Asianet News TeluguAsianet News Telugu

గుడ్‌ ఫర్ ఫ్యామిలీ బిజినెస్: వెంచర్ క్యాపిటల్ టూ డైవర్సిఫైడ్ వ్యూ


దేశీయంగా కుటుంబ వ్యాపారాలకు మంచి రోజులు రానున్నాయి. వచ్చే రెండేళ్లలో 89% సంస్థలు వృద్ధి దిశగా అడుగులేస్తున్నాయని పీడబ్ల్యూసీ సర్వే నివేదిక వెల్లడించింది. నియంత్రణ మార్పులకు అనుగుణంగా వ్యవహరిస్తూ.. టెక్నాలజీ అప్ డేట్స్‌తో దూసుకెళ్తున్నారు.

89% family biz in India expect to grow in next 2 years: Report
Author
Mumbai, First Published Jun 17, 2019, 11:04 AM IST

ముంబయి: దేశంలో కుటుంబ వ్యాపారాలు మరింత వృద్ధి చెందనున్నాయని ఓ సర్వే తేల్చింది. వచ్చే రెండేళ్లలో ఈ విభాగానికి చెందిన సుమారు 89 శాతం వ్యాపారాలు మరింత విస్తరిస్తాయని ‘ఫ్యామిలీ బిజినెస్‌ సర్వే 2019’ పేరుతో పీడబ్ల్యూసీ సంస్థ రూపొందించిన అంతర్జాతీయ సర్వే నివేదిక అంచనా వేసింది.  

భారతదేశంలోని 89 శాతం కుటుంబ వ్యాపారాలు వచ్చే రెండేళ్లలో వృద్ధి చెందే అవకాశం ఉంది. ఇందులో 44 శాతం సంస్థల వృద్ధి దూకుడుగా ఉండనుండగా, 45 శాతం కంపెనీలు స్థిర వృద్ధి సాధిస్తాయి. 

నియంత్రణ విదానాల్లో మార్పులతో కుటుంబ వ్యాపారాల్లో వృత్తి నైపుణ్యం ఇనుమడిస్తోంది. దీంతోపాటు ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీ అప్ డేట్ కూడా వాటి రూపు మారేందుకు కారణమవుతోంది. సరైన నిపుణులకు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తూ, మంచి ఫలితాలు రాబడుతున్నారు. 

ప్రస్తుతం సగానికిపైగా భారతీయ కుటుంబ వ్యాపారాలు భిన్న రంగాలకు, అంతర్జాతీయ స్థాయికి విస్తరించేందుకు సిద్ధమవుతున్నాయి. దేశీయంగా పని చేస్తూ విదేశాల్లో ఇతర సంస్థల విలీనం, కొనుగోళ్లకూ ఆసక్తి చూపుతున్నాయి. 

ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్‌ కేపిటల్‌ ఫండింగ్‌తో పాటు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదుకూ ప్రయత్నిస్తున్నాయి. అంతే కాదు నూతన తరం కుటుంబ వ్యాపార వేత్తలు డైవర్సిఫైడ్ ద్రుక్పథం కనబరుస్తున్నారు. నూతన మార్కెట్లపై ద్రుష్టి కేంద్రీకరిస్తున్నారు.

73 శాతం భారతీయ కుటుంబ వ్యాపారాల్లో  మూడో తరం వారు వచ్చేశారు. 60 శాతం వ్యాపారాలను తదుపరి తరానికి అందించే ప్రణాళికలో ఉన్నారు. 92 శాతం సంస్థల్లో కుటుంబ సభ్యుల్ని పని చేసేందుకు అనుమతిస్తున్నారు. ఉదాహరణకు రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు ధీరుబాయి అంబానీ కొడుకులు ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ ఇప్పటివరకు గ్రూప్ లావాదేవీలను చూసుకున్నారు. వారి స్థానే ధీరుబాయి మనుమలు ఈషా అంబానీ, అన్మోల్ అంబానీ, ఆకాశ్ అంబానీ తదితరులు కీలక భూమిక పోషిస్తున్నారు. 

అయితే కుటుంబ వ్యాపారాల్లో మహిళలు సగటున 15 శాతం మంది ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే.. బోర్డులు, మేనేజ్మెంట్ టీమ్‌ల్లో  13% మందికి అవకాశం లభిస్తోంది. అంతర్జాతీయంగా 21 శాతం మంది మహిళలు వ్యాపారాల్లో భాగస్వాములు అవుతూ ఉంటే 24 శాతం మంది బోర్డులు, మేనేజ్మెంట్ టీమ్స్‌లో  కీలకం అవుతున్నారు. 

అంతేకాదు భారత కుటుంబ వ్యాపారాల్లో నిమగ్నమైన వారిలో 89 శాతం మంది దాత్రుత్వ కార్యక్రమాల్లో నిమగ్నం అవుతున్నారు. నగదు విరాళాలు ఇవ్వడంతోపాటు అదనంగా కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. అంతర్జాతీయ పరిస్థితులతో పోలిస్తే సగటున 68 శాతం ఎక్కువే. ఫ్యామిలీ బిజినెస్ సర్వే -2019 పేరుతో ప్రపంచ వ్యాప్తంగా పీడబ్ల్యూసీ 53 దేశాల్లో 2,953 ఫ్యామిలీ బిజినెస్ లీడర్లతో సంప్రదింపులు జరిపి ఈ నివేదిక రూపొందించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios