ముంబై: ఇండియన్ బిలియనీర్, ఇండస్త్రీయలిస్ట్  గౌతమ్ అదానీకి చెందిన  అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో 100 బిలియన్ డాలర్లను దాటిన భారతదేశపు మూడవ కంపెనీగా అవతరించింది. అదానీ గ్రూప్  ఆరు లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ 104 బిలియన్ డాలర్లకు పైగా ఉన్నట్లు బిఎస్ఇ డేటా తెలిపింది.

స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన 6 అదానీ గ్రూప్‌ కంపెనీలు ట్రేడింగ్‌లో సరికొత్త గరిష్టాలను తాకాయి.  ఫలితంగా అదానీ గ్రూప్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ. 7.84 లక్షల కోట్లు పెరిగి 104 బిలియన్‌ డాలర్లకు పైగా చేరింది.

మంగళవారం నాడు అదానీ ఎంటర్‌ప్రైజెస్ 5.6% పెరిగి ఆల్ టైం గరిష్ట స్థాయి రూ.1202కి , అదానీ టోటల్ గ్యాస్ 6% పెరిగి రికార్డు స్థాయిలో రూ.1248కి, అదానీ ట్రాన్స్మిషన్ 5% పెరిగి రూ.1147కి, అదానీ పోర్ట్స్ 4% పెరిగి ఆల్-టైమ్ హై  రూ.791 చేరింది. అదానీ పవర్ 5% పెరిగి రూ.98.40 కు చేరుకోగా, అదానీ గ్రీన్ ఎనర్జీ 2.3% పెరిగి రూ.1194 కు చేరుకుంది.

ఇంతకు ముందు టాటా గ్రూప్, ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ 100 బిలియన్ డాలర్ల మైలురాయిని సాధించాయి. టాటా గ్రూప్  ప్రస్తుత మార్కెట్ క్యాప్ 242 బిలియన్ డాలర్లు కాగా, ఆర్ఐఎల్ గ్రూప్ ఎంకాప్ 190 బిలియన్ డాలర్లు.

also read ముగిసిన ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం.. రెపో రేటుపై కీలక నిర్ణయం.. ...

అదానీ గ్రూప్‌లోని మొత్తం సంస్థలలో ఐదు ప్రస్తుతం 1 ట్రిలియన్లకు పైగా మార్కెట్ క్యాప్‌ను కలిగి ఉండగా, మరొకటి  అదానీ పవర్ లిమిటెడ్  38వేల కోట్ల ఎంకాప్‌ను కలిగి ఉంది.

అదానీ ఎంటర్ప్రైజెస్  కంపెనీ అదానీ ఎయిర్ పోర్ట్స్ గత నెలలో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో 23.5% వాటాను కొనుగోలు చేశాయి.  ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన టెండర్ల ప్రక్రియ ద్వారా 50 సంవత్సరాల కాలానికి అహ్మదాబాద్, లక్నో, మంగళూరు, జైపూర్, గౌహతి, తిరువనంతపురంలోని ఆరు విమానాశ్రయాలను ఆధునీకరించడానికి, నిర్వహించడానికి చేజిక్కిచుకుంది.

పోర్టులు, ఇంధనం తదితర విభిన్న రంగాలలో కార్యకలాపాలను  విస్తరించిన అదానీ గ్రూప్‌ 1980లో కమోడిటీస్‌ ట్రేడర్‌గా సేవలను అందించేది. ఆ తరువాత రెండు దశాబ్దాల కాలంలో గౌతమ్‌ అదానీ గ్రూప్‌ కార్యకలాపాలను గనులు, పోర్టులు, విద్యుత్‌ ప్లాంట్లు, విమానాశ్రయాలు, డేటా సెంటర్లు, సిటీ గ్యాస్, రక్షణ రంగాల్లోకి విస్తరించింది. గత రెండేళ్లలో గ్రూప్‌ ఏడు ఎయిర్‌పోర్టుల నిర్వహణను చేపట్టింది.  

అలాగే పునరుత్పాదక ఇంధన విభాగంలో వేగంగా విస్తరిస్తోంది. అదానీ గ్రీన్‌ ద్వారా 2025కల్లా 25 గిగావాట్ల సామర్థ్యాన్ని అందుకోవాలని లక్ష్యంగా చూస్తోంది. అదానీ పోర్ట్స్‌ దేశీ పోర్టుల పరిశ్రమలో 30% వరకూ నిర్వహిస్తోంది. కృష్టపట్నం పోర్టుతో ఇటీవల  గంగవరం పోర్టును కూడా సొంతం చేసుకుంది.