. చాలా మంది ఆనంద్ మహీంద్రా చెప్పిన ఆన్సర్ బాగుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.