Asianet News TeluguAsianet News Telugu

‘మహారాజా’పై ఎతిహాద్ ‘కన్ను’.. టాటా సన్స్, ఇండిగో కూడా..

అంతర్జాతీయంగా స్లాట్లు కలిగి ఉండటంతోపాటు మౌలిక వసతులు గల కేంద్ర ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా (ఏఐ)పై ఆబుదాబీ కేంద్రంగా పని చేస్తున్న ప్రైవేట్ విమానయాన సంస్థ ఎతిహాద్‌ కన్నేసింది. ఎయిర్ ఇండియా రుణభారం తగ్గిస్తే కొంటామని చర్చలు ప్రారంభించింది. అందుకోసం కేంద్ర ప్రభుత్వంతోనూ అనధికారికంగా రాయబేరాలు నడుపుతోంది. ఎయిరిండియా కొనుగోలు రేసులో టాటా సన్స్‌తోపాటు మరో దేశీయ ప్రైవేట్ విమానయాన సంస్థ ‘ఇండిగో’ రేసులో ఉన్నాయని తెలుస్తున్నది. 
 

Air India sale: IndiGo, Etihad show interest in bidding for national carrier
Author
Mumbai, First Published Jan 1, 2020, 4:21 PM IST

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమాన సంస్థ ఎయిరిండియాను (ఏఐ)హస్తగతం చేసుకొనేందుకు ఆబుదాబీ కేంద్రంగా పని చేస్తున్న ప్రైవేట్ విమానయాన సంస్థ ‘ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌’ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. బంగారుబాతు వంటి ఎయిరిండియాను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటే అంతర్జాతీయంగా తన విస్తృతిని మరింత వేగంగా పెంచుకొనేందుకు వీలవుతుందన్న ఆలోచనలో ఎతిహాద్‌ ఉన్నట్టుగా తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ ప్రతినిధులు దేశ రాజధాని ‘హస్తిన’లోనే మకాం వేసి ప్రభుత్వ అధికారులతో, ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరుపుతన్నట్లు ఆంగ్ల ప్రతికల్లో వచ్చిన వార్తలు చెబుతున్నాయి. ఎయిరిండియా కొనుగోలు కోసం అబుదాబీకి చెందిన సంస్థ ప్రతినిధులు సర్కారుతో అనధికారిక చర్చలు జరుపుతున్న సంగతిని విమానయాన శాఖ అధికారి ఒకరు మంగళవారం ధ్రువీకరించారు.

అయితే ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు కార్పొరేట్‌ దిగ్గజం టాటా సన్స్ గ్రూపు ఆసక్తిగా ఉందన్న వార్తలను కూడా ఆ పౌర విమానయాన శాఖ అధికారి ధ్రువీకరించారు. అయితే ఇప్పటి వరకు ఆ సంస్థ నుంచి ఎలాంటి వర్తమానం కానీ.. సంబంధిత అధికారులు గానీ సర్కారును సంప్రదించలేదని అధికారి తెలిపారు. 

గత ఏడాది ఎయిరిండియాలో దాదాపు 76% వాటా విక్రయానికి ముందుకు వచ్చిన కేంద్ర ప్రభుత్వానికి చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. సంస్థ కొనుగోలుకు ఒక్కటి కూడా సరైన బిడ్‌ కూడా దాఖలు కాకపోవడంతో ఈ ప్రయత్నాన్ని అప్పట్లో ప్రభుత్వం పక్కనబెట్టింది. 

ఇప్పుడు ఎలాగైనా ఎయిరిండియా విక్రయాన్ని పూర్తి చేయాలన్న నిర్ణయంతో ఉన్న ప్రభుత్వం ఎయిరిండియాలో 100 శాతం వాటా విక్రయాన్ని అమ్మకానికి అందుబాటులో ఉంచనున్నది. ఎయిరిండియా కొనుగోలుకు రెండు కంపెనీలు, రెండు ప్రయివేటు ఈక్విటీ సంస్థలు ఆసక్తిగా ఉన్నట్టుగా సదరు అధికారి తెలుపారు. 

ఎయిరిండియా విక్రయం భారీ నగదుతో కూడుకున్నది కావడంతో ఎక్కువ సంస్థలు ముందుకు రాకపోవచ్చని పౌర విమానయానశాఖ అధికారి అన్నారు. ఎయిరిండియాలో 100శాతం వాటా విక్రయానికి వచ్చే నెలలో సర్కార్ కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలను (ఈవోఐ) ఆహ్వానించనుంది. 

మరోవైపు ఎయిరిండియాలో100 శాతం వాటాను కొనుగోలు చేసే విషయమై ఇండిగో కూడా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఎయిరిండియా కొనుగోలు రేసులో రెండు భారత సంస్థలు పోటీకి సిద్ధమవుతున్నాయి. 

అయితే అబుదాబీ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ, నేషనల్‌ ఇన్వెష్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రా ఫండ్‌ రేసులో ముందుండి సర్కార్‌తో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయా సంస్థలే ఎయిరిండియాను చేజిక్కించుకొనేందుకు ఎక్కువగా అవకాశ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సంస్థలు ఎయిరిండియా రుణ భారాన్ని తగ్గించాలని ప్రధానంగా సర్కారుపై ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తోంది.

జెట్‌ ఎయిర్‌వేస్‌పై హిందూజా గ్రూప్‌ ఆసక్తి

తీవ్ర ఆప్పుల సంక్షోభంలో చిక్కుకుని మూత పడిన ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ను కొనుగోలు చేయడానికి హిందూజా గ్రూప్‌ ఆసక్తి చూపుతోన్నట్లు నివేదికలు వస్తున్నాయి. దీని కొనుగోలుకు ఆ గ్రూపు బిడ్‌ను సిద్ధం చేస్తోందని సమాచారం. బ్రిటన్‌ కేంద్రంగా పని చేస్తున్న ఈ గ్రూపు అధిపతులు గోపిచంద్‌ హిందూజా, అశోక్‌ హిందూజా సోదరుల బ్రుందం 2020 జనవరి 15 గడువులోగా బిడ్‌ను సమర్పించాలని యోచిస్తోందని తెలుస్తోంది. కాగా ఈ వార్తలపై హిందుజా గ్రూపు అధికారికంగా స్పందించలేదు. ముంబై కేంద్రంగా పని చేసిన జెట్‌ ఎయిర్‌వేస్‌ అప్పుల భారంతో గతేడాది ఏప్రిల్‌లో సేవలను నిలిపివేసింది. ఈ కంపెనీ పలు బ్యాంకులకు రూ.8,230 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios