న్యూఢిల్లీ: ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనం అందితేనే ఇంట్లో సరుకులు.. పిల్లల చదువుల అవసరాలు తీరేది. కానీ కేంద్ర ప్రభుత్వ రంగ విమాన యాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’లో ఆగస్టు 11వ తేదీ వచ్చినా ఇప్పటి వరకు జూలై నెల వేతనాలు చెల్లించనే లేదు. సేవల్లో ‘మహారాజా’గా పేరొందిన ఎయిర్ ఇండియా ఇప్పటికే తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇటీవల వాటాలను విక్రయించేందుకు కేంద్రం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కానీ వేతనాలను ఆలస్యంగా చెల్లిస్తుండటంతో సంస్థ భవితవ్యం సురక్షితమేనా ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

‘మహారాజా’కు రూ.2100 కోట్లు తక్షణ అవసరం


అసలు మన సంస్థ సురక్షితమేనా? అని ప్రశ్నిస్తూ ఇండియన్‌ కమర్షియల్‌ పైలట్స్‌ అసోసియేషన్‌లో ఉన్న ఎయిరిండియా పైలట్లు యాజమాన్యానికి లేఖ రాశారు. ఆగస్టు రెండో వారం ముగుస్తున్నా ఇంకా వేతనాలు అందకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.ప్రభుత్వ వర్గాల కథనం ప్రకారం అప్పుల ఊబిలో చిక్కుకున్న ఎయిరిండియాను తక్షణం ఆదుకునేందుకు స్వల్పకాలిక ప్రాతిపదికన రూ.2100 కోట్ల పెట్టుబడి అవసరం అని తెలుస్తోంది. 

ఇలా ఎయిర్ ఇండియా ఎండీకి లేఖ


ఈ మేరకు ఎయిర్ ఇండియా ఎండీకి భారతీయ వాణిజ్య విమానాల పైలట్ల యూనియన్ ప్రధాన కార్యదర్శి దీపంకర్ గుప్తా రాసిన లేఖలో ‘వరుసగా ఐదో నెల మాకు వేతనాలు ఇవ్వడం ఆలస్యం చేశారు. కనీసం వేతనాలు ఆలస్యమవుతాయనే సమాచారం కూడా మీ నుంచి మాకు రాలేదు. ఈ విషయంలో యాజమాన్యం విఫలమైంది. వేతనాలు సరైన సమయానికి ఇవ్వకపోవడం వల్ల సంస్థపై ఉన్న నమ్మకం సన్నగిల్లుతోంది. ఏదైనా ఒక సంస్థ సక్రమంగా పని చేయాలంటే ఉద్యోగులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వ విధానాలు, మార్కెట్‌ పరిస్థితుల కారణంగా ‘మహారాజీ’ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అసలు నిజంగానే మన సంస్థ సురక్షితమేనా’ అని ప్రశ్నించారు. సంస్థ నిర్వహణకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయా? అని నిలదీశారు. 

నాలుగు నెలలుగా వేతనాల్లో జాప్యం


మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలో ఎయిరిండియా ఉద్యోగులకు వేతనాలు ఆలస్యంగా అందాయి. ఇప్పుడు జూలై నెల వేతనం ఇంకా ఉద్యోగుల చేతికి అందలేదు. భవిష్యత్‌లో వేతనాల ఆలస్యం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని ఎయిరిండియా యాజమాన్యం ఉద్యోగులకు హామీ ఇచ్చిన నెల రోజుల వ్యవధిలోనే ఇలా జరిగింది. ఆగస్టు రెండో వారం ముగుస్తున్నా తమ వేతనాలు ఇంకా రాలేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ఇండియా, జెట్ ఎయిర్ వేస్ సంస్థలకు పౌర విమానయాన మార్కెట్‌లో 28 శాతం వాటా ఉంటుంది. 

హెచ్‌డీఎఫ్‌సీ డిప్యూటీ ఎండీ రాజీనామా

 
దేశంలో రెండో అతిపెద్ద ప్రయివేటు ఆర్థిక సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పరేశ్‌ సుక్తాంకర్‌ అనుహ్యాంగా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన మూడు నెలల్లో పదవిని వీడనున్నారని శుక్రవారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వర్గాలు తెలిపాయి. ఆదిత్య పూరీకి సహజమైన వారసుడిగా పరేశ్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. పరేశ్ సుక్తాంకర్ తన రాజీనామాకు ఎలాంటి కారణాలను చూపారన్న విషయం వెల్లడి కాలేదు. దాదాపుగా రెండు దశాబ్దాలుగా పరేశ్‌ ఈ బ్యాంకులోనే పని చేస్తున్నారు. 2017లో బ్యాంకు డిప్యూటీ ఎండిగా నియమితులైన పరేశ్‌ పదవీకాలం 2020 అక్టోబర్‌తో ముగియనున్నది. 

పదవీ కాలానికి ముందే వైదొలిగిన పరేశ్ సుక్తాంకర్


పదవీకాలం ఇంకా మిగిలి వుండగానే హెచ్‌డీఎఫ్‌సీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి పరేశ్ సుక్తాంకర్ వైదొలగడం బ్యాంకింగ్‌ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. పరేశ్‌ను పునర్‌ నియామకానికి వాటాదారుల అనుమతిని కోరనున్నట్టు ఈ ఏడాది జూన్‌లో బ్యాంకు ప్రకటించింది. ఇంతలోనే ఆయన రాజీనామా ప్రకటన చోటు చేసుకోవడం ఆ వర్గాలను ఆశ్యర్యానికి గురి చేసింది. అయితే పరేశ్‌ స్థానంలో ఎవర్ని నియమించనున్నారనేది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వెల్లడించలేదు.