అమెజాన్ శిఖలోకి ‘మెడ్ ప్లస్’.. మెడికల్ రిటైల్‌పై ఈ కామర్స్ దిగ్గజం కన్ను

Amazon in talks to buy Medplus, India’s No. 2 pharmacy chain
Highlights

దేశీయ మెడికల్ రిటైల్ రంగంలోనూ అడుగు పెట్టాలని ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తహతహలాడుతోంది. అందులో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మెడ్ ప్లస్ స్వాధీనానికి చర్చలు జరుపుతోంది.

హైదరాబాద్‌ : దేశంలో రెండో అతిపెద్ద మెడికల్‌ షాపుల చైన్ సంస్థ మెడ్‌ప్లస్‌ను త్వరలో అమెజాన్‌ స్వాధీనం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెడ్‌ప్లస్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఈ అంతర్జాతీయ ఇ-కామర్స్‌ దిగ్గజం అమితాసక్తి ప్రదర్శిస్తోందని, ఇప్పటికే ఇరు వర్గాల మధ్య చర్చలు మొదలైనట్లు ఆన్‌లైన్‌ పోర్టల్‌ ఫ్యాక్టర్‌డైలీ కథనం పేర్కొంది. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మెడ్‌ప్లస్‌ 2006లో ప్రారంభమైంది. ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో 1400కు పైగా మెడికల్‌ స్టోర్లను నిర్వహిస్తోంది. మెడ్ ప్లస్ సంస్థను ఎంబిబిఎస్‌, ఎంబిఎ పట్టభద్రుడైన మధుకర్‌ గంగాడి ప్రారంభించారు. 

2015 - 16లో రూ.1726 కోట్ల ఆదాయం.


2015-16 ఆర్థిక సంవత్సరానికి సంస్థ రూ.1,726 కోట్ల ఆదాయంపై రూ.9 కోట్ల లాభం ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో మధుకర్‌ గంగాడి సంస్థలోని ప్రైవేటీ ఈక్విటీ (పిఇ) ఇన్వెస్టర్ల వాటాను కొనుగోలు చేసేందుకు గోల్డ్‌మన్‌ శాచ్‌ నుంచి 11.5 కోట్ల డాలర్ల నిధులు సేకరించారు. పిఇల వాటా కొనుగోలు ద్వారా గంగాడి సంస్థలో తన ఈక్విటీని 90 శాతానికి పెంచుకున్నారు.
 
భారత్‌ ఫార్మా రిటైల్‌పై అమెజాన్‌ దృష్టి


అన్ని రంగాల రిటైల్‌ వ్యాపారాల్లోకి ప్రవేశించాలని లక్ష్యంగా పెట్టుకున్న అమెజాన్‌.. ఆ వ్యూహంలో భాగంగానే ఫార్మసీ విభాగంపైనా కన్నేసింది. మెడ్‌ప్ల్‌సలో పెట్టుబడుల ద్వారా భారత ఫార్మసీ మార్కెట్లోకి సైతం అడుగుపెట్టాలనుకుంటోంది. ప్రధానంగా ఆఫ్‌లైన్‌ మోడల్‌లో ఫార్మసీ సేవలందిస్తున్న మెడ్‌ప్లస్‌.. తన వెబ్‌సైట్‌ ద్వారా ఔషధాల ఆర్డర్‌ చేసుకునేందుకు కస్టమర్లకు అవకాశం కల్పిస్తోంది. తద్వారా ఆన్‌లైన్‌లోనూ తన మనుగడను చాటుకుంటోంది. 

ఇలా ఆన్‍లైన్ చానెల్ విస్తరణకు మెడ్‌ప్లస్‌కు చాన్స్


అమెజాన్‌ చేతుల్లోకి వెళితే ఆన్‌లైన్‌ చానల్‌ను మరింత విస్తృతపర్చుకునేందుకు మెడ్‌ప్ల్‌సకు అవకాశం లభించనుంది. భారత్‌లో తన ప్రధాన ప్రత్యర్థి అయిన ఫ్లిప్‌కార్ట్‌.. 1ఎంజి, ఫార్మ్‌ఈజీ వంటి ఆన్‌లైన్‌ ఫార్మా కంపెనీల టేకోవర్‌ కోసం సంప్రదింపులు జరుపుతోంది. ఇండియాలో ఆన్‌లైన్‌ ఫార్మసీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నప్పటికీ మార్కెట్‌ వాటా నామమాత్రమే. అందుకే అమెజాన్‌.. అగ్రగామి ఆఫ్‌లైన్‌ ఫార్మసీ కంపెనీల్లో ఒకటైన మెడ్‌ప్ల్‌సపై ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది.
 
2020 నాటికి 5,500 కోట్ల డాలర్ల స్థాయికి చేరాలని లక్ష్యం


అఖిల భారత కెమిస్ట్స్‌ అండ్‌ డ్రగ్గిస్ట్స్‌ సమాఖ్య (ఎఐఒసిడి) ప్రకారం.. గత నెలలో దేశవ్యాప్తంగా రూ.10,215 కోట్ల విలువైన ఔషధాలు అమ్ముడు పోయాయి. వార్షిక ప్రాతిపదికన విక్రయాలు 8.6 శాతం పెరిగాయి. ఇక గత ఏడాదిలో దేశంలో రూ.1.20 లక్షల కోట్ల (1,750 కోట్ల డాలర్లు) విలువైన ఔషధాలు అమ్ముడయ్యాయి. 2020 నాటికి విక్రయాలు దాదాపు మూడింతలై 5,500 కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోవచ్చని అంచనా.

loader