న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకుని ప్రైవేటీకరణ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న కేంద్ర ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా పండుగల వేళ వినూత్న ప్రణాళికలను ప్రకటించింది. వచ్చేనెల 30వ తేదీ నుంచి సాధారణ చార్జీల కంటే తక్కవ రేట్లలో దేశీయ సర్వీసులను ప్రకటించింది. గోవా, ఢిల్లీ, బెంగళూరు లాంటి నగరాలకు కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ఎయిరిండియా శనివారం వెల్లడించింది. 

వచ్చే నెల చివరి నాటికి ఈ సర్వీసులను ప్రారంభిస్తామని తెలిపింది. ‘భారీ ట్రాఫిక్‌ను ఛేదించండి - హోటల్‌  ఖర్చుల భారం నుంచి బయటపడండి, నమ్మనలేని తక్కువ ధరల్లో విమాన టికెట్లను ఆస్వాదించండి’ అంటూ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.

ఢిల్లీ - గోవా - ఢిల్లీ, ఢిల్లీ - కోయంబత్తూర్ - ఢిల్లీ, బెంగుళూరు - అహ్మదాబాద్ - బెంగుళూరు లాంటి మార్గాల్లో సాధారణ విమాన ఛార్జీల కంటే తక్కువ రేట్లకే ప్రయాణాన్ని అందిస్తామని ప్రవేశపెడతామని ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా అర్ధరాత్రి బయలుదేరిన విమానాలు తెల్లవారేసరికి ఆయా గమ్యస్థానాలకు చేరేలా ఈ సర్వీసులను పరిచయం చేస్తున్నట్టు తెలిపింది.

రెడ్‌ఐ  విమానాలు విదేశాల్లో ముఖ్యంగా అమెరికా, యూరప్‌లో బాగా ప్రాచుర్యం పొందినందునే ఈ సర్వీసులను దేశీయంగా కూడా పరిచయం చేస్తున్నట్టు పేర్కొంది.  అర్ధరాత్రి విమాన సర్వీసుల వల్ల ప్రయాణికులకు టికెట్‌ ధరలు తగ్గడమే కాకుండా ఉదయం వేళ నగరాల్లో ట్రాఫిక్‌ పెరిగేలోగా ఇంటికి చేరుకోవచ్చు.