పదమ్‌సీ ఒక బ్రాండ్: యాడ్స్‌ పితామహుడు.. బట్!!

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 18, Nov 2018, 10:35 AM IST
Ad Guru And Actor Alyque Padamsee Dies At 90
Highlights

లిరిల్‌, హమారా బజాజ్‌, ఎంఆర్‌ఎఫ్‌ లాంటి ఐకానిక్‌  యాడ్స్‌ రూపశిల్పి.. అలైఖ్‌ పదమ్‌సీ (90) తన టైం అయిపోయిందంటూ వెళ్లిపోయారు. 

లిరిల్‌, హమారా బజాజ్‌, ఎంఆర్‌ఎఫ్‌ లాంటి ఐకానిక్‌  యాడ్స్‌ రూపశిల్పి.. అలైఖ్‌ పదమ్‌సీ (90) తన టైం అయిపోయిందంటూ వెళ్లిపోయారు.  ‘శనివారం తెల్లవారుజామున  ఆయన హెచ్‌ ఎన్‌ రిలయన్స్‌ హాస్పిటల్‌లో అనారోగ్య కారణంగా మరణించారు’ అని పదమ్‌సీ భార్య డాలీ ఠాకూర్‌ పేర్కొన్నారు. ముంబయిలోని వర్లిలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కళా రంగంలో, యాడ్స్ రూపకల్పనలో ఆయన స్రుజనాత్మకత, సేవలకు గుర్తింపుగా 2000లో ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో  గౌరవించింది. 

భారత వ్యాపార ప్రకటనల రంగానికి తనదైన సృజనాత్మకతతో రంగులు అద్దిన అలైఖ్‌ పదమ్‌సీ మరణించినా.. ఆయన ప్రకటనలు మాత్రం అందరి మదిలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అంతేకాదు..నాటక, సినిమా రంగాల్లో తనదైన ముద్ర వేసిన పదమ్‌సీ వ్యాపార ప్రకటనల్లో ఓ బ్రాండ్‌గా నిలిచారు. సృజన అద్దిన ప్రకటనలతో ఆయా కంపెనీల బ్రాండ్‌ చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశారు. చాలావరకు భారతీయులకు ఆయన పేరు పెద్దగా తెలియకున్నా.. ఆయన చేసిన ప్రకటనలు మాత్రం బాగా తెలుసు. 

గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో ఖోజా ముస్లిం కుటుంబంలో పుట్టిన పదమ్‌సీ ముంబయిలోని సెయింట్‌ జేవియర్‌ కాలేజీలో చదువుకున్నారు. 
లింటాస్‌ ఇండియాను స్థాపించి దేశంలోనే టాప్‌ ఏజెన్సీ స్థాయికి తీసుకెళ్లారు. 14 ఏళ్ల పాటు దానికి సీఈఓగా వ్యవహరించారు. ఆ తర్వాత లింటాస్‌ సౌత్‌ ఏషియా ప్రాంతీయ కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. దాదాపు 100 బ్రాండ్లకు వాణిజ్య ప్రకటనలు రూపొందించారు. ఇంటర్నేషల్‌ సిలియో హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు పదమ్‌సీనే.

1970వ దశకంలో లిరిల్‌ సబ్బు వ్యాపార ప్రకటన వెలువడింది. ‘లా.. లాలలా..లలలలలా’ అంటూ వచ్చే జింగిల్‌ను మరచిపోవడం ఎవరి తరం. అందులో నటించిన కరెన్‌ లునెల్‌ ఒక్కరాత్రిలోనే స్టార్‌ అయిపోయింది. ‘లిరిల్‌ గర్ల్‌’గా పేరు పొందింది. జలపాతం కింద బికినీ వేసుకున్న యువతిని ఊహించుకోవడం అనేది మగవారి కల అని విమర్శించినా.. స్నానం చేసే ఆ ఒక్క 10 నిమిషాలే భారత స్త్రీలు తమ కోసం కేటాయించుకునే సమయమని.. మిగతా సమయమంతా కుటుంబాన్ని తీర్చిదిద్దడానికే కేటాయిస్తారని పదమ్‌సీ వివరణ మాత్రం అందరికీ మెప్పించారు. ఇక 10 నిమిషాలు ఈ పనుల నుంచి దూరంగా ఎక్కడో జలపాతం కింద స్వేచ్ఛగా ఉండాలనుకోవడంలో తప్పేముందన్నారు. 

