న్యూఢిల్లీ: మీరు ఎయిర్‌టెల్‌ సిమ్ వాడుతున్నారా? అయితే స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగించే ఎయిర్‌టెల్‌ వినియోగదారులు ఇక నుంచి ప్రతి చిన్న విషయానికీ కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్‌కు ఫోన్‌ చేయాల్సిన పనిలేదట. ఎయిర్‌టెల్‌ ఫోన్ కాల్స్ తోపాటు మీకు ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు గూగుల్‌ అసిస్టెంట్‌ పరిష్కారం చూపుతుంది.

కృత్రిమమేధ సాయంతో ఎయిర్ టెల్ కస్టమర్లకు గూగుల్ ఇలా 
‘టెలికాం రంగంలో మరో ముందడుగు. ఇంటర్నెట్ సెర్చింజిన్‌ గూగుల్‌తో చేతులు కలిపాం. మా వినియోగదారులకు ఎదురయ్యే సమస్యలను కృత్రిమమేధ సాయంతో గూగుల్‌ అసిస్టెంట్‌ పరిష్కారం చూపగలదు’’ అని ఎయిర్‌టెల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఫీచర్‌తో ఎయిర్‌టెల్‌ వినియోగదారులు మరిన్ని మెరుగైన సేవలను పొందవచ్చునని తెలిపింది. 

ప్రస్తుతానికి ఇంగ్లీష్ లో గూగుల్ అసిస్టెంట్ సేవలు
ప్రస్తుతానికి ఇంగ్లీష్‌ భాషలోనే సేవలందించనుండగా, త్వరలోనే లక్షల భారతీయులకు వారి ప్రాంతీయ భాషల్లోనే సమస్యకు పరిష్కారం లభించేలా చేస్తామని పేర్కొంది. ‘వినియోగదారులు తరచూ అడిగే ప్రశ్నలకు గూగుల్‌ అసిస్టెంట్‌ ద్వారా పరిష్కారం లభిస్తుంది. దీన్ని మరింత అభివృద్ధి చేయటం ద్వారా ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తాం’ అని భారతీ ఎయిర్‌టెల్‌ డైరెక్టర్‌ సారంగ్‌ కన్నాడే తెలిపారు.

టాటా టెలీ పెట్టుబడులు రద్దు!
పీకల్లోతు అప్పులు, నష్టాల్లో కూరుకుని భారతీ ఎయిర్‌టెల్‌లో కలిసిపోతున్న టాటా టెలీసర్వీసెస్‌లోని మొత్తం పెట్టుబడులను టాటా సన్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఏకంగా రూ.28,651.69 కోట్ల పెట్టుబడులను వదిలేసుకుంటున్నట్లు టాటా గ్రూప్ నిర్వహణ సంస్థ అయిన టాటా సన్స్ స్పష్టం చేసింది. డెట్-ఫ్రీ.. క్యాష్-ఫ్రీ ఒప్పందంలో భాగంగా టాటా టెలీ కన్జ్యూమర్ మొబైల్ వ్యాపారాన్ని ఎయిర్‌టెల్‌కు టాటా సన్స్ బదిలీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ డీల్ కింద టాటా టెలీసర్వీసెస్ అప్పుల బాధ్యత ఎయిర్‌టెల్‌దే. అలాగే సంస్థ వ్యాపారం, ఇతరత్రా ఆస్తులపై హక్కూ ఎయిర్‌టెల్‌కే వస్తుంది.