న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజం అమెజాన్‌ భారత్‌లో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ వ్యాపారంలోకి అడుగుపెట్టనుంది. తాము అందించే సేవల్లోకి ఫుడ్ డెలివరీ కూడా చేరిస్తే బాగుంటుందని అమెజాన్ ఇండియా భావిస్తోంది. ఇప్పటికే పలు సంస్థలు ఇదే బిజినెస్‌లో ఉండటంతో అమెజాన్‌ రాకతో పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది. 

ముఖ్యంగా ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ప్లాన్‌ ద్వారా దీన్ని నిర్వహించాలని అమెజాన్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ రకంగా వినియోగదారులను ప్రైమ్‌ యాప్‌కు చేరువ చేయాలనేది వ్యూహం. ప్రస్తుతం ప్రైమ్‌ యాప్‌లో ఫ్యాషన్‌, ఎలక్ట్రానిక్స్‌, నిత్యావసరాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అమెజాన్‌ ప్రైమ్‌కు కోటి మందికి పైగా సభ్యులు ఉన్నారు. దీనికి ఫుడ్‌డెలివరీ కూడా కలిస్తే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తోంది.   

ఐటీ దిగ్గజం నారాయణమూర్తి స్ధాపించిన కటామరన్‌ సంస్ధతో కలిసి అమెజాన్‌ ఈ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోందని సమాచారం. సెప్టెంబర్‌ నుంచి భారత్‌లో ఆరంభమయ్యే పండుగ సీజన్‌తో నూతన సర్వీస్‌ను ప్రారంభించేందుకు సకల అస్త్ర శస్త్రాలతో అమెజాన్‌ సన్నద్ధమవుతున్నట్టు తెలిసింది.

మధ్యతరగతి కుటుంబాల నుంచి ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్లు విపరీతంగా పెరుగుతుండటంతో ఈ రంగంలో అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని అమెజాన్‌ ఉవ్విళ్లూరుతోంది. 2018లో ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్ల సంఖ్య 176 శాతం పెరిగాయి. మరోవైపు ఈ రంగంలో ఇప్పటికే జొమాటో, స్విగ్గీ దూసుకుపోతుండగా, ఊబర్‌ ఈట్స్‌ను కొనుగోలు చేసి భారీస్ధాయిలో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ మార్కెట్‌లో అడుగుపెట్టాలన్నది అమెజాన్‌ వ్యూహంగా చెబుతున్నారు. ఊబర్ ఈట్స్ సంస్థతో ప్రాథమిక స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉబర్‌ ఈట్స్‌ విలువ 300 మిలియన్‌ డాలర్లుగా అంచనా వేసినట్లు తెలుస్తోంది. 

ఒకవేళ ఊబర్ ఈట్స్ సంస్థను కొనుగోలు చేయడం సాధ్యం కాకపోతే వ్యూహాత్మక భాగస్వామ్యంతో అమెజాన్ ముందుకు సాగే అవకాశం ఉంది. ఈ అంశంపై స్పందించేందుకు ఊబర్ ఈట్స్ ప్రతినిధి నిరాకరించారు. అమెజాన్‌ ఇండియా కూడా ఈ అంశంపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది. గత ఏడాది స్విగ్గీ రోజుకు 8 లక్షల ఆర్డర్లను స్వీకరించగా.. జుమాటో 6,50,000 ఆర్డర్లను తీసుకుంది. ఇక ఉబర్‌ ఈట్స్‌ రోజుకు 2లక్షల వరకు ఆర్డర్లను అందుకొంది.