Asianet News TeluguAsianet News Telugu

ఏడాదిన్నరలో రుణ రహితం ‘రిలయన్స్’!

తమ్ముడు అనిల్ అంబానీ పడుతున్న బాధలను గమనించినట్లు ఉన్నారు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ. వచ్చే 18 నెలల్లో రుణరహిత స్థితికి ఆర్‌ఐఎల్‌ను తీసుకొస్తానని ఏజీఎం భేటీలో మదుపర్లకు హామీ ఇచ్చారు. ఇందుకోసం చమురు, రసాయనాల రంగాల్లో 20% వాటా విక్రయించాలని, పెట్రోలు బంకుల్లో రూ.7000 కోట్లకు 49% వాటా బీపీకి విక్రయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 

Ambani pledges a zero net-debt RIL in 18 months, promises big bonus & dividends
Author
Mumbai, First Published Aug 13, 2019, 10:21 AM IST

ముంబై: అప్పుల ఊబిలో చిక్కుకున్న సోదరుడు అనిల్ అంబానీ కష్టాలను చూసినట్లు ఉన్నారు. అందుకే వచ్చే ఏడాదిన్నరలో సంస్థను రుణ రహితంగా తీర్చిదిద్దుతామని రిలయన్స్ అధినేత తీసుకొస్తామని ముకేశ్‌ అంబానీ వెల్లడించారు.

దిగ్గజ చమురు ఎగుమతిదారు, సౌదీ సంస్థ అరామ్‌కోకు రిలయన్స్‌ చమురు, రసాయనాల వ్యాపారంలో 20 శాతం వాటాను రూ.1.05 లక్షల కోట్లకు పైగా మొత్తానికి విక్రయించనున్నారు. రిలయన్స్‌ పెట్రోలు బంకుల విభాగంలో 49 శాతం వాటాను బ్రిటిష్‌ పెట్రోలియమ్‌ (బీపీ) రూ.7,000 కోట్లకు కొనుగోలు చేయనుంది. 

ప్రతిపాదిత ఈ రెండు లావాదేవీల వల్ల రిలయన్స్‌కు దాదాపు రూ.1.15 లక్షల కోట్ల వరకు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ రెండు సంస్థల వాటాల విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి కావచ్చన్నది ముకేశ్‌ అంబానీ అంచనా వేస్తున్నారు.

టెలికం, రిటైల్‌ వ్యాపారాలతో కలుపుకొని రిలయన్స్  గ్రూపు విలువ సుమారు రూ.1,31,710 కోట్లు ఉంటుదని అంచనా. గత జూన్ నెలతో ముగిసిన త్రైమాసికం నాటికి రిలయన్స్ సంస్థలో నగదు నిల్వలు రూ. 5.4 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 

చమురు, రసాయనాల వ్యాపార విస్తరణ, 4జీ వైర్‌లెస్‌ టెలికాం నెట్‌వర్క్‌ ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడులను రుణాల రూపంలోనే గత ఐదేళ్లలో రిలయన్స్ సమీకరించింది. 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన చమురు, రసాయన విభాగ విలువను 75 బిలియన్‌ డాలర్లు (రూ.5.25 లక్షల కోట్లు) అని లెక్కగట్టింది. సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్‌కో సంస్థకు 20 శాతాన్ని విక్రయించడం ద్వారా రూ.1.05 లక్షల కోట్లకు పైగా (15 బిలియన్‌ డాలర్లు) వచ్చే వీలుంది. దేశ చరిత్రలోనే ఒక విదేశీ సంస్థ ఇంత భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టడం ఇదే తొలిసారి అని ముకేశ్‌ అంబానీ తెలిపారు.

సౌదీ ఆరామ్ కో సంస్థతో జరిగే ఒప్పందంలో భాగంగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌ వద్ద రిలయన్స్‌కున్న రెండు రిఫైనరీలకు దీర్ఘకాలిక పద్ధతిలో రోజుకు 5,00,000 బ్యారెళ్లు చొప్పున చమురును అరామ్‌కో సరఫరా చేస్తుంది. ప్రస్తుతం సౌదీ అరేబియా నుంచి రిలయన్స్‌ కొనుగోలు చేస్తున్న చమురుతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. ఈ విక్రయ లావాదేవీకి నియంత్రణ సంస్థల అనుమతులను ఆర్‌ఐఎల్‌ పొందాల్సి ఉంది. 

వచ్చే ఐదేళ్లలోగా చమురు, రసాయనాల వ్యాపారం రిలయన్స్‌  ఇండస్ట్రీస్‌కు ఎక్స్ఛేంజీల్లో నమోదుకాని అనుబంధ సంస్థగా రూపాంతరం చెందుతుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పి.ఎమ్‌.ఎస్‌.ప్రసాద్‌ అన్నారు. 

పెట్రోలు బంకులు, విమాన ఇంధన (ఏటీఎఫ్‌) విక్రయ కేంద్రాల ఏర్పాటు నిమిత్తం ఓ సంయుక్త సంస్థను ఏర్పాటు చేసేందుకు గతవారం ఆర్‌ఐఎల్‌, బ్రిటిష్‌ సంస్థ బీపీల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సంయుక్త సంస్థలో బీపీకి 49% వాటాను రూ.7000 కోట్లకు విక్రయిస్తోంది. రిలయన్స్‌కు 51 శాతం మేర వాటా మిగులుతుంది. రిలయన్స్‌కు ఉన్న దాదాపు 1400 పెట్రోలు బంకులు, 31 విమాన ఇంధన స్టేషన్లు సంయుక్త సంస్థకు బదిలీ అవుతాయి.  వచ్చే ఐదేళ్లలో పెట్రోల బంకుల సంఖ్యను 5,500కి పెంచుకోవాలని ఇరు సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. 

ఈ ఏడాది జూన్‌ చివరినాటికి రిలయన్స్ గ్రూపు రుణం రూ.2,88,243 కోట్లు. టవర్లు లాంటి టెలికం రంగ మౌలిక వసతుల ఆస్తుల విలువను పరిగణనలోకి తీసుకుంటే నికరంగా అప్పు రూ.1,54,478 కోట్లకు దిగివస్తుంది.

ఇప్పుడు ఈ రెండు లావాదేవీలు పూర్తి చేయడం ద్వారా వచ్చే 18 నెలల్లో అంటే 2021, మార్చి 31 నాటికి నికరంగా రిలయన్స్ సంస్థను అప్పురహిత స్థితికి తీసుకొచ్చేందుకు కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసుకుందని ముకేశ్‌ చెప్పారు. 

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు జమ్మకశ్మీర్‌, లడఖ్‌ ప్రజల అవసరాలు తీర్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని ముకేశ్‌ తెలిపారు. ఈ మూడు ప్రాంతాల అభివృద్ధికి కొన్ని ప్రకటనలు త్వరలో చేస్తామని ముకేశ్‌ హామీ ఇచ్చారు.

భవిష్యత్‌లో అధిక డివిడెండ్లు ఇస్తామని, ఫైబర్‌ సేవల వార్షిక చందాదార్లకు టీవీలు ఉచితంగా అందచేస్తామని ముకేశ్‌ అంబానీ ప్రకటించినప్పుడూ హర్షధ్వానాలు మిన్నంటాయి. ఏఆర్‌, వీఆర్‌ వంటి వినూత్న సాంకేతికత గురించి ఆకాశ్‌, ఈశా అంబానీ వివరించినపుడు మదుపర్లు కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios