ముంబై: దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడన్నట్లు దేశీయ బ్యాంకింగ్ లావాదేవీలను నియంత్రించే అధికారం గల ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపునకు రెపొరేట్ తగ్గించినా తక్షణం బ్యాంకుల్లో వడ్డీరేట్లు తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. మూడు రోజుల పాటు జరిగిన ఎంసీసీ కమిటీ భేటీ మరోసారి 25 బేసిక్ పాయింట్లు రెపోరేట్ తగ్గించాలని నిర్ణయించింది. 

ఆరు శాతానికి రెపోరేటు పరిమితం
దీంతో ఆర్బీఐ రెపో రేటు ఆరు శాతానికి పరిమితం అవుతుంది. ఆర్బీఐ వరుసగా రెండు విధాన సమీక్షల్లో కీలక రేట్లను తగ్గించడం గమనార్హం. తటస్థ విధాన వైఖరిని కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఎంపీసీలోని ఆరుగురు సభ్యుల్లో నలుగురు కీలక రేట్ల తగ్గింపు వైపు మొగ్గు చూపారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు అంచనా 7.2 శాతమే
2019-20 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాను 7.2 శాతానికి కుదిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం అంచనాను 2.4 శాతానికి తగ్గించింది. ఉత్పత్తిలో ప్రతికూల వృద్ధికి అవకాశం ఉన్నదని, దేశీయ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు ఎదురు అవుతాయని హెచ్చరించింది. తదుపరి జూన్ ఆరో తేదీన ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలు వెలువడతాయని ఆర్బీఐ తెలిపింది.  

ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకే ఆర్బీఐ ఇలా
సార్వత్రిక ఎన్నికల ముంగిట నిస్తేజంగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఆర్బీఐ ప్రయత్నించినట్లు కనిపించింది. గురువారం ఆర్‌బీఐ వెల్లడించిన పరపతి విధాన సమీక్ష నిర్ణయాల ప్రకారం.. రెపో రేటు పావు శాతం తగ్గి ఆరు శాతానికి పరిమితమైంది. 2018 ఏప్రిల్‌ తర్వాత రెపో రేటుకు ఇంత తక్కువ స్థాయికి దిగిరావడం ఇదే మొదటిసారి. 

2016 తర్వాత రెండుసార్లు రెపోరేట్ తగ్గింపు ఇదే ప్రథమం
2016లో పరపతి విధాన కమిటీ ఏర్పాటయ్యాక ఆర్‌బీఐ ఇలా వరుసగా రెండు సార్లు కీలక రేట్లను తగ్గించడం కూడా ఇదే మొదటిసారి. తాజా రేట్ల కోతతో గృహా, వాహన, ఇతరత్రా రుణాలు చౌక అయ్యే అవకాశం లేదు. కొత్త వడ్డీరేట్ల విధాన అమలును ఆర్‌బీఐ వాయిదా వేయడమే ఇందుకు కారణం.

ఐఎంఎఫ్ మాదిరిగానే వృద్ధి రేటుపై ఆర్బీఐ
అంతర్జాతీయంగా ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకొని 2019- 20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి అంచనాలను 7.2 శాతానికి ఆర్‌బీఐ తగ్గించింది. గత ఫిబ్రవరి పరపతి విధాన సమీక్షలో జీడీపీ వృద్ధి 7.4 శాతంగా నమోదు కావొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. తాజాగా ఆర్‌బీఐ అంచనా వేసిన 7.2 శాతానికే. ఐఎంఎఫ్‌ కూడా తన తాజా అంచనాల్లో పేర్కొనడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధబాగంలో 6.8- 7.1%, రెండో అర్ధబాగంలో 7.3- 7.4% మధ్య వృద్ధి రేటు నమోదుకావొచ్చని ఆర్బీఐ తెలిపింది. 

ఎంసీసీలో నలుగురు రేట్ల తగ్గింపునకు మొగ్గు
ఇది ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్‌ నేతృత్వంలో జరిగిన రెండో పరపతి విధాన కమిటీ సమావేశం. ఎంపీసీలోని గవర్నర్ సహా ఆరుగురు సభ్యుల్లో నలుగురు కీలక రేట్లను పావు శాతం తగ్గించేందుకు మొగ్గు చూపారు. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్‌ ఆచార్య, మరో సభ్యుడు చేతన్‌ ఘటే రేట్ల యథాతథానికి మొగ్గుచూపారు. తటస్థ విధాన వైఖరిని కొనసాగించేందుకు రవీంద్ర డొలాకియా మినహా మిగిలిన సభ్యులందరూ అంగీకరించారు. 

ద్రవ్యోల్బణం తగ్గుతుందని ఆర్బీఐ అంచనాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధబాగం రిటైల్‌ ద్రవ్యోల్బణ అంచనాలను 2.9- 3 శాతానికి ఆర్బీఐ తగ్గించింది. ఆహార పదార్ధాలు, ఇంధన ధరలు తగ్గడం, సానుకూల వర్షపాత అంచనాలతో ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి సమీక్షలో 2019-20 తొలి అర్ధబాగంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.2- 3.4 శాతం మధ్య నమోదు కావచ్చని ఆర్‌బీఐ అంచనా వేసిన సంగతి తెలిసిందే. అయితే రానున్న రోజుల్లో అంతర్జాతీయ చమురు ధరలు, ఆహార పదార్థాలు తిరిగి పెరగడం ప్రారంభమైతే ద్రవ్యోల్బణానికి ముప్పు ఉండే అవకాశం ఉందని ఆర్‌బీఐ తెలిపింది. 

ఆర్బీఐ నిల్వలపై జలాన్ కమిటీ చర్చలు
ఆర్బీఐ వద్ద ఎంత పరిమాణంలో నిల్వలు ఉండాలనే విషయంపై ఏర్పాటు చేసిన బిమల్‌ జలాన్‌ కమిటీ త్వరలోనే నివేదిక సమర్పిస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ప్రస్తుతం చర్చలు తుది దశలో ఉన్నాయని తెలిపారు. తుది నివేదికను ఖరారు చేసేందుకు కమిటీకి మరింత సమయం అవసరం అవుతుందని అనుకుంటున్నానని పేర్కొన్నారు. 

రెపోరేట్ తగ్గించినా.. వడ్డీరేట్ల తగ్గింపుపై తాత్సారం
వరసగా రెండోసారి రెపో రేటును పావు శాతం తగ్గించడం ద్వారా ఆర్బీఐ రుణ గ్రహీతలకు శుభవార్త వినిపించింది. రెండు నెలల్లో రెపోరేట్ 0.50శాతం తగ్గినట్లే. కానీ.. ఈ తగ్గిన వడ్డీ రేట్లు బ్యాంకులు ఇప్పటికీ తమ రుణగ్రహీతలకు బదిలీ చేయడంలో తాత్సారం చేస్తూనే ఉన్నాయి. ఈసారీ ఇదే జరుగుతుందా? బ్యాంకులు ఎలాంటి చర్యలు తీసుకుంటాయనేదే ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది.

ఎంసీఎల్ఆర్ పాటిస్తున్న బ్యాంకర్లు
ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించిందనగానే.. బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్న వారు ముఖ్యంగా.. గృహరుణ గ్రహీతలు సంతోషపడేవారు. కానీ, ఇదంతా గతం. ఇప్పుడు ఆర్‌బీఐ రెపో రేటు తగ్గినా.. పెరిగినా.. బ్యాంకులు మాత్రం తమ ఇష్టానుసారం వడ్డీ రేట్లను విధించడం మొదలుపెట్టాయి. బ్యాంకులు తమ రుణాల వడ్డీ రేట్లను నిర్ణయించేందుకు ఎంసీఎల్‌ఆర్‌ (మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెడింగ్‌ రేట్‌) విధానాన్ని పాటిస్తుంటాయి. దీంతో ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించినా.. తమ ఎంసీఎల్‌ఆర్‌ను సవరించలేదు కాబట్టి, దానికి అనుబంధంగా ఉన్న వడ్డీ రేట్లను కూడా తగ్గించేందుకు ఇష్టపడటం లేదు.

