ఐసీఐసీఐ సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేసిన చందాకొచ్చర్‌కు ఫ్యామిలీ కష్టాలొచ్చి పడ్డాయి. బ్యాంక్ సీఈఓగా ఆమె బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి చందాకొచ్చర్ కుటుంబ లావాదేవీలపై దర్యాప్తు జరపాలని జస్టిస్ బీఎన్ శ్రీక్రుష్ణన్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు కోరిందని బ్యాంక్ సన్నిహిత వర్గాల కథనం.

ప్రత్యేకించి ఆమె బ్యాంక్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మార్కెట్ ధరలపై రాయితీపై గానీ, తక్కువ ధరకు గానీ జరిపిన ఆస్తుల కొనుగోళ్లపై ద్రుష్టిని సారించాలని ఐసీఐసీఐ బోర్డు కోరింది. 

చందాకొచ్చర్ హయాంలో అలాగే వివిధ రియల్ ఎస్టేట్ సంస్థలు, భవన నిర్మాణ సంస్థలకు ఐసీఐసీఐ బ్యాంకు రుణ లావాదేవీలను దర్యాప్తు చేయాలని కోరింది. జస్టిస్ బీఎన్ శ్రీక్రుష్ణ మాట్లాడుతూ ‘చందా కొచ్చర్‌కు వ్యతిరేకంగా ప్రజా వేగు (విజిల్ బ్లోయర్) దాఖలు చేసిన పలు ఆరోపణలపై నేను దర్యాప్తు చేయబోతున్నానన్న సంగతి నిజం’ అని తెలిపారు. 

ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓగా చందాకొచ్చర్ 2009లో బాధ్యతలు స్వీకరించారు. విడతల వారీ దర్యాప్తు కంటే ఒకేసారి దర్యాప్తు చేయడం సరైందని బ్యాంక్ ఆడిట్ కమిటీ భావించింది’ ఐసీఐసీఐ బ్యాంక్ సన్నిహిత వర్గాల కథనం.

బ్యాంక్ సీఈఓగా చందాకొచ్చర్ వివిధ సంస్థలకు రుణాలు మంజూరు చేసినందుకు క్విడ్ ప్రో కో లావాదేవీలు జరిపారన్న ఆరోపణలపై ఐసీఐసీఐ బ్యాంక్ అంతర్గత, స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. 2012లో వీడియో కాన్ గ్రూపునకు రూ.3,250 కోట్ల రుణం మంజూరు విషయమై చందాకొచ్చర్‌పై ఒక ఉద్యోగి, ఒక ఐసీఐసీఐ బ్యాంక్ వాటాదారు ఆడిట్ కమిటీకి ఫిర్యాదు చేశారు. 

చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ 2008లో నుపవర్ రెన్యూవబుల్స్ సంస్థ తొలి ఇన్వెస్టర్ అయితే, తొలి ప్రమోటర్లలో వేణుగోపాల్ ధూత్ ఒకరు. వేణుగోపాల్ ధూత్ క్రమంగా తన వాటా పెట్టుబడులను ఉపసంహరించుకున్నా.. ఆయన సహచరులు అలాగే కొనసాగారు. 2013 చివరి వరకు వేణుగోపాల్ ధూత్ సదరు నుపవర్ రెన్యూవబుల్ సంస్థతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నారు. తర్వాత దీపక్ కొచ్చర్ సారథ్యంలోని ఒక ట్రస్ట్ కు సదరు తన వాటాలను బదిలీ చేశారు. కానీ ఇందులో తాము చేసిన తప్పేమీ లేదని ఇటు బ్యాంకు, అటు చందాకొచ్చర్ చెప్పుకొచ్చారు. 

బ్యాంక్ ఆడిట్ కమిటీకి ఫిర్యాదు చేసిన వారు కూడా కొన్ని సంస్థలకు చందాకొచ్చర్ రుణాలు మంజూరు చేసి, తక్కువ రేట్లకు తాను ఆస్తులు కొనుగోలు చేశారని ఆరోపించారు. చందాకొచ్చర్ హయాంలో వివిధ సంస్థలకు జారీ చేసిన రుణాలు, ఆయా సంస్థల నుంచి చందాకొచ్చర్ కుటుంబ ఆస్తుల కొనుగోళ్ల లావాదేవీలపై దర్యాప్తుతో పూర్తి విషయాలు వెలుగు చూడనున్నాయి. ఎస్ఎంఈ ఖాతాల్లో మొండి బాకీలపై ప్రజా వేగుగా వ్యవహరిస్తూ బ్యాంక్ ఆడిట్ కమిటీకి ఐసీఐసీఐ ఉద్యోగి చేసిన ఫిర్యాదుపైనా దర్యాప్తు కమిటీ ద్రుష్టి సారించనున్నది. 

ఇటీవలే ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ జీసీ చతుర్వేది మాట్లాడుతూ శ్రీక్రుష్ణ కమిషన్ నివేదిక రెండున్నర నెలల్లో పూర్తి కానున్నదని భావిస్తున్నట్లు చెప్పారు. కానీ తాజా పరిణామాలపై ఒక దినపత్రిక వివరణ కోరిన ఈ- మెయిల్ పై స్పందించడానికి ఐసీఐసీఐ బ్యాంక్ అధికార ప్రతినిధి నిరాకరించారు.