న్యూఢిల్లీ: అమెరికా ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌తో రిలయన్స్‌  చేతులు కలపనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్‌ అంబానీ, అమెజాన్ చీఫ్ జెఫ్ బేజోస్‌ మధ్య చర్చలు జరుగుతాయని ఈ వ్యవహారంతో సంబంధమున్న ఇద్దరు ఉన్నతోద్యోగులు వెల్లడించినట్లు శుక్రవారం అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌ తెలిపింది. 

ఇద్దరు దిగ్గజ పారిశ్రామిక వేత్తలు కలవడం ద్వారా ఇప్పటికే భారత్‌లో వ్యాపిస్తున్న వాల్‌మార్ట్‌ను ఎదుర్కొనే అవకాశం ఉంది. గతేడాది వాల్‌మార్ట్‌ -ఫ్లిప్‌కార్ట్‌లో 16 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. రిలయన్స్‌తో భాగస్వామ్యం కోసం అమెజాన్‌ ప్రతిపాదన తెచ్చిందని, అయితే ఇది ఇంకా చర్చల వరకూ వెళ్లలేదని ఉద్యోగి తెలిపారు. 


ఫిబ్రవరిలోపు రిలయన్స్‌ రీటైల్‌లో 26 శాతం వరకూ వాటా కొనుగోలు కోసం అమెజాన్‌ ప్రతిపాదించినట్లు మరో ఉన్నతోద్యోగి చెప్పారు. వీటి మధ్య బలమైన భాగస్వామ్యం ద్వారా రిలయన్స్‌కు గల సుమారు 40 రకాల బ్రాండ్‌ల ఉత్పత్తులు, ఇతర వస్తువులకు సులభమైన ఆన్‌లైన్‌ వేదిక ఏర్పడుతుందని వివరించారు. అయితే, ఈ వార్తలపై అమెజాన్‌ గానీ, రిలయన్స్‌గానీ శుక్రవారం స్పందించలేదు. 

మరోవైపు రిలయన్స్.. జియో టెలికాం నెట్‌వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా తన రిటైల్‌ దుకాణాలను డిజిటల్‌గా అనుసంధానించాలనే లక్ష్యంతో ఉంది. ఈ ఒప్పందం సఫలమైతే టెక్నాలజీ, సరకు సరఫరా వ్యవస్థ, లాజిస్టిక్స్‌లలో అమెజాన్‌కు ఉన్న ప్రపంచ అనుభవం రిలయన్స్‌కు తోడ్పడుతుంది.

అంతేకాదు దేశవ్యాప్తంగా రిలయన్స్‌కు గల దాదాపు 10,600కు పైగా రిటైల్‌ దుకాణాలు ఉండడం అమెజాన్‌కు బాగా కలిసొస్తుంది. అంతేకాక అంబానీ కుటుంబానికి ఉన్న రాజకీయ పలుకుబడి జెఫ్ బెజోస్‌కు బాగా ఉపయోగపడే అవకాశముందని వ్యాపార పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

వాటా విక్రయానికి చైనాకు చెందిన దిగ్గజ సంస్థ అలీబాబాతో గతంలో రిలయన్స్‌ చర్చలు జరిపింది. కానీ సంస్థ విలువ మదింపులో భేదాభిప్రాయాలు రావడంతో అది ఆగిపోయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 

ఈ-కామర్స్‌ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో గతేడాది డిసెంబర్ నెలలో ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. ఇవి అమెజాన్‌ వంటి సంస్థలకు అడ్డంకిగా మారాయి. దీంతో భారత్‌లో మరింత విస్తరించాలనుకుంటున్న ఇలాంటి సంస్థల చూపు రిలయన్స్‌పై పడింది.