దేశంలో విమాన చార్జీలకు ఒక్కసారిగా రెక్కలొచ్చేశాయి. కొన్ని మార్గాల్లో టికెట్‌ రేట్లు గరిష్ఠంగా 60 శాతం మేర పెరిగాయి. దాంతో ప్రయాణ వ్యయం భారంగా మారిందని విమాన ప్రయాణికులు అంటున్నారు. 

గత నెలలో విమాన సర్వీసులు భారీ సంఖ్యలో రద్దుకావడంతోపాటు ముంబై, బెంగళూరు విమానాశ్రయాలు పాక్షికంగా మూతపడటం ఇందుకు ప్రధాన కారణమైంది. ఈ నెలలో విమాన ఇంధన ధరలు భారీగా పెరగడం కూడా టికెట్‌ రేట్లకు ఆజ్యం పోస్తున్నాయని మార్కెట్‌ వర్గాలంటున్నాయి.

జెట్ ఎయిర్వేస్, ఇండిగో సర్వీసులు ఇలా క్యాన్సిల్
జెట్ ఎయిర్వేస్‌లో సంక్షోభంతో హ్యాంగర్లకే విమానాలు పరిమితం
ఆర్థిక సంక్షోభంలోకి జారుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌.. లీజు అద్దె చెల్లించలేక ఇప్పటి వరకు 23 విమానాలను నిలిపి వేయాల్సి వచ్చింది. ఇందుకు తోడు పైలట్ల కొరత, రోస్టర్‌ పునర్వ్యవస్థీకరణ కారణంగా దేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్‌ ఇండిగో సైతం భారీ సంఖ్యలో విమానాలను నిలిపివేసింది.

రోజూ 250 వరకు సర్వీసుల రద్దు ఇలా
తత్ఫలితంగా గత నెలలో రోజుకు 150 నుంచి 200  విమాన సర్వీసులు రద్దయ్యాయి. రోజువారీ నడిచే సర్వీసుల్లో ఐదు శాతం రద్దు కావడంతో విమాన సేవలకు డిమాండ్‌ పెరిగింది. దాంతో చెన్నై, కోల్‌కతాతోపాటు పలు చిన్న నగరాల నడిచే విమానాల టిక్కెట్ల రేట్లు పెరిగాయి.
 
నిర్వహణావసరాల కోసం ముంబై, బెంగళూరు ఎయిర్ పోర్టుల మూసివేత?
దేశంలో రెండు, మూడో అతిపెద్ద విమానాశ్రయాలైన ముంబై, బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులు గత నెలలో మెయింటెనెన్స్‌ అవసరాల రీత్యా కొంత సమయంపాటు మూసివేసి ఉంచారు. దాంతో టేకాఫ్‌, ల్యాండింగ్‌ కోసం స్లాట్ల కొరత ఏర్పడటం కూడా విమాన సేవల డిమాండ్‌ను పెంచడం టికెట్‌ రేట్ల పెరుగుదలకు కారణమైంది.
 
8.1 శాతం పెరిగిన విమాన ఇంధనం రేట్లు
ఈ నెలలో విమాన ఇంధనం (ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌-ఏటీఎఫ్‌) ధరలు ఏకంగా 8.1 శాతం పెరిగాయి. దాంతో ఢిల్లీలో కిలో లీటర్ (1000 లీటర్లు) ఏటీఎఫ్‌ రేటు రూ.4,734 పెరిగి రూ.62,795కు చేరుకుంది. గత నాలుగు నెలల్లో ఏటీఎఫ్‌ ధరలు పెంచడం ఇదే తొలిసారి. ఈ పరిణామం కూడా రేట్ల పెంపునకు కారణం కానుంది. ఎయిర్‌లైన్స్‌ నిర్వహణ వ్యయంలో ఇంధన ఖర్చుల వాటానే 40 శాతం వరకు ఉంటుంది.
 
సర్వీసులు పెరగకుంటే మున్ముందు మోతే
డిమాండ్‌కు తగ్గ స్థాయిలో విమాన సర్వీసులు పెరగకుంటే మున్ముందు టికెట్‌ రేట్లు మరింత పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు. సర్వీసుల రద్దు, చార్జీల పెంపు పరిణామాలు దీర్ఘకాలంపాటు కొనసాగితే దేశంలో విమాన ప్రయాణికుల వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. గత ఏడాదిగా దేశంలో విమాన ప్రయాణికుల వృద్ధి ప్రతినెలా 20 శాతం పైగా నమోదవుతూ వస్తోంది.
 
ముంబై విమానాశ్రయానికి ఉత్తమ ర్యాంకింగ్‌
జీవీకే గ్రూప్‌ నిర్వహణలోని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నాలుగు కోట్ల మంది ప్రయాణికుల శ్రేణిలో సైజుపరంగా, ప్రాంతీయంగా ఉత్తమ విమానాశ్రయం అవార్డును పొందింది. ఎయిర్‌పోర్ట్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ ఈ అవార్డును ప్రకటించింది. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో అత్యుత్తమమైన కస్టమర్‌ అనుభూతికి గుర్తింపుగా ఈ అవార్డును ముంబై విమానాశ్రయానికి ప్రకటించినట్టు తెలిపింది. సెప్టెంబర్ 2 నుంచి 5 వరకు ఇండోనేసియాలోని బాలిలో జరిగే రెండవ ఏఎ స్‌క్యూ ఫోరమ్‌ సమావేశాల్లో ఈ అవార్డును బహుకరించనున్నట్టు ప్రకటించింది.

ఎమిరేట్స్ ఆఫర్..31లోగా బుక్ చేసుకుంటే 86 దేశాలకు వెళ్లొచ్చు
అంతర్జాతీయ విమాన సంస్థ ఎమిరేట్స్‌ సూపర్‌ సేల్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా తన నెట్‌వర్క్‌లోని పలు అంతర్జాతీయ నగరాలకు చౌకగా టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రమోషన్‌ ఆఫర్‌లో భాగంగా ఈ నెల 6 నుంచి 31లోగా టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్చు. ఈ నెల 8 నుంచి జూన్‌ 30 మధ్యలో ప్రయాణించేందుకు వీలుంటుందని ఎయిర్‌లైన్స్‌ స్పష్టం చేసింది. ఎమిరేట్స్‌ 86 దేశాల్లోని 158 నగరాలకు విమాన సర్వీసులు నడుపుతోంది.

మహిళలకు ‘విస్తారా’ ఫ్రీగా శానిటరీ ప్యాడ్స్ పంపిణీ
దేశీయ విమానాల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు వారి అభ్యర్థన మేరకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేయబోతున్నట్లు విమానయాన సంస్థ విస్తారా ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 నుంచి తమ అన్ని విమాన సర్వీసుల్లో ఈ వసతి కల్పిస్తామన్నది. ‘చిన్న చిన్న విషయాలే ఒక్కోసారి పెద్ద తేడాను తీసుకొస్తాయనే మా కంపెనీ సిద్ధాంతాన్ని దృష్టిలో ఉంచుకొని శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం’ అని విస్తారా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, హెచ్‌ఆర్‌, (కార్పొరేట్‌ వ్యవహారాలు) దీపా చద్దా తెలిపారు.