Asianet News TeluguAsianet News Telugu

చైనా ఉత్పత్తుల ఊసే లేదు.. తేల్చి చెప్పిన 87% ఇండియన్స్

సరిహద్దుల్లో చైనా దుశ్చర్య నేపథ్యంలో ఆ దేశ వస్తువులను కొనే సమస్యే లేదని ఓ సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 87 శాతం మంది తేల్చేశారు. 20 మంది సైనికులను బలిగొన్న చైనాకు వాణిజ్య పరంగా బుద్ధి చెప్తామన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. 

87 percent Indians ready to boycott Chinese products for next one year Survey
Author
New Delhi, First Published Jun 21, 2020, 11:32 AM IST

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా దుశ్చర్య నేపథ్యంలో ఆ దేశ వస్తువులను కొనే సమస్యే లేదని ఓ సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 87 శాతం మంది తేల్చేశారు. 20 మంది సైనికులను బలిగొన్న చైనాకు వాణిజ్య పరంగా బుద్ధి చెప్తామన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే చైనా కంపెనీలు తయారు చేసిన ఏ వస్తువు జోలికీ ఏడాదిదాకా వెళ్లబోమన్నారు.

షియోమీ, వివో, ఒప్పో వంటి చైనా బ్రాండ్ స్మార్ట్ ఫోన్లను బహిష్కరించాలని 97 శాతం మంది కోరగా, 39 శాతం మంది ఇప్పటికే కొన్నవి వాడుతామని, ఇకపై మాత్రం కొనబోమన్నారు. చైనా దిగుమతులపై 200 శాతం సుంకాలను విధించాలని 78 శాతం భారతీయులు డిమాండ్‌ చేశారు. 

ముడి సరుకు దిగుమతులపై ఇంతటి భారం తగదని 36 శాతం అభిప్రాయపడ్డారు. బీఐఎస్‌, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తదితర భారతీయ ప్రమాణాలను చైనా కంపెనీలు తప్పక పాటించాల్సిందేనని 90 శాతం మంది అన్నారు. దేశంలోని 235 జిల్లాల్లో లోకల్‌ సర్కిల్స్‌ ఈ సర్వే చేపట్టగా, 32వేల మందికిపైగా పాల్గొన్నారు.

వన్‌ప్లస్‌ 8 ప్రో నిమిషాల్లో ఖాళీ
చైనా సంస్థ వన్‌ప్లస్‌ భారత మార్కెట్‌కు తాజాగా తెచ్చిన 8 ప్రో స్మార్ట్‌ఫోన్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. అందరూ ఎగబడి మరీ కొనేయడంతో ఆన్‌లైన్‌ అమ్మకాలు మొదలైన నిమిషాల్లోనే స్టాక్‌ అంతా అయిపోయింది. రెండు వేరియంట్లలో వచ్చిన 8 ప్రో ధరలు రూ.54,999, రూ.59,999గా ఉన్నాయి. నిజానికి గత నెల 29న ఈ మోడల్‌ ఆన్‌లైన్‌ సేల్‌ మొదలు కావాలి.

కానీ కొవిడ్‌-19, లాక్‌డౌన్‌ ప్రభావంతో వాయిదా పడింది. ఈ క్రమంలోనే గురువారం అమెజాన్‌ ఇండియాతోపాటు వన్‌ప్లస్‌ ఇండియా అధికారిక వెబ్‌సైట్లలో అమ్మకాలను ప్రారంభించింది. అయితే మొదలైన కాసేపటికే ఔట్‌ ఆఫ్‌ స్టాక్‌ అని వెబ్‌సైట్లలో దర్శనమిచ్చింది. వన్‌ప్లస్‌ 8 సిరీస్‌ను 5జీ టెక్నాలజీతో పరిచయం చేశారు.

కాగా, చైనాకే చెందిన షియోమీ, మరో సంస్థ ఇటీవల భారతీయ మార్కెట్‌లోకి తెచ్చిన ల్యాప్‌ట్యాప్‌లకూ ఇదే రీతిలో డిమాండ్‌ కనిపించింది. రెండు రోజుల్లోనే నో స్టాక్‌ బోర్డులు కనిపించాయి. ఒకప్పుడు శామ్‌సంగ్‌, ఆపిల్‌, నోకియా, సోనీ ఉత్పత్తులకు డిమాండ్‌ ఉన్న దేశీయ మార్కెట్‌లో ఇప్పుడు చైనాకు చెందిన షియామీ, వివో, ఒప్పో, వన్‌ప్లస్‌ హవా నడుస్తున్నది. 


చైనాలో ఉత్పత్తి నిలిపివేత వార్తలు అవాస్తవం: శామ్‌సంగ్
తమ కంపెనీకి సంబంధించిన డిస్‌ప్లే ప్రొడక్షన్‌ను చైనా నుంచి వియత్నాం తరలిస్తున్నట్లు వచ్చిన వార్తలను శామ్‌సంగ్ సంస్థ ఖండించింది. అటువంటి ఆలోచనే తమకు లేదని తేల్చిచెప్పింది. వియత్నాంకు చెందిన ఓ న్యూస్‌పేపర్‌లో ఇటీవలే దీనిపై ఓ వార్త ప్రచురితమైంది. 

తమ డిస్‌ప్లే తయారీ పరిశ్రమలను శామ్‌సంగ్.. చైనా నుంచి వియత్నాం తరలిస్తున్నట్లు ఆ కథనం పేర్కొంది. దీనిపై శామ్‌సంగ్ వియత్నాం వెబ్‌సైట్‌లో ప్రకటన వచ్చినట్లు ఈ వార్తలో రాశారు. ఈ వదంతులను ఖండించిన శామ్‌సంగ్.. తమకు అటువంటి ఆలోచనలు లేవని స్పష్టంచేసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios