న్యూఢిల్లీ: నారు పోసిన వాడే నీరు పోస్తాడని అన్న సూక్తి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియాకు సరిగ్గా సరిపోతుందనుకుంటా.. ఎందుకంటే 87 సంవత్సరాల క్రితం టాటా గ్రూప్ స్థాపించిన టాటా ఎయిర్ లైన్స్ సంస్థే ఎయిర్ ఇండియా.

ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ సంస్థను టేకోవర్ చేసేందుకు టాటా సన్స్ ఆసక్తి చూపుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎయిర్ఇండియాను పూర్తిగా ప్రైవేటీకరించాలని భావిస్తున్నందున ఇదే మంచి తరుణం అని టాటా సన్స్ భావిస్తున్నట్లుంది. 

ఎయిర్ ఇండియా కొనుగోలు కోసం బిడ్ దాఖలు చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని తన టీమ్‌ను కోరనున్నట్లు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. ఇది టాటా సన్స్ నిర్ణయం కాదని ‘విస్తారా’ ఎయిర్ లైన్స్ నిర్ణయమన్నారు. తమకు మూడో ఎయిర్ లైన్స్ నడిపే ఆలోచనేదీ లేదన్నారు. ఇప్పటికే టాటా సన్స్ గ్రూపుకు విస్తారా, ఎయిర్ ఏషియాలో వాటాలు ఉన్నాయి. కనుక ఏదో ఒక గ్రూపులో విలీనమే సరైనదవుతుందని చంద్రశేఖరన్ తెలిపారు.

also read పండగే పండగ... వారానికి మూడు వీక్లీ ఆఫ్‌లు...

ఎయిర్ ఇండియాలో పూర్తి వాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రయత్నించింది. ఇంతకు ముందు 76 శాతం వాటాలను అమ్మడానికి ప్రయత్నించినప్పుడు ఏ ఒక్కరూ కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు.

టాటా సన్స్ కూడా ఆసక్తి చూపలేదు. షరతులు కఠినంగా ఉండటంతోపాటు జెట్ ఎయిర్వేస్ కొనుగోలు అంశాన్ని కూడా టాటా సన్స్ పరిశీలిస్తుండడంతో ఎయిర్ ఇండియా కొనుగోలుకు టాటా గ్రూప్ ముందడుగు వేయలేదు.

ఏవియేషన్ రంగంలో బిజినెస్ విస్తరణ విషయంలో టాటా గ్రూప్‌కు ఎయిరిండియా టేకోవర్ బాగా ఉపయోగ పడుతుంది. సింగపూర్ ఎయిర్ లైన్స్‌తో కలిసి పెట్టిన విస్తారాతోపాటు బడ్జెట్ కారియర్ ఎయిర్ ఏషియాలోనూ టాటా సన్స్ సంస్థకు వాటాలు ఉన్నాయి. ఈ రెండు జాయింట్ వెంచర్లకు కలిపి 2018-19లో రూ.1,500 కోట్ల నష్టం వాటిల్లింది.

జేఆర్డీ టాటా 1932లో టాటా ఎయిర్ లైన్స్ (ప్రస్తుతం ఎయిర్ ఇండియా) సంస్థను స్థాపించారు. కరాచీ- ముంబై మధ్య టాటా ఎయిర్ లైన్స్ తొలి విమానాన్ని కూడా జేఆర్డీ టాటా స్వయంగా నడిపారు. టాటా ఎయిర్ లైన్స్ సంస్థను 66 ఏళ్ల క్రితం జాతీయం చేసింది.

aslo read ఐదేళ్లలో 3,427 బ్యాంకుల... మూసివేత...ఎందుకంటే...?

1946లో టాటా ఎయిర్ లైన్స్ పబ్లిక్ కంపెనీగా అవతరించడంతో పేరును కూడా ఎయిరిండియాగా మార్చేశారు. ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ ఎయిర్‌లైన్స్‌గా పేరు తెచ్చుకున్న టాటా ఎయిర్‌లైన్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఎయిరిండియాగా మార్చేసింది.

విస్తారా అంతర్జాతీయంగా ఎదగడానికి ఎయిర్ ఇండియా కొనుగోలు సాయపడనున్న నేపథ్యంలో దీన్ని చేజిక్కించుకోవడానికి రతన్ టాటా ఆసక్తి చూపిస్తారని భావిస్తున్నారు. కేవలం నాలుగు అంతర్జాతీయ రూట్లలో మాత్రమే విస్తారా విమానాలు నడుపుతున్నది. 

2017-18లో ఎయిరిండియా రూ.27 వేల కోట్ల రెవెన్యూపై రూ.5,799 కోట్ల నష్టం పొందింది. ఈ ఏడాదిలో ఒక వడ్డీ భారమే రూ.4000 కోట్లు. ఇక అప్పులు రూ.58 వేల కోట్లకు చేరాయి. బకాయిలు చెల్లించకుంటే ఇంధన సరఫరా నిలిపివేస్తామని ఈ నెల ప్రారంభంలో సంస్థకు కేంద్ర ముడి చమురు సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. పనితీరు విసయంలో ఇతర సంస్థలతో పోలిస్తే ఎయిరిండియా వెనుకబడిందన్న విమర్శలు ఉన్నాయి.