Asianet News TeluguAsianet News Telugu

స్పీడ్ పెంచిన అమెజాన్: రెండువారాల్లో ‘ఫ్యూచర్స్’ కొనుగోలు?

భారత్‌ రిటైల్ మార్కెట్‌లో తన విస్తృతిని గణనీయంగా పెంచుకోవాలని చూస్తున్న ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ అందుకు అనుగుణంగా వేగం పెంచింది. ఇప్పటికే పలు రిటైల్‌ మార్కెట్‌ చైన్స్‌ను కొనుగోలు చేస్తూ తన వ్యాప్తిని  పెంచుకుంటోంది. 

Amazon likely to buy 7-8% stake in Future Retail: Report
Author
New Delhi, First Published Oct 19, 2018, 10:24 AM IST

న్యూఢిల్లీ: భారత్‌ రిటైల్ మార్కెట్‌లో తన విస్తృతిని గణనీయంగా పెంచుకోవాలని చూస్తున్న ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ అందుకు అనుగుణంగా వేగం పెంచింది. ఇప్పటికే పలు రిటైల్‌ మార్కెట్‌ చైన్స్‌ను కొనుగోలు చేస్తూ తన వ్యాప్తిని  పెంచుకుంటోంది. ఇటీవలే ఆదిత్య బిర్లా గ్రూపు ఆధ్వర్యంలో 'మోర్‌' రిటైల్‌ చైన్‌ను సొంతం చేసుకున్న అమెజాన్.. తాజాగా కిశోర్‌ బియానీ సంస్థ ‘ఇండియాస్‌ ఫూచర్స్’ రిటైల్‌ సంస్థలో 7 నుంచి 8 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు సమాచారం.

ఈ వాటా కొనుగోలు వ్యవహారంతో దగ్గర సంబంధం గల వ్యక్తులు ఈ సమాచారం ఇచ్చినట్లు ఒక ఆంగ్ల టీవీ చానెల్ తెలిపింది. క్యాష్‌- అండ్‌-స్టాక్‌ ఈ డీల్‌ జరుగనుంది. దాదాపు రూ.2500 కోట్లకు ఈ వాటా విక్రయించే దిశగా ఈ చర్చలు జరుగుతున్నట్లు వినికిడి.
చర్చలు కొలిక్కి రాగానే రెండు వారాల్లో వాటా విక్రయంపై ఇరు సంస్థల మధ్య ఒప్పందం జరగనుందని తెలుస్తోంది. ఈ ఏడాది తొలినాళ్లలో కూడా అమెజాన్‌ సంస్థ ఫ్యూచర్‌ రిటైల్‌లో 10 శాతం వాటా కొనుగోలుకు గూగుల్‌, అలీబాబా దన్నుగా నడుస్తున్న పేటీఎం సంస్థలు ప్రయత్ని స్తున్నట్లు వార్తలొచ్చాయి. 

కానీ వీటిని అప్పట్లో ఫ్యూచర్‌ సంస్థ తోసిపుచ్చింది. వాల్‌మార్ట్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో కీలక వాటాను సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆ సంస్థకు దీటుగా ఎదిగేందుకు అమెజాన్‌ సంస్థ దేశీయ రిటైల్‌ చైన్స్‌ను తన ఖాతాలో వేసుకుంటూ పోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఫ్యూచర్‌పై దృష్టి పెట్టినట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నా.. ఈ వార్తలను ఇరు సంస్థల ప్రతినిధులు వెంటనే ధ్రువీకరించేందుకు నిరాకరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios