హైదరాబాద్: ఈ- కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ విస్తరణ ఏర్పాట్లు వేగవంతం చేస్తోంది. అందులో భాగంగా దేశంలోనే అతిపెద్ద ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ విస్తరణ కోసం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ (శంషాబాద్) లో గల జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా ప్రకటించింది. 

ప్రస్తుత ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. అదనంగా 1.89 లక్షల చదరపు అడుగులమేర విస్తరిస్తున్నారు. దీంతో అమెజాన్‌కు రాష్ట్రంలో 8.50 లక్షల చదరపు అడుగులకు పైగా స్థలంలో 3 ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లవుతుంది. 

అమెజాన్ ఆసియా ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ ఉపాధ్యక్షులు అఖిల్ సక్సేనా మాట్లాడుతూ భారతదేశంలో అమ్మకాలు, కొనుగోళ్ల విధానాన్ని మార్చాలన్న తమ లక్ష్యానికి అనుగుణంగా నిరంతరం మౌలిక వసతులు, డెలివరీ నెట్‌వర్క్‌లో పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు. దీనివల్ల డెలివరీ వేగం పెరగడంతోపాటు వినియోగదారులు, అమ్మకం దారులకు మరింత సంతృప్తి లభిస్తుందన్నారు. 

అతిపెద్ద ఈ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌ ఏర్పాటుతో మరింత మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అమెజాన్ ఆసియా ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ ఉపాధ్యక్షులు అఖిల్ సక్సేనా అన్నారు. అంతేకాకుండా స్థానిక అమ్మకందారులు కూడా మౌలిక వసతులను ఉపయోగించుకొని సాధికారతను సాధిస్తారని, వారి పెట్టుబడులు తగ్గి మరింత అభివృద్ధి చెందే ఆస్కారం కలుగుతుందన్నారు. 

జీఎంఆర్ ఎయిర్‌పోర్టు ల్యాండ్ డెవలప్‌మెంట్ సీఈవో అమన్ కపూర్ మాట్లాడుతూ అమెజాన్ తమతో భాగస్వామ్యాన్ని విస్తరిస్తున్నందుకు ఆనందంగా ఉన్నట్లు చెప్పారు. తాము నాణ్యతకు, ఉన్నతస్థాయి కార్యనిర్వహణకు కట్టుబడి ఉన్నామనేందుకు ఇదే నిదర్శనమని చెప్పారు. 

హైదరాబాద్ ఎయిర్‌పోర్టు సిటీతో అమెజాన్ మరింత అభివృద్ధి చెందుతుందని జీఎంఆర్ ఎయిర్‌పోర్టు ల్యాండ్ డెవలప్‌మెంట్ సీఈవో అమన్ కపూర్ ఆశాభావం వ్యక్తంచేశారు. నూతన మౌలిక సదుపాయాల వల్ల స్థానికులకు ఫుట్‌టైమ్, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు లభించడంతోపాటు దేశవ్యాప్తంగా అనేకమంది నైపుణ్యాలు పెరుగుతాయన్నారు.