ఇప్పటివరకు భారత్ ఆర్థిక మూలాలు గట్టిగా ఉన్నాయని, అంతర్జాతీయ సమస్యలను ఎదుర్కోగలమని కేంద్ర ప్రతినిధులు, మంత్రులు ఘంటాపథంగా చెబుతూ వచ్చే వారు. కాల క్రమంలో అటువారు ఇటు ఇటువారు అటు అన్నట్లు పరిస్థితులు తారుమారు అయ్యాయి. దీంతో మదుపర్లలో భయాందోళన వ్యక్తమవుతోంది.

చైనా- అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం, ముడి చమురు ధరల పెరుగుదలతోపాటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ మదుపు ఉపసంహరించుకోవడంతో రూపాయి పతనం ఒకవైపు.. మరోవైపు స్టాక్స్ పతనం అవుతున్నాయి. ఫలితంగా సోమ, మంగళవారాల్లోనే రమారమీ 977 పాయింట్లు నష్ట పోయాయి. 

నిఫ్టీలోని 50 షేర్లు రెండు రోజుల్లో పట్టుమని పది షేర్లు లాభాలు సాధించలేకపోయాయి. రెండు రోజుల్లో నిఫ్టీ 302 పాయింట్ల నష్టంతో 11,287.50 వద్ద ముగిసింది. రెండురోజుల్లో రూ. 4.15 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకు పోయింది. ఆగస్టు రెండోన తర్వాత నిఫ్టీకి ఇదే కనీస స్థాయి.

బీఎస్ఈ సెన్సెక్స్‌ ఏకంగా 509 పాయింట్లు పతనమై 38వేల స్థాయిని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎఫ్‌ఎమ్‌సీజీ, టెలికం, కన్జూమర్ డ్యూరబుల్, లోహ, వాహన, ఆర్థిక రంగాల షేర్లన్నీ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడం సూచీల పతనానికి కారణమైంది. ఫార్మా, బ్యాంకింగ్ రంగాల షేర్లు దెబ్బ తిన్నాయి. 

మంగళవారం ఉదయం సెన్సెక్స్‌ 38017.49 పాయింట్ల వద్ద స్తబ్దుగా  మొదలైన ట్రేడింగ్ మధ్యాహ్నం వరకు స్వల్ప నష్టాలతోనే చలించింది. ఆ తర్వాత అమ్మకాలు వెల్లువెత్తాయి. సూచీలు చకచకా పతనం అయ్యాయి. బీఎస్ఈ 37361.20 పాయింట్ల వరకు పతనమవుతూ వచ్చింది. చివరకు 509 పాయింట్ల నష్టంతో 37,413.13 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 150.60 పాయింట్లు కోల్పోయి 11,287.50 వద్ద స్థిరపడింది. 

మరోవైపు మంగళవారం రూపాయి మారకం విలుతా తాజా జీవితకాల కనీస స్థాయి రూ. 72.74ను తాకింది. క్రూడాయిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో డాలర్లకు డిమాండ్ పెరిగింది. ఇప్పటివరకూ ఈ ఏడాది రూపాయి విలువ 13 శాతం నష్టపోయింది.

దీనికి తోడు అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందన్న వార్తలూ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే వర్ధమాన దేశాల నుంచి పెట్టుబడులు అమెరికాకు తరలివెళ్తాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఎఫ్‌ఐఐలు ఈ రోజు రూ. 1454.36 కోట్ల అమ్మకాలు జరిపారు. 

రూపాయి విలువ మరి కొంత పతనం అయ్యే అవకాశం ఉన్నా, తిరిగి కోలుకునే అవకాశాలు ఉన్నాయని కార్విబ్రోకింగ్ సీఈవో రాజీవ్‌రంజన్ సింగ్ విశ్లేషించారు. వర్థమాన దేశాల కరెన్సీల పతనం ప్రపంచ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడిని పెంచిందని, రూపాయి మారకం విలువన సమీప భవిష్యత్‌లో రూ.73 నుంచి రూ.73.50 వరకు పతనం కావచ్చునని ఆయన అంచనా వేశారు. మరో వైపు గ్లోబల్ ట్రేడ్ వార్ ఆందోళనలు పెరుగుతున్నాయి. అమెరికాతో వాణిజ్య వివాదంలో ఆంక్షలు విధించాలంటూ చైనా డబ్యూటీవోను కోరింది.

