Toyota Land Cruiser Prado: ఇండియాలో ల్యాండ్ క్రూజర్ ప్రాడో ఎన్ని రూ.కోట్లో తెలుసా?
Toyota Land Cruiser Prado: ప్రపంచంలోని అనేక దేశాల్లో టాప్ సేల్స్ కలిగిన టొయోటా కంపెనీ తన ల్యాండ్ క్రూజర్ ప్రాడో ఎస్‌యూవీ మోడల్ ని ఇండియాలో టెస్ట్ డ్రైవ్ చేస్తోంది. ఈ సంవత్సరం ఇండియాలో విడుదలయ్యే ఈ కారు ధర తెలిస్తే మీరు షాక్ అవుతారు.

Toyota Land Cruiser Prado: టొయోటా కంపెనీ ప్రపంచవ్యాప్త అమ్మకాల్లో టొయోటా ల్యాండ్ క్రూజర్ ప్రాడో ఒక ముఖ్యమైన కారు. ఈ ఎస్‌యూవీ ఇటీవల ఇండియాలో టెస్ట్ డ్రైవ్‌లో కనిపించింది. ఈ ఎస్‌యూవీ ఈ సంవత్సరం ఇండియాలో విడుదల కావచ్చు అని సమాచారం. ఇది గాని ఇండియాలో లాంచ్ అయితే ల్యాండ్ రోవర్ డిఫెండర్‌తో పోటీపడుతుందనడంలో సందేహం లేదు. ల్యాండ్ క్రూజర్ ప్రాడో ధర, ఫీచర్స్, ప్రత్యేకతలు తెలుసుకుందాం రండి.
టొయోటా ల్యాండ్ క్రూజర్ ప్రత్యేకతలు
ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న స్పై చిత్రాలను గమనిస్తే ల్యాండ్ క్రూజర్ ప్రాడో స్ట్రాంగ్ బాక్స్ ఆకారంలో ఉంది. గ్రిల్‌లో నిలువు స్లాట్‌లు, ఎల్ఈడీ హెడ్‌లైట్లు, 20 ఇంచ్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వర్షాన్ని గుర్తించే సెన్సార్స్ ఉండటం వల్ల వర్షం పడితే ఆటోమెటిక్ గా వైపర్లు వాటి పని అవి చేసుకుపోతాయి.
ప్రాడో ఇంటీరియర్ నలుపు రంగులో ఉంటుంది. ఇంకా 'టొయోటా' లోగోతో కొత్తగా రూపొందించిన స్టీరింగ్ వీల్ కూడా ఇందులో ఉంది. సాంకేతిక వివరాల ప్రకారం ఈ ఎస్‌యూవీ 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ ని కలిగి ఉంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం డాష్‌బోర్డ్ కూడా ఉంది. ఇందులో ఉన్న వైర్‌లెస్ ఛార్జింగ్ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఇవి కాకుండా రెండు, మూడు వరుసల్లో ఏసీ వెంట్స్ ఉంటాయి. మొత్తంగా ఇంటీరియర్ విలాసవంతమైన ఫీచర్లతో నిండి ఉంటుంది.
ల్యాండ్ క్రూజర్ ప్రాడో ఇంజిన్ వివరాలు
యూరప్, జపాన్ వంటి దేశాలలో ఉపయోగిస్తున్న ల్యాండ్ క్రూజర్ ప్రాడో ఎస్‌యూవీలో 2.8 లీటర్ డీజిల్ మోటార్ అమర్చారు. ఇది 204 బీహెచ్‌పీ శక్తిని, 500 ఎన్ఎం టార్క్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. టొయోటా ఫార్చ్యూనర్‌లో ఉపయోగించే అదే మోటార్ ఇది. ఉత్తర అమెరికాలో రిలీజ్ చేసిన ల్యాండ్ క్రూజర్ ప్రాడో లో 2.4 లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ మోటార్ ఉంది. దేశాలను బట్టి ఇంజిన్ కెపాసిటీ మారుతోంది. కాబట్టి ఇండియాలో రిలీజ్ అయ్యే ప్రాడో ఇంజిన్ వివరాల కోసం వేచి చూడాల్సిందే.
ల్యాండ్ క్రూజర్ ప్రాడో ఎస్‌యూవీ ధర
ఇండియాలో ప్రాడో ఎక్స్-షోరూమ్ ధర 1.5 కోట్ల రూపాయల నుండి రెండు కోట్ల రూపాయల మధ్య ఉంటుందని అంచనా. ఇండియాలో ల్యాండ్ రోవర్ డిఫెండర్‌తో ఈ కారు పోటీపడుతుంది. ఈ రెండు కార్లు ఆఫ్-రోడర్లు. కానీ ల్యాండ్ రోవర్ డిఫెండర్ తో పోలిస్తే ధర తక్కువగా ఉండటం వల్ల ప్రాడోకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని కంపెనీ భావిస్తోంది.