గతనెలలోనే ఎంసీఎల్ఆర్ తగ్గించిన బ్యాంకులు
గత నెలలోనే ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పీఎన్‌బీ, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తదితర బ్యాంకులు తమ ఎంసీఎల్‌ఆర్‌ను 5-15 బేసిస్‌ పాయింట్ల మేరకు తగ్గించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రెపో రేటు తగ్గినా బ్యాంకులు పెద్దగా స్పందించకపోవచ్చనేది బ్యాంకింగ్‌ నిపుణుల అంచనా.

ఇంటి రుణ చెల్లింపులు ఇలా
ఉదాహరణకు రూ.30లక్షల గృహరుణాన్ని 15 ఏళ్ల వ్యవధికి తీసుకున్నారని అనుకుందాం. ఎస్‌బీఐ ఈ రుణాలపై ప్రస్తుతం 8.75శాతం వసూలు చేస్తోంది. అంటే.. నెలసరి వాయిదా రూ.29,983 అవుతుంది. ఇక ప్రస్తుతం పావుశాతం తగ్గిస్తే.. వడ్డీ రేటు 8.50 శాతానికి చేరుకుంటుంది. అప్పుడు ఈఎంఐ రూ.29,542 అవుతుంది. నెలవారీగా చూస్తే ఇందులో పెద్ద లాభం ఉన్నట్లు కనిపించకకున్నా. మొత్తంగా చూస్తే.. రూ.80 వేల వరకూ వడ్డీ తక్కువ చెల్లించాల్సి ఉంటుంది. 

ఆర్బీఐ తగ్గించిందని ఎదురుచూస్తే నిరాశే
ఇదే విధంగా రూ.10లక్షల కారు రుణాన్ని 7 ఏళ్ల వ్యవధికి తీసుకున్నారనుకుందాం.. అప్పుడు 9.75శాతం నుంచి 9.5శాతానికి వడ్డీ రేటు మారితే.. దాదాపు రూ.10,730 వడ్డీ భారం తగ్గుతుంది.ఆర్‌బీఐ తగ్గించింది కదా.. బ్యాంకులూ తగ్గిస్తాయని ఎదురుచూస్తే మాత్రం మీకు కాస్త నిరాశ తప్పకపోవచ్చు. 

ఎంసీఎల్ఆర్ అమలులో చిక్కులు ఉన్నాయన్న ఆర్బీఐ
ఎంసీఎల్‌ఆర్‌ అమలులో కొన్ని చిక్కులు ఉన్నాయని ఆర్బీఐ తేల్చింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ రేట్లను ప్రామాణికంగా తీసుకోవాలని గత ఏడాది డిసెంబర్ నెలలో 6న జరిగిన సమీక్షలో సూచించింది. చలన వడ్డీ విధానంలో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు, ఎంఎస్‌ఈలు అప్పు తీసుకున్నప్పుడు, మార్కెట్‌లో ఉండే ప్రధాన సూచీలను వడ్డీ రేట్లు నిర్ణయించాల్సి ఉంటుంది. 

వడ్డీరేట్ల తగ్గింపు, పెంపునకు ఇవీ ప్రమాణాలు
ఇందులో 1. ఆర్‌బీఐ రెపో రేటు 2. భారత ప్రభుత్వం జారీ చేసే 91 రోజుల ట్రెజరీ బిల్లుకు ఫైనాన్షియల్‌ బెంచ్‌మార్క్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌బీఐఎల్‌) నిర్ణయించిన రాబడి 3. భారత ప్రభుత్వం జారీ చేసే 182 రోజుల ట్రెజరీ బిల్లుకు ఎఫ్‌బీఐఎల్‌ అందించిన రాబడి 4. ఎఫ్‌బీఐఎల్‌ రూపొందించిన ఇతర ప్రామాణిక సూచీలు.. 

బ్యాంకుల విచక్షణ ఆధారంగానే వడ్డీరేట్లపై నిర్ణయం
ఈ ప్రామాణిక సూచీల వడ్డీ రేట్లపై ఎంత శాతం అధికంగా నిర్ణయించాలన్నది బ్యాంకుల విచక్షణపై ఆధారపడి ఉంటుంది. రుణం తీసుకునేప్పుడు రుణగ్రహీత వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. ఒకసారి ఈ విధానాన్ని ఎంచుకుంటే.. రుణ వ్యవధి ముగిసేదాకా వీటిపై ఆధారపడే వడ్డీ రేటు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది.

వడ్డీరేట్ల తగ్గింపుపై చర్చ జరుగాలన్న ఆర్బీఐ
ఇప్పటికే దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ వచ్చే నెల ఒకటో తేదీనుంచి ఫిక్స్‌డ్‌ డిపాజట్లకూ, స్వల్పకాలిక వ్యవధి రుణాలకు ఆర్‌బీఐ రెపో రేటును ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే, గురువారం ఆర్‌బీఐ ఈ ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ రేట్లను అమలును వాయిదా వేసింది. ఈ విషయంలో మరింత లోతైన చర్చ జరగాల్సిన అభిప్రాయం ఉందన్నది.

ఇబ్బందులను పరిశీలించాలన్న ఎస్బీఐ
వడ్డీ రేట్ల నిర్వహణ, సాంకేతికత అభివృద్ధిలాంటి విషయంలో ఇబ్బందులను పరిశీలించాల్సిన అవసరం ఉందని ఎస్బీఐ తెలిపింది. ఆ తర్వాతే కొత్త రేటు విధానాన్ని మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు వీలవుతుందని పేర్కొంది. అంతర్జాతీయంగా అమలవుతున్న వడ్డీ రేట్లను అధ్యయనం చేసేందుకు ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. కాబట్టి, రుణగ్రహీతలు ఇంకా కొంతకాలం ఎంసీఎల్‌ఆర్‌ విధానంలోనే కొనసాగక తప్పదు.

ద్రవ్యోల్బణం తగ్గుతుందని ఆర్బీఐ అంచనాలు 
మున్ముందూ ద్రవ్యోల్బణం నియంత్రిత స్థాయిలోనే ఉండొచ్చని భావిస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ఆర్థిక వ్యవస్థకు స్థిరమైన వృద్ధి దిశగా సాగే విషయంలో సవాళ్లు ఎదురుకావచ్చునన్నారు. వీటిని ఎదుర్కొని ముందుకు వెళ్లేందుకు ఈ నిర్ణయాలు తోడ్పడుతాయని చెప్పారు.. ప్రైవేట్‌ పెట్టుబడుల్లోనూ స్తబ్దత నెలకొంది. ఇవి కూడా పుంజుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. స్థూల ఆర్థిక, ద్రవ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని,  ఆర్థిక వ్యవస్థపై అంచనాలు చేసేందుకు, విధానాల రూపకల్పనకు సీఎస్‌ఓ రూపొందించిన అధికారిక గణాంకాలనే ఆర్‌బీఐ ప్రామాణికంగా తీసుకుంటోందని శక్తికాంత దాస్‌ చెప్పారు.

ఎన్బీఎఫ్సీలకూ అంబుడ్స్ మెన్ పథకం వర్తింపజేసిన ఆర్బీఐ
వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార నిమిత్తం డిపాజిట్లు స్వీకరించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీ) ప్రవేశపెట్టిన అంబుడ్స్‌మన్‌ పథకాన్ని డిపాజిట్లు స్వీకరించని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు కూడా ఆర్‌బీఐ వర్తింపజేసింది. నగదు బదిలీ లేదా ఉపసంహరణ లావాదేవీలు విఫలమైనప్పుడు తిరిగి ఆ మొత్తాన్ని వినియోగదారుకు చెల్లించే విషయంలో జాప్యం జరిగినప్పుడు పరిహారానికి సంబంధించి నిర్దిష్ట మార్గదర్శకాలను ఆర్‌బీఐ తీసుకు రానుంది. ఇప్పటికే కొన్ని పేమెంట్‌ సిస్టమ్స్‌కు ఇలాంటి మార్గదర్శకాలను ఆర్‌బీఐ జారీ చేసింది.