అలాగే అమెరికా అదనపు సుంకాలకు ప్రతీకారంగా తాము కూడా సుంకాలను విధిస్తామంటూ చైనా ప్రకటించడంతో వాణిజ్య సుంకాల పోరు చిలికి చిలికి గాలివానలా మారే అవకాశాలు పెరుగుతున్నాయి. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ చమురు ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. మిగతా దేశాలు క్రూడ్ ఉత్పత్తిని పెంచాలన్న ట్రంప్ వినతిని ఎంతవరకు పాటిస్తాయో చూడాలి. క్రూడాయిల్ ధరలు మరింతగా పెరగడం అమెరికాకు ఇష్టంలేదు. బ్రెంట్ క్రూడాయిల్ ధరలు 77.83 డాలర్లకు చేరుకుంది. 

ప్రధాన ఇండెక్స్‌లతో పాటు దాదాపు అన్ని రంగాల ఇండెక్స్‌లు నష్టాల్లోనే ముగిసాయి. ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ గరిష్టంగా 2.41 శాతం మేర ముగిసింది. ఆ తర్వాత రియాల్టీ ఇండెక్స్ 1.99 శాతం, మెటల్ ఇండెక్స్ 1.61 శాతం, ఫార్మా ఇండెక్స్ 1.60 శాతం, ఆటో ఇండెక్స్ 1.50 శాతం, బ్యాంక్ నిఫ్టీ 1.45 శాతం చొప్పున నష్టపోయాయి.

నిఫ్టీ మిడ్ క్యాప్-100 ఇండెక్స్ 1.34 శాతం, స్మాల్‌క్యాప్-100 ఇండెక్స్ 1.54 శాతం మేర నష్టపోయాయి. కాగా, మార్కెట్ బ్రెడ్త్ సోమవారం కన్నా క్షీణించింది. నిఫ్టీ 50 షేర్లలో కేవలం ఆరు షేర్లే లాభాల్లో ముగిసాయి ఎన్‌ఎస్‌ఈలో మొత్తం 1282 షేర్లు నష్టాల్లో ముగిస్తే కేవలం 468 షేర్లు మాత్రమే లాభాల్లో ముగిసాయి.

కోల్ ఇండియా 1.72 శాతం లాభపడగా, ఎంఅండ్‌ఎం 1.03 ఎన్‌టీపీసీ 0.53 శాతం,మేర లాభపడ్డాయి. టైటాన్ 4.50 శాతం నష్టపోతే టాటా స్టీల్ 3.94 శాతం, ఐటీసీ 3.38 శాతం, టాటామోటార్స్ 3.25 శాతం చొప్పున నష్టపోయాయి.

మరోవైపు మార్కెట్‌ పతనంలోనూ కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, ఎంఅండ్‌ఎం, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు రాణించగలిగాయి. చిన్న, మధ్యతరహా షేర్ల సూచీలు 1.37% వరకు నష్టపోయాయి. బీఎస్‌ఈలో 1,841 షేర్లు ప్రతికూలంగా, 874 సానుకూలంగా ముగిశాయి. మొత్తం టర్నోవర్ రూ.3,059.03 కోట్లుగా నమోదైంది. 

వరుసగా రెండో నెలా వాహన విక్రయాలు నెమ్మదించడంతో ఆ ప్రభావం ఈ రంగ షేర్లపై పడింది. బీఎస్‌ఈలో అపోలో టైర్స్‌ 4.17%, హీరో మోటోకార్ప్‌ 3.06%, టాటా మోటార్స్‌ 3.03%, టీవీఎస్‌ మోటార్‌ 2.64%, అశోక్‌ లేలాండ్‌ 1.73%, మారుతీ సుజుకీ ఇండియా 1.56%, బజాజ్‌ ఆటో 1.24% చొప్పున నష్టపోయాయి.

ఈ ప్రభావంతో వాహన సూచీ 1.52% కుంగింది. అయితే నెల ప్రారంభంలోనే విక్రయ గణాంకాల ప్రభావం పడినందున.. ఇప్పుడు మళ్లీ షేర్లు నష్టపోవడానికి మార్కెట్‌ ప్రతికూల సెంటిమెంట్ కూడా కొంతమేర పనిచేసిందని చెప్పొచ్చు. 

రూపాయి పతనం కొనసాగడంతోపాటు వాణిజ్య లోటు పెరగడం, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్లను పెంచొచ్చన్న అంచనాలతో  మదుపర్ల సెంటిమెంటు దెబ్బతినడం వంటి అంశాలతో మదుపర్లు అమ్మకాల వైపు ముగ్గు చూపారు. సెన్సెక్స్‌లో ఆరు మినహా మిగిలిన 24 షేర్లు నష్టాలను మూటకట్టుకున్నాయి.