ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ సెగ్మెంట్‌కు చెందిన అదానీ విల్మార్.. తన మూడో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. అంచనాలకు మించి నెట్ ప్రాఫిట్‌ను సాధించినట్లు తెలిపింది. 

ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ సెగ్మెంట్‌కు చెందిన అదానీ విల్మార్.. తన మూడో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. అంచనాలకు మించి నెట్ ప్రాఫిట్‌ను సాధించినట్లు తెలిపింది. దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ సారథ్యంలోని అదానీ గ్రూప్ కంపెనీల్లో ఇదీ ఒకటి. సింగపూర్‌కు చెందిన ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్ కంపెనీ విల్మార్‌తో కలిసి అదానీ జాయింట్ వెంచర్‌గా దీన్ని నెలకొల్పింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నాటికి ముగిసిన మూడో త్రైమాసికంలో 211 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్‌ను నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చుకుంటే 66 శాతం వృద్ధి సాధించింది. గత ఏడాది డిసెంబర్ నాటికి ముగిసిన మూడో త్రైమాసికంలో అదానీ విల్మార్ సాధించిన నెట్ ప్రాఫిట్ 127 కోట్ల రూపాయలు. వ్యాపార లావాదేవీల వల్ల వచ్చిన ఆదాయంలో కూడా 40.5 శాతం పెరుగుదలతో 14,379 కోట్ల రూపాయలకు చేరినట్లు అదానీ విల్మార్ పేర్కొంది.

గత సంవత్సరం ఇదే కాలానికి 10,229 కోట్ల రెవెన్యూను నమోదు చేసింది. వంటనూనెల సెగ్మెంట్‌లోనూ పురోగతిని కనపరిచింది. గత ఆర్థిక సంవత్సరంలో 8,647 కోట్ల రూపాయల ఆదాయాన్నిఅందుకోగా.. ఇప్పుడది 12,118 కోట్ల రూపాయలకు చేరింది. ఇందులో 703 కోట్ల రూపాయల మేర నెట్ ప్రాఫిట్ నమోదు చేసినట్లు తెలిపింది. మూడో త్రైమాసికానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ప్రతిపాదనలను ఎక్స్ఛేంజ్‌లో ఫైల్ చేసింది.

ఇటీవలే- అదానీ విల్మార్ షేర్ మార్కెట్‌లోకి లిస్టింగ్ అయిన విషయం తెలిసిందే. 230 రూపాయల కటాఫ్ ప్రైస్‌తో పబ్లిక్ ఇష్యూను జారీ చేసిందీ కంపెనీ. ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించింది. 3,600 కోట్ల రూపాయలను సమీకరించుకోవడానికి పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. ఇన్‌స్టిట్యూషనల్ క్వాలిఫైడ్ ఇన్వెస్టర్లు, నాన్ క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, రిటైలర్ల నుంచి మంచి స్పందనే లభించింది. ఇవ్వాళ అదానీ విల్మార్ షేర్ ధర 388 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.