ఎట్టకేలకు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రపంచ సంపన్నుల జాబితాలో గడిచిన పది రోజుల్లో ఏకంగా 13 స్థానాలు ఎగబాకారు.

అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత స్టాక్ మార్కెట్లో అదానీ కంపెనీ షేర్లన్నీ పతనమయ్యాయి. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో అగ్రస్థానంలో ఉన్న గౌతమ్ అదానీ, టాప్ 3 స్థానం నుంచి చూస్తుండగానే 35వ స్థానానికి కుప్పకూలిపోయాడు. హిండెన్‌బర్గ్ జనవరి 24న తన నివేదికను ప్రచురించిన, ఒక నెలలోనే అదానీ సామ్రాజ్యం పతనావస్థకు చేరుకుంది. అదానీ గ్రీన్, అదానీ పవర్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ సహా అన్ని కంపెనీల షేర్ల ధరలు నష్టాల్లో కనిపించాయి. ఇది అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నికర ఆదాయాన్ని కూడా ప్రభావితం చేసింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో ఉన్న అదానీ 30 రోజుల వ్యవధిలో 35వ స్థానానికి పడిపోయాడు. కాగా, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పొందేందుకు అదానీ గ్రూప్ ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తోంది, దీని ప్రభావం షేర్ల పెరుగుదలతో కనిపిస్తోంది. 

గత కొద్ది రోజులుగా అదానీ కంపెనీకి చెందిన కొన్ని షేర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకుతున్నాయి. మొత్తం మార్కెట్ విలువ కూడా 9 లక్షల కోట్లు దాటింది. దీంతో గౌతం అదానీ కూడా లబ్ధి పొందారు. గత పది రోజుల్లో అదానీ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో (బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్) లాంగ్ జంప్ చేసింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో గౌతమ్ అదానీ 10 రోజుల్లో 13 స్థానాలు ఎగబాకారు. అదానీ ఇప్పుడు తన ఆస్తులను 54 బిలియన్ డాలర్ల (సుమారు 4 లక్షల కోట్లు రూపాయలు) నికర విలువ పెంచుకొని 35వ స్థానం నుండి 22వ స్థానానికి చేరుకున్నారు. కంపెనీకి సంబంధించి ఇటీవలి సానుకూల వార్తలు షేర్ ధర పెరగడానికి దారితీశాయి.

బుధవారం ఒక్కరోజే అదానీ సంపద 2 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ ఏడాది మాత్రమే అదానీ నికర ఆదాయం విలువ 66.5 బిలియన్ అమెరికన్ డాలర్లు తగ్గింది. ఇదిలా ఉంటే తాజాగా కంపెనీకి చెందిన మొత్తం 10 షేర్లు బుధవారం భారీగా ధర పెరిగాయి. ముఖ్యంగా ఐదు కంపెనీల షేర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు దాదాపు మూడు శాతం మేర అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. అయితే మరో ఐదు కంపెనీలు ఐదు శాతం ఎగువ సర్క్యూట్‌ను తాకాయి. వీటిలో అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ విల్మార్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ టోటల్ గ్యాస్ ఉన్నాయి.

టాప్ 10లో అత్యంత సంపన్నులు ఎవరున్నారు: 
ఇదిలా ఉండగా, దేశంలోని అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఈ జాబితాలో 11వ స్థానంలో నిలిచారు. బుధవారం నాటికి అతని నికర విలువ 170 మిలియన్ డాలర్లు పెరిగి 83.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది ఆయన నికర విలువ 3.51 బిలియన్ డాలర్లు తగ్గింది. ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ 187 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచారు. ఎలోన్ మస్క్ రెండవ, జెఫ్ బెజోస్ మూడవ, బిల్ గేట్స్ నాల్గవ, వారెన్ బఫెట్ ఆరో, స్టీవ్ బాల్మెర్ ఏడవ, లారీ పేజ్ ఎనిమిదో, కార్లోస్ స్లిమ్, సెర్గీ బ్రిన్ పదో స్థానంలో ఉన్నారు.