న్యూఢిల్లీ: సంప్రదాయ ఉద్యోగాల స్థానే 2018లో టెక్నాలజీ రాజ్యమేలాయి. 2018లో ఎంట్రీ లెవల్‌లో కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకున్నాయి. వేతనాల పెంపు సగటున 8-10 శాతంగా ఉంది. 2018లో నియామకాల్లో ఉన్న జోరు... కొత్త ఏడాదిలో కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త ఏడాదిలో కొత్తగా 10 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని నిపుణులు, హైరింగ్‌ మేనేజర్లు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల తర్వాత ఐటీ పరిశ్రమలో నియామకాలు పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చాయని హెచ్‌ఆర్‌ సర్వీసుల సంస్థ రాండ్‌స్టాడ్‌ ఇండియా చీఫ్‌ పాల్‌ డుపియస్‌ తెలిపారు. 

నూతన తరం టెక్నాలజీల్లో నైపుణ్యం కల వారు భారీగా అందుబాటులోకి రావటం కలిసివచ్చిందని  హెచ్‌ఆర్‌ సర్వీసుల సంస్థ రాండ్‌స్టాడ్‌ ఇండియా చీఫ్‌ పాల్‌ డుపియస్‌ అన్నారు. బ్లాక్‌ చెయిన్‌, రోబోటిక్స్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ విభాగాల్లో ఉద్యోగాలకు భారీగా డిమాండ్‌ ఉంటుందని అంచనా. 

ఈ-కామర్స్‌ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం, ఇన్‌ఫ్రా, మాన్యుఫ్యాక్చరింగ్‌, రిటైల్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో ఆశించిన స్థాయిల్లో ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. బ్యాంకింగ్‌, ఆర్థిక సర్వీసులు, టెలికాం మాత్రం గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాయని పాల్‌ డుపియస్‌ అంటున్నారు.

2018 వరకు ఉద్యోగాల్లో నియమితులైన వారితోపాటు అందరి వేతన పెంపు కూడా గత ఏడాది స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2019లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో నియామకాలపై ఆయా సంస్థల యాజమాన్యాలు ఆచితూచి అడుగేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయంగా అనిశ్చితి నెలకొనవచ్చునని భావిస్తుండటమే ఇందుకు కారణమని నిపుణులంటున్నారు.
 
గత కొన్నేళ్లుగా రాజకీయపక్షాలన్నీ ఉద్యోగాల కల్పన తమ ప్రధాన లక్ష్యమని చెబుతూ వస్తున్నాయి. అందుకు తగినట్లే ప్రభుత్వాలు మందుకుసాగాయి. సంప్రదాయక ఉద్యోగాల స్థానంలో టెక్నాలజీ ఉద్యోగాలు గణనీయంగా అందుబాటులోకి వచ్చాయి. 

మరోవైపు ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో సాగుతుండటంతో ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరిగాయి. ఇటీవలి సంవత్సరాల్లో ఏటా 1.2 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి రావటంతో జాబ్‌ మార్కెట్‌ కళకళలాడుతూ వస్తోంది. నైపుణ్య లేమి వల్ల  ఉద్యోగ మార్కెట్లో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనాల్సి వస్తోందని నిపుణులు అంటున్నారు.
 
నోట్ల రద్దు‌, జీఎస్‌టీ అమలులో సమస్యల వల్ల ఉద్యోగ మార్కెట్లో ఏర్పడిన అనిశ్చితికి ఈ ఏడాది తెర పడింది. 2018లో అంచనాలకు తగ్గట్టుగానే ఉద్యోగాల పెద్ద ఎత్తున అందుబాటులోకిరావటం సానుకూల పరిణామమని మానవ వనరుల విభాగం నిపుణులు పేర్కొన్నారు. 

కొత్త ఏడాదిలో కంపెనీలు విస్తరణ కార్యకలాపాలు చేపట్టే అవకాశం ఉన్నా సార్వత్రిక ఎన్నికల వల్ల అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉందని, 2019 ప్రథమార్థంలో ఉద్యోగాలు పెద్ద ఎత్తున అందుబాటులోకి రాకపోవచ్చని భావిస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఆర్‌ఎం ఇండియా అడ్వైజరీ సర్వీసెస్‌ హెడ్‌ నిశిత్‌ ఉపాధ్యాయ అంటున్నారు. రహదారులు, జాతీయ రహదారులు, విమానాశ్రయాలవంటి మౌలిక వసతుల కల్పన విభాగాలు కొద్దిగా ఒత్తిడికి లోను కావచ్చని భావిస్తున్నట్లు ఉపాధ్యాయ పేర్కొన్నారు.

ఇక 2019లో బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసులు, రిటైల్‌, లాజిస్టిక్స్‌, ఐటీ/ఐటీఈఎస్‌, ఈ-కామర్స్‌, స్టార్టప్స్‌, కన్స్యూమర్‌ గూడ్స్‌, హెల్త్‌కేర్‌, ఇన్‌ఫ్రా రంగాలు వృద్ధిపథంలో సాగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమల నిపుణులంటున్నారు. దీంతో ఈ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. నాన్‌ మెట్రో, చిన్న పట్టణాల్లో రిటైల్‌ రంగం వృద్ధిపథంలో సాగే అవకాశం ఉండటంతో అక్కడ భారీగా ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నామన్నారు.
 
కొత్త ఏడాదిలో వేతనాల్లో 9-10 శాతం వృద్ధి ఉండొచ్చని భావిస్తున్నట్లు గ్లోబల్‌ హంట్‌ ఎండీ సునీల్‌ గోయల్‌ తెలిపారు. స్థూల ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు మెరుగుపడుతున్నా వేతనాల్లో వృద్ది 2018లో మాదిరిగానే 8-10 శాతం స్థాయిల్లోనే ఉంటాయని అంచ నా వేస్తున్నట్లు చెప్పారు. అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారికి మాత్రం 15-20 శాతం, ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారికి 30-50 శాతం వేతనాలు పెరిగే చాన్స్‌ ఉందని గోయల్‌ తెలిపారు.