సారాంశం
అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభంలో 137.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది 2021-22 (FY22) అదే త్రైమాసికంలో రూ. 304.32 కోట్లుగా ఉంది మరియు ఇప్పుడు రూ.722.48 కోట్లకు పెరిగింది. ఒక్కో షేరుకు రూ.1.2 డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు సిఫారసు చేసింది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ క్యూ 4 ఫలితాల్లో బంపర్ పెరుగుదల నమోదు చేసింది. మార్చి తో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన రెండింతలు పెరిగి 722.48 కోట్లను నమోదు చేసింది. అదే సమయంలో కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం ఏడాది ప్రాతిపదికన 26 శాతం పెరిగి రూ.31,346.05 కోట్లకు చేరుకుంది. కంపెనీ బోర్డు కూడా వాటాదారులకు డివిడెండ్‌ను ఆమోదించింది . గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక్కో షేరుపై రూ.1.20 డివిడెండ్‌ను బోర్డు ఆమోదించింది. డైవర్సిఫైడ్ గ్రూప్ నిర్వహణ లాభం రెండింతలు పెరిగి రూ.3,957 కోట్లకు చేరుకుంది.
ఈ సందర్భంగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మాట్లాడుతూ, “మా మెగా స్కేల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ సామర్థ్యాలు, మా మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు బలంగా ఉన్నాయి. మేము అదానీ పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ ద్వారా మా పెట్టుబడిదారులందరికీ విశ్వసనీయమైన దీర్ఘకాలిక విలువను అందించడం కొనసాగిస్తామని హర్షం వ్యక్తం చేశారు.
FY23లో నికర లాభం మూడు రెట్లు పెరిగింది
FY23లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన మూడు రెట్లు పెరిగి రూ.2,472.94 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో కంపెనీ ఆదాయం 97 శాతం పెరిగి రూ.1.37 లక్షల కోట్లకు చేరుకుంది.
అన్ని వ్యాపారాల్లోనూ లాభాలు
ఇదే సమయంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నిర్వహణ లాభం గత ఆర్థిక సంవత్సరంలో రెండింతలు పెరిగి రూ.10,025 కోట్లకు చేరుకుంది. అన్ని వ్యాపారాలలో బలమైన నిర్వహణ పనితీరు కారణంగా ఇది జరిగిందని కంపెనీ తెలిపింది.