అమెరికాలో 2 రోజుల్లో 2 బ్యాంకులు దివాళా తీశాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ తర్వాత, ఇప్పుడు మరో అమెరికన్ బ్యాంక్ దివాలా తీసింది,
అమెరికాలో మరో బ్యాంకు కుప్పకూలింది. న్యూయార్క్‌లోని సిగ్నేచర్ బ్యాంక్ దివాళా తీసింది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం తర్వాత, మరో బ్యాంక్ పతనంతో ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ స్టాక్స్ ప్రభావితం అయ్యాయి. వారం రోజుల్లోనే రెండు బ్యాంకులు కుప్పకూలడంతో ప్రపంచ ఆర్థికరంగం మళ్లీ మాంద్యంలోకి జారుకుంటుందనే భయం అందరిలో నెలకొంది. అయితే మరిన్ని బ్యాంకులు దివాళా తీయకుండా నివారించడానికి అధ్యక్షుడు జో బిడెన్ అత్యవసర చర్యలకు ఆదేశించారు. 11,000 కోట్ల ఆస్తులున్న సిగ్నేచర్ బ్యాంక్ కుప్పకూలడంతో చాలా మంది ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేసింది. డిపాజిటర్లకు డబ్బు తిరిగి చెల్లిస్తామని బ్యాంకింగ్, బీమా అధికారులు హామీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే HSBC సిలికాన్ వ్యాలీ బ్యాంక్ బ్రిటిష్ శాఖను స్వాధీనం చేసుకుంది. HSBC యూరోప్‌లో అతిపెద్ద బ్యాంక్. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మూసివేత నేపథ్యంలో ఏర్పడిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఈ కొనుగోలు ప్రక్రియకు తెరలేపింది. మరోవైపు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ UK కస్టమర్లకు మెరుగైన సేవలను అందిస్తామని HSBC ఇప్పటికే ప్రకటించింది.
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అమెరికాలోని అతిపెద్ద వాణిజ్య బ్యాంకుల్లో ఒకటి. ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇప్పటికే బ్యాంక్ ఆస్తులను జప్తు చేసింది. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ఇదే అతిపెద్ద బ్యాంకింగ్ సంక్షోభంగా చెప్పవచ్చు.
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ యజమానులైన SVB ఫైనాన్షియల్ గ్రూప్ బుధవారం 175 కోట్ల డాలర్లు (దాదాపు రూ. 14,300 కోట్లు) వాటా విక్రయాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అనేక సమస్యలు మొదలయ్యాయి. కంపెనీ బ్యాలెన్స్ షీట్‌లో నష్టాన్ని తగ్గించడంలో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు ఎస్‌విబి గ్రూప్ వివరణ ఇచ్చింది. అయితే ఇది బ్యాంకు షేర్ విలువ పతనానికి దారితీసింది. SVB బ్యాంక్ ఖాతాదారులలో ఎక్కువ మంది సిలికాన్ వ్యాలీ స్టార్టప్‌లు , స్టార్టప్ పెట్టుబడిదారులు. ఒక్కసారిగా ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించడం సంక్షోభం ఊపందుకుంది.
అమెరికాలో గత 2 రోజుల్లో 2 బ్యాంకులు మునిగిపోయాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దివాళా తీసిన తర్వాత ఇప్పుడు అమెరికా సిగ్నేచర్ బ్యాంక్ కూడా దివాళా తీసింది. గత 2 రోజులుగా అమెరికాలో 2 బ్యాంకులు మూతపడగా.. ఆ తర్వాత కూడా అమెరికా మార్కెట్లు ఊపందుకున్నాయి. డిపాజిటర్ల సొమ్ము భద్రంగా ఉందని, వారు తమ డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు వీలుంటుందని అమెరికా ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చిన నేపథ్యంలో అమెరికన్ మార్కెట్లు పాజటివ్ గా స్పందించాయి.
