న్యూఢిల్లీ: కేంద్రం నల్లధనం వెలికితీత, అక్రమాలకు అడ్డుకట్ట పేరుతో రూ.1000, రూ.500 నోట్ల రద్దు చేసింతర్వాత ఒరిగిందేమీ లేకున్నా.. అదే పనిగా వివిధ డినామినేషన్లలో కొత్త నోట్లు తీసుకొస్తోంది. అలా తీసుకొచ్చిన కొత్త నోట్ల విడుదలలో మాత్రం అలా జరగడం లేదు. కొత్తగా విడుదల చేస్తున్న నోట్ల పరిమాణానికి, ప్రస్తుత నోట్లకు తేడాలు ఉన్నందున, ఏటీఎంలలో మార్పులు చేయాల్సి వస్తోంది. ఇందుకు భారీఎత్తున వ్యయం, సమయమూ అవసరం అవుతున్నాయి. దేశంలోని అత్యధిక ఏటీఎంలు పాత రూ.100, 500, 1000 నోట్ల పరిమాణానికి అనుగుణంగా రూపొందించారు. మార్పులు చేయకపోతే, కొత్త నోట్లను ఏటీఎంల ద్వారా అందించే అవకాశం బ్యాంకులకు లభించడం లేదు.

ఎప్పటికప్పుడు ఎటీఎంల్లో మార్పులు అనివార్యమేనా?


2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్త ప్రమాణాలు, మరింత భద్రతా అంశాలతో కొత్త నోట్లను భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ)  విడుదల చేస్తోంది. తాజాగా తెస్తున్న రూ.100 నోటు ఈ క్రమంలో అయిదో నోటు. అంతకుముందు కొత్త రూ.500, 2000, రూ.50, 200 నోట్లు వచ్చాయి. వీటిల్లో రూ.50ని ఏటీఎంలలో ఉంచరు. కొత్త నోట్లకు అనుగుణంగా దేశంలోని 2.4 లక్షల ఏటీఎంలలో ఎప్పటికప్పుడు మార్చులు చేయాల్సి వస్తోంది.

పెరుగుతూనే ఉన్న సవాళ్లు 


దేశంలోని ఏటీఎంలలోకి కొత్త రూ.100 నోట్లు రావాలంటే మొత్తం 2.4 లక్షల ఏటీఎంలలో మార్పులు చేయాలి. ఇందుకు రూ.100 కోట్ల పెట్టుబడి అవసరమని ఏటీఎం కార్యకలాపాల పరిశ్రమ తెలిపింది. కొత్త నోట్లతో తమకు సవాళ్లు పెరుగుతూనే ఉన్నాయని పేర్కొంది. ‘ఈ మధ్యే వచ్చిన రూ.200 నోటుకు తగినట్లు ఏటీఎమ్‌లలో మార్పులు చేస్తున్నాం. అదే ఇంకా పూర్తి కానే లేదు. మళ్లీ కొత్త రూ.100 నోట్ల జారీకి అనుగుణంగా తీర్చిదిద్దాలంటే, ఒత్తిడి పెరిగినట్లే’నని పరిశ్రమ సంఘం కాట్మీ డైరెక్టర్‌ వి. బాలసుబ్రమణియన్‌ పేర్కొన్నారు. 


కొత్త రూ.100 నోట్లతో పాటు.. పాత రూ.100 నోట్లకూ ఏటీఎంలలో స్థానం కల్పిస్తూ మార్పులు చేపట్టడం సవాలేనని కాట్మీ డైరెక్టర్‌ వి. బాలసుబ్రమణియన్‌ స్పష్టం చేశారు. ‘నోట్ల లభ్యతను బట్టి ఏటీఎంలలో మార్పులు చేయాలా వద్దా అన్నది ఆధారపడి ఉంది’ అని ఆయన అన్నారు. ‘దేశంలోని 2.4 లక్షల ఏటీఎంలలో మార్పులు చేసి, కొత్త రూ.100 నోటుకు అనుగుణంగా మార్చడానికి రూ.100 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టడంతోపాటు 12 నెలలకు పైగా సమయం వెచ్చించాల్సి ఉంటుంది’ అని హిటాచి పేమెంట్‌ సర్వీసెస్‌ ఎండీ లానీఆంటోనీ అంచనా వేశారు. ‘అన్ని ఏటీఎంలలో ఇంకా రూ.200 నోట్లకు తగ్గట్లు మార్పులు పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో కొత్త రూ.100 నోటుకు చోటు కల్పించడానికి మరింత సమయం అవసరం అవుతుంది. సరైన ప్రణాళిక లేకుంటే ఇంకా జాప్యం కావొచ్చ’ని అన్నారు.

గర్వకారణమే అయినా సంక్లిష్ట పరిస్థితులు


అత్యున్నత భద్రతా ప్రమాణాలతో సరికొత్త నోటు తీసుకురావడం గర్వించదగ్గ అంశమే కానీ నోటు పరిమాణంలో మార్పుల వల్ల ఏటీఎమ్‌ల ద్వారా వాటిని ప్రజలకు అందించాలంటే సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని యూరోనెట్‌ సర్వీసెస్‌ ఎండీ హిమాన్షు పుజారా పేర్కొన్నారు. ‘అన్ని ఏటీఎమ్‌లనూ మార్చాల్సి ఉంటుంది. అందుకు సమయం కావాలి. భారీ వ్యయాలను కూడా వెచ్చించాల్సి ఉంటుంద’ని హెచ్చరించారు.

2.4 లక్షల ఏటీఎంల నిర్వహణ ఇలా..


దేశంలో ఉన్న మొత్తం ఏటీఎంలు 2.4 లక్షలు. ఇందులో ఎన్‌సీఆర్‌ 1.1 లక్షల ఏటీఎంలను నిర్వహిస్తుండగా.. 55,000 ఏటీఎంలను హిటాచి నిర్వహిస్తోంది. 12,000 ఏటీఎమ్‌లు ఎఫ్‌ఐఎస్‌ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. 


గత ఆగస్టులో ప్రవేశపెట్టిన రూ.200 నోట్ల కోసం ఏటీఎమ్‌లను మార్చడానికి రూ.100-120 కోట్లు ఖర్చయ్యాయి. కొత్త నోటుకు అనుగుణంగా ఒక్కో ఏటీఎం మార్చడానికి అయ్యే ఖర్చు రూ. 3000-4000 ఉంటుందని చెబుతున్నారు.