ముంబై: ప్రముఖ వాణిజ్యవేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. ఆయన ట్విట్టర్ లో చేసే వ్యాఖ్యలు హాస్యస్ఫోరకంగా ఉంటాయి. సందేశాత్మక పోస్టులను కూడా ఆయన పెడుతుంటారు. 

తనకు జన్మదిన కానుకగా మహీంద్ర థార్ ఇవ్వాల్సిందిగా విపుల్ అనే సోషల్ మీడియా యూజర్ ఆనంద్ మహీంద్రను ట్విట్టర్ వేదికగా అడిగాడు. తాను మహేంద్ర గ్రూప్ చైర్మన్ కు పెద్ద అభిమానిని అని చెబుకుంటూ ఆతను తన కోరికను వెల్లడించాడు. అయితే, తన ట్వీట్ కు ఆనంద్ మహీంద్ర స్పందించాడని విపుల్ అనుకుని ఉండడు.

విపుల్ చేసిన ట్వీట్ కు ఆనంద్ మహీంద్ర వెంటనే స్పందించారు.  అతని ట్వీట్ కు సమాధానం ఇవ్వడమే కాకుండా అరుదైన ఆంగ్ల పదాన్ని పరిచయం చేశాడు. ‘CHUTZPAH’ అనే పదం అది. దానికి అర్థాన్ని కూడా చెప్పారు. 

విపుల్ ను ప్రశంసించినా సరే లేదా ద్వేషించినా సరే.. అతని CHUTZPAHని (అతి ఆత్మవిశ్వాసాన్ని లేదా నిర్భయత్వాన్ని) మాత్రం మెచ్చుకోవాల్సిందే అని ఆనంద్ మహీంద్ర అన్నారు. విపుల్ నీ CHUTZPAH ఫుల్ మార్క్స్ అని చెప్పారు. 

అయితే, విచారకరమైన విషయం ఏమిటంటే నీ కోరికను నేను ఔనని చెప్పలేను. అలా చెప్తే నా వ్యాపారం దెబ్బ తింటుంది అని సరదాగా సమాధానం ఇచ్చారు. 

ఆనంద్ మహీంద్ర చేసిన ట్వీట్ ను 19 వేల మంది యూజర్స్ లైక్ చేశారు. చాలా మంది ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు.