కేంద్ర ప్రభుత్వం మరోసారి జీఎస్టీ శ్లాబ్ పరిధులను తగ్గించనున్నదా? అందువల్ల టీవీ, ఏసీల ధరలు తగ్గనున్నాయా?.. అంటే అవుననే అంటున్నాయి మార్కెట్ వర్గాలు. ప్రభుత్వం ప్రస్తుతం 28శాతం శ్లాబ్‌ జీఎస్టీ పరిధి నుంచి ఎలక్ట్రానిక్ గూడ్స్‌ను18శాతం శ్లాబులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. ఇందులో టీవీలు, ఏసీల దగ్గర నుంచి డిష్‌ వాషర్స్‌, డిజిటల్ కెమెరాల వరకు పలు రకాల వస్తువులు ఉన్నాయి. జీఎస్టీ పరిధిలోకి డీజిల్, పెట్రోల్ తెచ్చే అవకాశం చర్చిస్తారు. 

మరోవైపు ఈ నెల 22వ తేదీన జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ తెచ్చే అవకాశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలతో ఏకాభిప్రాయం తెచ్చిన తర్వాతే జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ తీసుకొస్తామని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే 28 శాతం శ్లాబ్‌లో ఉన్న సిమెంటు ధరలో మాత్రం ఎటువంటి మార్పు ఉండబోదని జీఎస్టీ అధికారులు అభిప్రాయపడ్డారు.

దీంతోపాటు 28శాతం శ్లాబ్‌ను పూర్తిగా తొలగించి 18 శాతాన్నే అత్యధిక శ్లాబ్‌గా కొనసాగించే ప్రతిపాదననూ ఈ సమావేశంలో పరిశీలించనున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.10 వేల కోట్లనుంచి రూ.11 వేల కోట్ల ఆదాయం తగ్గనుంది. అదే జరిగితే 2018-19 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత పరోక్ష పన్నుల ఆదాయ లక్ష్యం రూ.12 లక్షల కోట్లు చేరుకోవడం కష్టతరమే. మరికొన్ని వస్తువులను 18శాతం శ్లాబ్‌ నుంచి 5శాతం శ్లాబుకు మార్చే అంశంపై కూడా సమాలోచనలు జరపనున్నారు.

జీఎస్టీ అమలులోకి వచ్చిన మొదట్లో 28శాతం శ్లాబ్‌లో 226 వస్తువులు ఉండగా.. అనేక సవరణల తర్వాత ఆ సంఖ్య 35కు చేరింది. చివరి సారిగా గతేడాది జూలో ఒకటో తేదీన రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లతో పాటు మరికొన్ని ఎలక్ట్రికల్‌ ఉపకరణాలను 18శాతం శ్లాబ్‌లో చేర్చారు.

200లకు చేరిన ‘ఇండిగో’ విమానాలు
ప్రైవేట్‌ విమానయాన సంస్థ ఇండిగో విమానాల సంఖ్య 200కు చేరుకుంది. దీంతో దేశంలో 200 విమానాలు కలిగిన తొలి ఎయిర్‌లైన్‌ ఆపరేటర్‌గా ఘనత దక్కించుకుంది. సంస్థ నెట్‌వర్క్‌లోకి కొత్తగా నాలుగు విమానాలు (ఎయిర్‌బస్‌ ఏ320) చేరాయి. దేశీయ విమాన సేవల రంగంలో ఇండిగోకు 40 శాతానికి పైగా మార్కెట్‌ వాటా ఉంది. 2015 డిసెంబరు 24న ఈ సంస్థ విమానాల సంఖ్య 100కు చేరుకుంది.