న్యూఢిల్లీ: రుణభారంతో దివాళా పరిష్కార ప్రక్రియ ఎదుర్కొంటున్న టెలికం సంస్థ రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌-కామ్‌) ఆస్తులను కొనుగోలు చేయడానికి 11 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. పోటీ కంపెనీలైన భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్‌ జియో కూడా బిడ్లు దాఖలు చేశాయి. 

‘మూడు సంస్థల (ఆర్‌కామ్, రిలయన్స్‌ టెలికం, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ లిమిటెడ్‌) ఆస్తుల కొనుగోలు కోసం మొత్తం 11 బిడ్లు వచ్చాయి. వీటిలో వర్డే క్యాపిటల్, యూవీ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ తదితర సంస్థల బిడ్స్‌ కూడా ఉన్నాయి‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి.

also read  స్టాక్‌ మార్కెట్లలో లాభాల వరద...రికార్డు స్థాయిలో న్యూ హైట్స్‌కు స్టాక్స్...

ఆర్‌-కామ్‌ డేటా సెంటర్, ఆప్టికల్‌ ఫైబర్‌ వ్యాపారాన్ని ఖచ్చితంగా కొనుగోలు చేస్తుందని భావించిన ‘ఐ స్క్వేర్డ్‌ క్యాపిటల్‌’ అసలు బిడ్‌ దాఖలు చేయలేదని వివరించాయి. బిడ్లను సోమవారమే ఖరారు చేయాల్సి ఉన్నా, రుణదాతల కమిటీ (సీవోసీ) దీన్ని శుక్రవారానికి వాయిదా వేసినట్లు పేర్కొన్నాయి. 

ఆర్‌-కామ్‌ సెక్యూర్డ్‌ రుణాలు దాదాపు రూ. 33వేల కోట్ల మేరకు ఉన్నాయి. దాదాపు రూ. 49వేల కోట్ల బాకీలు రావాల్సి ఉందని రుణదాతలు ఆగస్టులో క్లెయిమ్‌ చేశారు. బాకీల చెల్లింపు కోసం ఆస్తుల విక్రయానికి గతంలో కూడా ఆర్‌కామ్‌ ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

స్పెక్ట్రం చార్జీలు, లైసెన్సు ఫీజుల బాకీల కోసం ప్రొవిజనింగ్‌ చేయడంతో జులై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ ఏకంగా రూ. 30,142 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అటు కంపెనీ చైర్మన్‌ పదవికి అనిల్‌ అంబానీ రాజీనామా చేసినా.. రుణదాతలు ఆమోదముద్ర వేయలేదు. 

నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు (ఎన్‌సీఎల్‌టీ) ఆర్‌కామ్‌ వ్యవహారం చేరింది. ఎన్‌సీఎల్‌టీ ఆదేశాల ప్రకారం పరిష్కార నిపుణుడు (ఆర్‌పీ) 2020 జనవరి 10లోగా దీన్ని పరిష్కరించాల్సి ఉంటుంది.

also read రెవెన్యూ మార్కెట్ వాటాలో జియోదే ఆధిపత్యం

టెలికం ప్యాకేజీపై కమిటీ రద్దు
స్పెక్ట్రం చార్జీలు చెల్లించడానికి కేంద్రం మారటోరియం విధించడంతో టెలికం రంగ సమస్యలను అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన కార్యదర్శుల కమిటీ (సీవోఎస్‌) రద్దయింది. టెలికం రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం తీసుకోతగిన చర్యలపై పలు మార్లు సమావేశమైన సీవోఎస్‌ ఈ నెల తొలినాళ్లలో కేంద్రానికి నివేదిక ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

ఆ కమిటీ సిఫారసుల మేరకే స్పెక్ట్రం వినియోగ చార్జీల చెల్లింపుపై రెండేళ్ల మారటోరియం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించాయి. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల చెల్లింపునకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో కేంద్రం జోక్యం చేసుకోరాదని భావించిన నేపథ్యంలో సీవోఎస్‌ రద్దు ప్రాధాన్యం సంతరించుకుంది. 

సంక్షోభం నుంచి బయటపడేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని, వాయిస్‌ కాల్స్‌.. డేటా టారిఫ్‌లను పెంచడం మొదలైన అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేయాలని టెలికం సంస్థలకు  ప్రభుత్వం సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.