ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ. 2024-25కల్లా భారత జీడీపీపై మోదీ సర్కారు పెట్టుకున్న లక్ష్యం. 2018-19 ఆర్థిక సర్వేలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న గమ్యం ఇది. అయితే ఇప్పుడు ఈ లక్ష్యంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. వృద్ధిరేటు పెరుగడం మాట అటుంచితే.. నానాటికీ తగిపోతున్నది. ఏళ్ల తరబడి కనిష్ఠానికి దిగజారిపోతున్నది.

నిన్నమొన్నటిదాకా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిరేటు భారత్‌లో ఉందని కీర్తించిన ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి, దేశ-విదేశీ రేటింగ్ ఏజెన్సీలు ఈనాడు జీడీపీ అంచనాల్ని వరుసగా తగ్గిస్తున్నాయి. దీనికి తగ్గట్లే ప్రభుత్వ వృద్ధిరేటు గణాంకాలూ విడుదలవుతున్నాయి. 

Also read:ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్లో రేటింగ్స్ & రివ్యూస్ కనిపించవు...ఎందుకంటే..?

ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో ఐదు శాతానికే పరిమితమైన భారత వృద్ధిరేటు.. రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో మరింత దిగజారుతూ ఆరేళ్ల కనిష్ఠాన్ని తాకుతూ 4.5 శాతానికి చేరింది. దీంతో కేంద్రం పెట్టుకున్న ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ కల కల్లలేనా? అన్న అనుమానాలు, ఒకింత ఆందోళనలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనాన్ని పారద్రోలేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు చేపడుతున్న సంస్కరణలు.. ఆశించిన స్థాయిలో ప్రభావం చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అడుగంటిన వినియోగ సామర్థ్యం.. అన్ని రంగాలను దెబ్బ తీస్తున్నది. 

అమ్మకాలు లేక మార్కెట్ కళావిహీనంగా మారగా, ఆదాయం కరువైన సంస్థలు.. ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్, ఐటీ రంగాలకు ఎదురుగాలి వీస్తున్నది. దీంతో నిరుద్యోగం పెచ్చుమీరుతున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధి కల్పన నాలుగు దశాబ్దాలకుపైగా కనిష్ఠానికి చేరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఛాయలు ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామనే అంగీకరిస్తుండటం గమనార్హం. నిజానికి జీడీపీ బలోపేతానికి మోదీ సర్కారు.. పలు కీలక నిర్ణయాలే తీసుకున్నది.

కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్దీపనల్నీ అందిస్తున్నది. అయితే ఇవేవీ సరిపోవని, ఆర్థిక విధానాల్లో మార్పులు మాత్రమే దేశ ఆర్థిక వ్యవస్థను ఇప్పుడు ఆదుకోవని, అంతకుమించి ఇంకా చేయాలని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు.

ఆర్థిక వ్యవహారాల మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ సైతం తాజా క్యూ2 జీడీపీని ఆర్థిక వ్యవస్థలో తీవ్ర మందగమనంగానే అభివర్ణించారు. దీంతో 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం నెరవేరడం అనుమానంగానే కనిపిస్తున్నది.

తాజా పరిస్థితులను చూస్తుంటే.. రాబోయే నెలల్లో వృద్ధిరేటు మరింతగా తగ్గడం ఖాయంగా కనిపిస్తున్నది. దేశంలో ఆర్థిక మాంద్యం లేదని, ఆర్థిక మందగమనం మాత్రమే ఉందని కేంద్రం ఎంతగా చాటాలని చూసినా.. భవిష్యత్తుపై భరోసా మాత్రం కలుగడం లేదు.

మునుపెన్నడూ లేనివిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీరేట్లను తగ్గిస్తున్నా.. జీడీపీ కోలుకున్న సంకేతాలు మాత్రం మచ్చుకైనా లేకపోవడం భయాందోళనల్ని రేకెత్తిస్తున్నది. తాజా క్యూ2 జీడీపీ వివరాల ప్రకారం కీలకమైన తయారీ రంగం మైనస్ -1లోకి పడిపోయింది. 

వ్యవసాయ రంగం పురోగతి కూడా పేలవంగానే ఉన్నది. దీంతో జీడీపీ పురోగతికి ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు చాలవని, ఇంకా కావాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం మిస్సేనని హెచ్చరిస్తున్నారు.

ఇదిలా ఉంటే 2024 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందన్న విశ్వాసాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యక్తం చేశారు. శనివారం ముంబైలో ఎకనామిక్ టైమ్స్ అవార్డు 2019 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రపంచంలోని 5 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని కూడా చెప్పారు.

Also Read:14 రోజుల బ్యాటరీ లైఫ్ తో హువావే వాచ్ జిటి 2

ఇప్పటికే విదేశీ సంస్థలకు భారత్.. ఓ ప్రధాన కేంద్రంగా ఉన్నదని, ప్రస్తుతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్‌డీఐ)లు రికార్డు స్థాయిలో ఉన్నాయన్నారు. 2014లో 2 లక్షల కోట్ల డాలర్లతో 11వ స్థానంలో ఉన్న భారత జీడీపీ.. ఇప్పుడు 2.9 లక్షల కోట్ల డాలర్లతో 7వ స్థానంలో ఉందని గుర్తుచేశారు.