సంఘీ ఇండస్ట్రీస్‌ను స్వాధీనం చేసుకున్న అదానీ గ్రూప్...డీల్ విలువ రూ. 5000 కోట్లు..
అదానీ గ్రూప్‌లో భాగమైన అంబుజా సిమెంట్, రూ. 5,000 కోట్ల విలువతో సంఘీ ఇండస్ట్రీస్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. కొనుగోలు చేసిన వెంటనే, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మాట్లాడుతూ 2028 నాటికి సిమెంట్ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తామని అంబుజా సిమెంట్ తరపున వాగ్దానం చేస్తున్నామని తెలిపారు.
అదానీ గ్రూప్‌కు చెందిన అంబుజా సిమెంట్ కంపెనీ, ప్రముఖ సిమెంట్ కంపెనీ సంఘీ ఇండస్ట్రీస్‌ను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 5 వేల కోట్ల రూపాయలు. ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, అంబుజా సిమెంట్స్ సంఘీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (SIL)లో 56.74 శాతం వాటాను ప్రస్తుత ప్రమోటర్లు రవి సంఘీ, వారి కుటుంబం నుండి కొనుగోలు చేయనుంది. ఈ డీల్ తర్వాత అంబుజా సిమెంట్ షేర్లు 4.5 శాతం, సంఘీ ఇండస్ట్రీస్ షేర్లు 5 శాతం పెరిగాయి.
అంబుజా సిమెంట్ సామర్థ్యాన్ని పెంచుతుంది
సంఘీ ఇండస్ట్రీస్ కొనుగోలు కోసం అంబుజా సిమెంట్స్ పూర్తిగా అంతర్గతంగా నిధులను సమకూర్చుకుంటుందని ఒక ప్రకటనలో తెలిపింది. అదానీ కంపెనీలపై ఆర్థిక అవకతవకలను ఆరోపిస్తూ హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత గ్రూప్ చేసిన మొదటి పెద్ద ఒప్పందం ఇదే. ఈ ఒప్పందం ద్వారా అంబుజా సిమెంట్ తన సామర్థ్యాన్ని సంవత్సరానికి 73.6 మిలియన్ టన్నులకు పెంచుకోవడానికి సహాయపడుతుంది. అంబుజా సిమెంట్ అల్ట్రాటెక్ తర్వాత రెండవ అతిపెద్ద సిమెంట్ తయారీదారుగా ఉంది. అంబుజా సిమెంట్, దాని అనుబంధ సంస్థ ACC లిమిటెడ్‌లో వాటాను కొనుగోలు చేసిన తర్వాత అదానీ గ్రూప్ గత సెప్టెంబర్‌లో సిమెంట్ రంగంలోకి ప్రవేశించింది.
సంఘీ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను కొనుగోలు చేయడం ద్వారా అంబుజా సిమెంట్ లిమిటెడ్ మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి సహాయపడుతుందని ఒక ప్రకటన పేర్కొంది. దీంతో కంపెనీ సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 67.5 మిలియన్ టన్నుల నుంచి 73.6 మిలియన్ టన్నులకు పెరగనుంది. ఇదిలా ఉంటే 2023-24 రెండవ త్రైమాసికం నాటికి దహేజ్, అమేథీలలో 5.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో సిమెంట్ ఫ్యాక్టరీలను సైతం ప్రారంభిస్తుందని ప్రకటన తెలిపింది.
ఈ పరిణామంపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మాట్లాడుతూ ఇది చారిత్రాత్మకమైన కొనుగోలు ఒప్పందం అని అన్నారు. ఇది అంబుజా సిమెంట్స్ వృద్ధి ప్రయాణాన్ని వేగవంతం చేయడంలో సహాయపడుతుందన్నారు. సంఘీ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌తో చేతులు కలపడం ద్వారా, అంబుజా తన మార్కెట్ ఉనికిని విస్తరిస్తుందని, దాని ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను కూడా బలోపేతం చేస్తుందన్నారు. ఇది నిర్మాణరంగంలో కంపెనీ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
సంఘీ సిమెంట్‌కి గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో సిమెంట్ ప్లాంట్లు ఉన్నాయి. ఇది 6.6 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో క్లింకర్ ప్లాంట్, 6.1 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో సిమెంట్ ప్లాంట్‌ను కలిగి ఉంది. సంఘీ ఇండస్ట్రీస్ కి 850 డీలర్ నెట్‌వర్క్ ఉంది. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ మార్కెట్లలో కంపెనీ ఉనికిని కలిగి ఉంది.