Asianet News TeluguAsianet News Telugu

ఇక సై అంటే సై: పెట్రో కెమికల్స్‌లో అంబానీతో ఆదానీ ‘ఢీ’

గుజరాతీ బిలియనీర్లు ముకేశ్ అంబానీ, గౌతం ఆదానీ నేరుగా ఢీకొనబోతున్నారు. ముంద్రా జిల్లాలో జర్మనీ సంస్థ సహకారంతో జాయింట్ వెంచర్‌గా కెమికల్స్ ఫ్యాక్టరీ నిర్మించనుండటమే దీనికి నేపథ్యం. ఇప్పటి వరకు పలు వ్యాపారాల్లో పాల్గొన్నా వీరిద్దరూ పోటీ పడలేదు. తాజాగా బీఎఎస్ఎఫ్ ఎస్ఈ సంస్థతో కలిసి నిర్మించ తలపెట్టిన కెమికల్స్ ఫ్యాక్టరీ.. ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ పెట్రో కెమికల్స్ సంస్థకు సవాలే.

Adani to foray into petrochemicals in Ambani's backyard
Author
New Delhi, First Published Jan 18, 2019, 12:32 PM IST

న్యూఢిల్లీ: భారత పెట్రోకెమికల్స్ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని, అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ ఆదానీ ‘ఢీ’ కొట్టనున్నారు. జర్మనీకి చెందిన కెమికల్ దిగ్గజం ‘బీఏఎస్‌ఎఫ్ ఎస్‌ఈ’తో ఆదానీ జాయింట్ వెంచర్ ప్రకటించారు. సుమారు రూ.16 వేల కోట్ల (దాదాపు 2 బిలియన్ యూరోలు) అంచనా పెట్టుబడితో గుజరాత్‌ రాష్ట్రం ముంద్రా జిల్లాలో ఓ రసాయన కర్మాగారాన్ని ఆదానీ గ్రూప్, బీఏఎస్‌ఎఫ్ ఉమ్మడిగా నిర్మిస్తున్నాయి.

అంతేకాదు.. ఈ ప్లాంట్ విద్యుత్ అవసరాల కోసం ఇక్కడే ఓ పవన, సౌర విద్యుదుత్పత్తి కేంద్రాన్నీ ఏర్పాటు చేయనున్నారు. శుక్రవారం నుంచి ‘వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2019’ ప్రారంభమైన క్రమంలో గురువారం జాయింట్ వెంచర్ కు సంబంధించిన అవగాహనా ఒప్పందం (ఎంవోయూ)పై బీఏఎస్‌ఎఫ్ ఎస్‌ఈ, ఆదానీ గ్రూప్‌లు సంతకాలు చేశాయి. 

ఇరు సంస్థలు విడుదల చేసిన ప్రకటన ప్రకారం కెమికల్ వెంచర్‌లో మెజారిటీ వాటా బీఏఎస్‌ఎఫ్‌కే ఉండనున్నది. అయితే పవర్ వెంచర్‌లో మాత్రం ఆదానీదే అగ్ర వాటా. కానీ ఈ జాయింట్ వెంచర్లకు సంబంధించి ఇరు సంస్థలు పూర్తి వివరాలను తెలియజేయకపోవడంతో ఇంతకుమించి సమాచారం అందుబాటులో లేదు. అయినా భారత్‌లో బీఏఎస్‌ఎఫ్ భారీ పెట్టుబడి ఇదేనని మాత్రం తెలుస్తున్నది. బీఏఎస్‌ఎఫ్‌తో భాగస్వామ్యం ‘మేక్ ఇన్ ఇండియా’కు ఊతం అభిస్తుందని, ప్రస్తుతం భారత్ దిగుమతి చేసుకుంటున్న సీ3సహా ఎన్నో రసాయనాలు దేశీయంగానే ఉత్పత్తి కాగలవని ఆదానీ గ్రూప్ అధినేత గౌతమ్ ఆదానీ అన్నారు.

బహుళ వ్యాపార కార్యకలాపాలతో భారత పారిశ్రామిక రంగంలో అంబానీ, అదానిలు బలమైన ముద్రే వేశారు. ఈ బిలియనీరిద్దరూ గుజరాతీలే కావడం విశేషం. వీరిద్దరు పలు వ్యాపారాలను చేస్తున్నా.. ఇప్పటిదాకా ఏ రంగంలోనూ ప్రత్యక్షంగా పోటీపడిన దాఖలాల్లేవు. కానీ ఇప్పుడు పెట్రోకెమికల్స్ వ్యాపారంలోకి ఆదానీ రావడంతో తొలిసారి ఓ వ్యాపారంలో ప్రత్యక్షంగా ఈ ఇద్దరు దిగ్గజాలు తలపడబోతున్నట్లయింది. 
 రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్)లో పెట్రోకెమికల్స్ వ్యాపారానిదే పెత్తనం. అలాంటి ఈ వ్యాపారంలోకే ఆదానీ రావటం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నది. అంబానీ ఏకఛత్రాధిపత్యానికి ఆదానీ బ్రేకులు వేస్తారా? అన్నదానిపై మొత్తం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది. 

ఆదానీ-బీఏఎస్‌ఎఫ్ జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలో రసాయనాలను మాత్రమే తయారు చేస్తారు. నిర్మాణ, ఆటోమోటివ్, కోటింగ్స్ వ్యాపారాలకు వీటి సరఫరా ప్రధానంగా ఉండనున్నది. కాగా, అంబానీ సంస్థ మాత్రం ప్యాకేజింగ్, అగ్రికల్చర్, ఆటోమోటివ్, హౌజింగ్, హెల్త్‌కేర్ మరికొన్ని వ్యాపారాలకూ సేవలను అందిస్తున్నది. ఆయిల్ టు టెలికం వ్యాపార దిగ్గజంగా రిలయన్స్‌కు పేరుంది.

16 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో చేపట్టిన పెట్రోకెమికల్ ఉత్పాదక సామర్థ్యం విస్తరణ పనులను గతేడాది జనవరిలోనే పూర్తి చేసింది. దీంతో ప్రపంచంలోని ఐదు అగ్రశ్రేణి భారీ చమురు శుద్ధి ఉత్పాదకదారుల్లో రిలయన్స్ ఒకటైంది. ఈ నేపథ్యంలో ఆదానీఎంట్రీ సర్వత్రా ఆసక్తిదాయకంగా మారింది. గుజరాత్‌లోని జాంనగర్, హజిరా, దహేజ్, వడోదర, మహారాష్ట్రలోని నాగోథానేల్లో ఆర్‌ఐఎల్‌కు పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios