భారీ అప్పుల్లో కూరుకుపోయిన జేపీ అసోసియేట్స్‌  కీలక నిర్ణయం తీసుకుంది, అప్పుల భారం తగ్గించేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఈరోజు జరిగిన సమావేశంలో సిమెంట్ వ్యాపారాన్ని విక్రయించాలని నిర్ణయించింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, అదానీ గ్రూప్ ఈ సిమెంట్ యూనిట్‌ను కొనుగోలు చేయడానికి జేపీ పవర్ వెంచర్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి.  

ప్రపంచంలో నాల్గవ అత్యంత సంపన్నుడు, ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యం రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. ఇటీవలే సిమెంట్ రంగంలో స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చిన అదానీ.. ఇప్పుడు ఈ రంగంలో తన ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగా, అతను తన పోర్ట్‌ఫోలియోలో మరో సిమెంట్ కంపెనీని చేర్చుకోబోతున్నాడు, దాని గురించి చర్చలు జరుగుతున్నాయి.

జేపీ గ్రూప్‌తో ఒప్పందంపై చర్చలు
గౌతమ్ అదానీ తన దృష్టిని సిమెంట్ రంగంపైనే కేంద్రీకరిస్తున్నారు. అంబుజా సిమెంట్స్‌, ఏసీసీ సిమెంట్స్‌ను సొంతం చేసుకున్న తర్వాత.. ఇప్పుడు ఈ రంగంలోని మరో పెద్ద కంపెనీ జేపీ సిమెంట్‌పై ఆయన దృష్టి పడింది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, అప్పుల ఊబిలో కూరుకుపోయిన జైప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ సిమెంట్ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ చర్చలు జరుపుతోంది. దీనికి సంబంధించి విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం బయటకు వచ్చింది.

606 మిలియన్ డాలర్ల డీల్
606 మిలియన్ డాలర్లకు (రూ. 4,992 కోట్లకు పైగా) అదానీ గ్రూప్ ఈ డీల్ చేయడానికి సిద్ధమవుతోందని నివేదిక పేర్కొంది. ఇందులోభాగంగా సిమెంట్ గ్రైండింగ్ యూనిట్, ఇతర చిన్న ఆస్తులను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. అదానీ ఇటీవల కొనుగోలు చేసిన సిమెంట్ యూనిట్‌లో ఒక దాని ద్వారా ఈ కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. ఈ డీల్‌కు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు, అయితే త్వరలో సంతకం చేసే అవకాశం ఉంది.

అప్పు తగ్గించుకునేందుకు సిద్ధమవుతున్నారు
సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ బోర్డు తన సిమెంట్ వ్యాపారాన్ని విక్రయించడానికి సంస్థ రుణాన్ని తగ్గించడానికి నిర్ణయం తీసుకుంది. ఇందులో జైప్రకాష్ పవర్ వెంచర్స్ నిగ్రీ సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ఇతర నాన్-కోర్ ఆస్తులను విక్రయించడానికి బోర్డు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొంది.

దేశంలో రెండవ అతిపెద్ద సిమెంట్ కంపెనీ
ఈ ఏడాది మేలో అదానీ గ్రూప్ స్విస్ సంస్థ హోల్సిమ్ ఇండియా వ్యాపారాన్ని 10.5 బిలియన్ డాలర్లకు (రూ. 81,361 కోట్లు) కొనుగోలు చేసే రేసులో విజయం సాధించింది. అంబుజా సిమెంట్స్‌లో 63.19 శాతం, ఏసీసీలో 4.48 శాతం హోల్సిమ్ కలిగి ఉంది. ఈ డీల్ పూర్తయిన తర్వాత అదానీ అంబుజా సిమెంట్స్‌లో 63.15 శాతం, ఏసీసీలో 56.69 శాతం (అంబుజా సిమెంట్స్ ద్వారా 50.05 శాతం వాటా) కొనుగోలు చేసింది.

అంబుజా సిమెంట్ ACC లిమిటెడ్ సంవత్సరానికి 66 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఒప్పందం తర్వాత, అదానీ భారతదేశంలో సిమెంట్ రంగంలో రెండవ అతిపెద్ద ప్లేయర్ గా మారింది. అంబుజా సిమెంట్‌కు దేశంలో 6 సిమెంట్ ప్లాంట్లు ఉండగా, 8 సిమెంట్ గ్రైండింగ్ యూనిట్లు ఉన్నాయి. ఒక్క అంబుజా సిమెంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 31 మిలియన్ టన్నులు.