న్యూఢిల్లీ/ ముంబై: అంతర్జాతీయ భయాలు.. ప్రత్యేకించి అమెరికా ఫెడ్ రిజర్వు పావుశాతం వడ్డీరేట్లు పెంచడంతో శుక్రవారం భారత స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాలకు గురైంది. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్‌ 689.60 పాయింట్ల నష్టంతో 35742 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 197.70 పాయింట్ల నష్టంతో 10754 వద్ద ముగిశాయి. అమ్మకాల హోరుతో బీఎస్ఈలో వివిధ రంగాల సూచీలు నష్టాల బాట పట్టాయి. ఐటీ, టెక్నాలజీ, ఆటో, టెలికాం, వినియోగ వస్తూత్పత్తి కంపెనీల షేర్లలో అమ్మకాల హోరు మరీ ఎక్కువగా కనిపించింది. ఈ అమ్మకాల ఒత్తిడితో బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల షేర్ల మార్కెట్‌ విలువ (మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌) శుక్రవారం ఒక్కరోజే రూ.2.26 లక్షల కోట్లు పడిపోయింది. ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్‌, కోల్‌ ఇండియా తదితర కొద్ది కంపెనీల షేర్లు మాత్రమే స్వల్ప లాభాలతో ముగిశాయి.

 
ఇటీవల కొన్ని కంపెనీల షేర్లు బాగా పెరిగినా మున్ముందు ఆటుపోట్లు తప్పవన్న అంచనాతో మదుపరులు ఈ షేర్లలో లాభాల స్వీకారానికి దిగారు. ప్రత్యేకించి అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీ రేట్లు మరింత పెరగడంతో విదేశీ పోర్టుఫోలియో సంస్థ (ఎఫ్‌పీఐ)లు అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగింది. దీంతో సూచీలకు నష్టాలు తప్పలేదు.
 
వడ్డీ రేట్ల పెంపుపై అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పోవెల్‌ చేసిన వ్యాఖ్యలు, మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. వృద్ధి రేటు నీరసిస్తున్న సూచనలు కనిపిస్తున్నా, వచ్చే ఏడాది ముందు ప్రకటించినట్లు వడ్డీ రేట్లు పెంచుతామని పోవెల్‌ ప్రకటించారు. దీనికి తోడు అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. మరోవైపు అధ్యక్షుడు ట్రంప్‌-కాంగ్రెస్‌ మధ్య కొనసాగుతున్న విభేదాలతో అమెరికా ప్రభుత్వం స్తంభించి ‘షట్ డౌన్’ ముప్పు పొంచి ఉన్నది. దీంతో గురువారం రాత్రి అమెరికా, యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు కూడా నీరసించాయి. దీని ప్రభావం శుక్రవారం భారత మార్కెట్‌పైనా కనిపించింది.
 
ఇటీవల కోలుకున్న రూపాయి మారకం విలువ శుక్రవారం మళ్లీ చతికిల పడింది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఒక దశలో 56 పైసల వరకు నష్ట పోవడం మార్కెట్‌ పతనానికి కూడా ఒక కారణం. అంతర్జాతీయ మార్కెట్లో వారంలో పీపా ముడి చమురు ధర 10 శాతం పడిపోయిది. ప్రస్తుతం 55 డాలర్ల దిగువకు వచ్చింది. దీంతో ఇంధన కంపెనీల షేర్లపై సెంటిమెంట్‌ దెబ్బతింది. క్రూడ్‌ ధర తగ్గే కొద్దీ ఈ కంపెనీల లాభాలకు గండి పడుతుందనే భయంతో ఇన్వెస్టర్లు ఈ కంపెనీల షేర్లు భారీగా విక్రయించారు.  
 
లోక్‌సభ ఎన్నికల్లోపు కేంద్రం దేశ వ్యాప్తంగా వ్యవసాయ రుణాల మాఫీ అమలు చేయడంతో పాటు మరిన్ని ప్రజాకర్షక పథకాలు ప్రకటించే అవకాశం ఉందన్న వార్తలు మార్కెట్‌ను భయపెడుతున్నాయి. అదే జరిగితే బ్యాంకింగ్‌ రంగం ఆర్థిక పరిస్థితితో పాటు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని మార్కెట్‌ భయపడుతోంది. ఇది ద్రవ్యోల్బణానికి దారితీసే ప్రమాదం ఉందనే హెచ్చరికలూ వినిపిస్తున్నాయి.

గ్లోబల్ మార్కెట్లు ఈ ఏడాదంతా ఒడిదుడుకులకు గురయ్యాయని వచ్చే ఏడాదీ ఇదే పరిస్థితి కొనసాగవచ్చునని సెబీ చైర్మన్ అజయ్ త్యాగి అన్నారు. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, చమురు ధరల్లో ఒడిదుడుకుల, వాణిజ్య యుద్ధం భయాలు, పలు ఆంక్షలు తదితర అంశాలతో ప్రపంచ మార్కెట్లు వచ్చే ఏడాది కూడా హెచ్చుతగ్గులకు లోనవుతాయని కోల్‌కతా-ఐఐఎం 8వ ఇండియా ఫైనాన్స్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు. 

కాగా, ప్రపంచ మార్కెట్లతో పోల్చితే, దేశీయ స్టాక్ మార్కెట్‌లో అత్యంత తక్కువగా ఒడిదుడుకులు గత ఏడాది కాలంలో నమోదయ్యాయని సెబీ చైర్మన్ అజయ్ త్యాగి అన్నారు. అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాల స్టాక్ మార్కెట్లతో పాటు బ్రిటన్ స్టాక్‌మార్కెట్‌లో 12% ఒడిదుడుకులు నమోదు కాగా, చైనా 19%, బ్రెజిల్ 21%, జపాన్ 17%, దక్షిణా కొరియా 14% చొప్పున ఒడిదుడుకులకు లోనయ్యాయని తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో నిఫ్టీలొ కేవలం 5.8 శాతం మాత్రమే ఒడిదుడుకులు నమోదయ్యాయన్నారు. సెప్టెంబర్ నుంచి ఎన్‌బీఎఫ్‌సీలు, హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీలు లిక్విడిటీ సమస్యను ఎదుర్కొంటున్నా రిజర్వ్ బ్యాంక్ చొరవతో చాలా వరకు సమసిపోయిందని అన్నారు.