న్యూఢిల్లీ: నగదు కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో  దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ ఛైర్మన్‌ రజనీశ్ కుమార్ స్పందించారు. పెట్టుబడుల కోసం తమ బ్యాంకు లక్ష కోట్ల రూపాయలు అప్పిచ్చే స్థాయిలో ఉందన్నారు. బ్యాంకులు అప్పు ఇవ్వడానికి ఆసక్తి చూపకపోవడం వల్లే ఈ ఆర్థిక మందగమనానికి కారణమన్న ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానమిచ్చారు. 

గత 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా దేశం నగదు కొరతను ఎదుర్కొంటుందని నీతి ఆయోగ్ వైస్‌ ఛైర్మన్ రాజీవ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నమ్మకం లోపించడమే ఇందుకు కారణమని రజనీశ్ కుమార్ పేర్కొన్నారు.

ఆ వ్యాఖ్యలపై రజనీశ్‌ను ప్రశ్నించగా..‘దాని గురించి నీతి ఆయోగ్‌ను అడగండి. కానీ, ఎస్బీఐ వద్ద మాత్రం నెలరోజుల్లో లక్ష కోట్లు రూపాయలు అప్పు ఇచ్చేంత నిధులు ఉన్నాయి. ఇదీ ప్రస్తుతం బ్యాంకు పరిస్థితి. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ అంతా ఇదే తీరుగా ఉంది. అప్పులు ఇచ్చే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. అయితే పెద్ద ప్రాజెక్టులు మాత్రం తక్కువగా ఉన్నాయి’ అని స్పష్టం చేశారు. 

అయితే ఈ విషయంలో బ్యాంకులు అప్రమత్తంగా ఉన్నాయని మాత్రం రజనీశ్ కుమార్ అంగీకరించారు. ‘మా విధానంలో కొన్ని మార్పులు వచ్చాయి. మేం జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం’ అన్నారు. అలాగే కంపెనీలు అప్పులు తగ్గించుకోవడం కూడా మంచి విషయమన్నారు. 

‘కంపెనీలు అప్పులు తగ్గించుకోవడం వల్ల కార్పొరేట్ రంగానికి వెళ్లే క్రెడిట్ మేం ఊహించినంత ఉండకపోవచ్చు. కొన్ని వ్యవస్థాగత మార్పులు జరుగుతున్నాయి. అది మంచి విషయమే’ అని రజనీశ్ కుమార్ పేర్కొన్నారు.