ఇక మరో వ్యాపార ప్రకటనలో లలితాజీ అనే తెలివైన మహిళను సృష్టించారు. ఇంటిని పొదుపుగా నిర్వహించే తన తల్లిని చూసే ఆ ప్రకటన చేశారట. ఆ యాడ్‌తో సర్ఫ్‌ విక్రయాలు బాగా పెరిగాయి. ఇంకా, చెర్రీ బ్లాసమ్‌ షూ పాలిష్‌ ప్రకటనలో చెర్రీ చార్లీ, ఎమ్‌ఆర్‌ఎఫ్‌ మజిల్‌ మాన్‌, ఫెయిర్‌ అండ్‌ హ్యాండ్‌సమ్‌ వంటి ఎన్నో బ్రాండ్లు ప్రజల్లోకి వెళ్లేలా చేశారు.  1989లో వెలువడ్డ బజాజ్‌ ప్రకటన చిరస్థాయిగా నిలిచిపోతుంది. ‘హమారా బజాజ్‌’ అంటూ భారత్‌ ఊగిపోయింది. తన ప్రకటనల్లోని పాత్రలు, కథల ద్వారా సగటు మనుషుల భావోద్వేగాలపై చక్కటి ప్రభావం చూపగల తెలివైన వ్యక్తి ‘హమారా పదమ్ సీ’ 

ఆయన మరణం పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ నేత మిలింద్ దేవ్ రా, సినీ ప్రముఖులు అతుల్ కస్బేకర్, బొమన్ ఇరానీ తదితరులు తీవ్ర సంతాపం తెలిపారు. ఆయనో సృజనాత్మక గురువు. వ్యాపార ప్రకటనల దిగ్గజం అని రాష్ట్రపతి రామ్ నాథ్ పేర్కొన్నారు. 

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందిస్తూ నాటకరంగంలో సుపరిచిత వ్యక్తిగా, ప్రకటనల రూపకర్తగా అశేష కీర్తి సంపాదించారన్నారు. తనలోని సృజనాత్మక కళ ద్వారా ఎనలేని సేవలు అందించారని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ తన సంతాప సందేశంలో వ్యాపార ప్రకటనల ప్రపంచంలో ఆయన సేవలు గుర్తిండిపోతాయి. అలాగే నాటక రంగానికి కూడా ఎంచదగ్గరీతిలో సేవలందించారని కొనియాడారు. 

బాలీవుడ్ సినీ నిర్మాత అతుల్ కస్బేకర్ ప్రతిస్పందిస్తూ తానిలా ఉన్నానంటే కారణం పదమ్ సీ కారణమన్నారు. భారత వ్యాపార ప్రకటనల రంగంలో ఆయనో దిగ్గజమని, పదమ్‌సీతో కలిసి పనిచేసినందుకు గర్విస్తున్నానని తెలిపారు. లింటాస్‌లో తనను చేరదీసి పని ఇచ్చినందుకు రుణ పడిఉంటానని పేర్కొన్నారు. పలు అంశాలను ఏక కాలంలో చేయగల ఆయన నిపుణత్వానికి నేను ఆశ్చర్యపోయానని తెలిపారు. కాంగ్రెస్ నేత మిలింద్ దేవ్ రా స్పందిస్తూ పదమ్ సీ మంచి నటుడు. ముంబైలో మేం కలిసి చాలా కాలం పనిచేశాం. వయసు, అనారోగ్యం ఆయన ఉత్సాహానికి, ఆలోచనలకు అడ్డువచ్చేవి కావని తెలిపారు.

loader