దాదాపు నాలుగు రోజులపాటు పదవ తరగతి చదువుతున్న ఓ అమ్మాయి ఫొటో కోసం ఎదురుచూశారు ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్ర. ఆయన ఎదురుచూపులకు ఎట్టకేలకు తెరపడింది. ఓ వ్యక్తి ఆమె ఫొటో పంపడంతో తన మొబైల్ స్క్రీన్ సేవర్‌గా పెట్టుకున్నారాయన.

నాలుగు రోజుల ముందు ఇందుకు సంబంధించి జరిగిన వివరాల్లోకి వెళితే.. కేరళలోని త్రిశూరు జిల్లాలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షకు ఆలస్యమవుతుండటంతో పరీక్ష కేంద్రానికి కృష్ణ అనే బాలిక గుర్రపు స్వారీ చేసుకుంటూ వెళ్లింది. ఆమె గుర్రంపై వెళుతుండగా పలువురు ఫొటోలు, వీడియోలు తీశారు.

ఆమెకు సంబంధించిన ఓ వీడియోను ఆనంద్ మహీంద్ర కూడా చూశారు. ట్విట్టర్ వేదికగా ఆ బాలికపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె నా దృష్టిలో హీరో. ఆమెను చూస్తే బాలికల విద్య మరింత దూసుకెళుతుందన్న ఆశ కలుగుతోంది. బాలికల విద్య అద్భుతంగా ముందుకు సాగుతోందనడానికి నిదర్శనమైన ఈ వీడియో వైరల్ కావాల్సిన అవసరముందని ఏప్రిల్ 7న చేసిన ట్వీట్‌లో ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. 

అంతేగాక, తన మొబైల్ ఫోన్ స్క్రీన్ సేవర్‌గా  పెట్టుకోవడానికి ఆమె గుర్రపు స్వారీ చేస్తున్న  ఫొటో కావాలని, ఎవరికైనా తెలిస్తే పంపాలంటూ కోరారు.
ఈ క్రమంలో సుబిన్ అనే వ్యక్తి.. బాలిక గుర్రపు స్వారీ చేస్తున్న ఓ ఫొటోను ఆనంద్ మహీంద్రాతో పంచుకున్నారు. 

తాను కోరిన కృష్ణ అనే బాలిక ఫొటో ఈరోజే(శుక్రవారం) తన మెయిల్‌కు వచ్చిందని ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. తనకు ఆ బాలిక ఫొటోను పంపిన సుబిన్‌కు ఆనంద్ మహీంద్ర ధన్యవాదాలు తెలియజేశారు. నెటిజన్లు కూడా ఆ అమ్మాయిని మెచ్చుకుంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి స్ఫూర్తిదాయక ట్వీట్లు చేయడంపై మహీంద్రను కూడా అభినందిస్తున్నారు.