వియత్నాంకు చెందిన వియత్ జెట్ విమానయాన సంస్థ భారతదేశంలో అడుగుపెడుతోంది. బికినీ ఎయిర్ లైన్స్ గా పేరొందిన ఈ విమాన సేవలు త్వరలోనే భారత్ లో ప్రారంభం కానున్నాయి. ఇండియా-వియత్నాం మధ్య డిసెంబర్ నుంచి ప్రత్యక్ష విమాన సేవలను ప్రారంభించనున్నట్లు వియత్ జెట్ మంగళవారం తెలిపింది.

డిసెంబర్ 6న ప్రారంభమయ్యే న్యూ ఢిల్లీ- హొచి మిన్ సిటీ  మార్గంలో వారానికి నాలుగు రిటర్న్ విమానాలను నడుపుతున్నామని సదరు సంస్థ తెలిపింది. హనోయి-ఢిల్లీమార్గం డిసెంబర్ 7 నుంచి వారానికి మూడు  రిటర్న్ విమానాలను నడుపుతామని సంస్థ వివరించింది. తొలిసారి భారత్ లో అడుగుపెడుతున్న సందర్భంగా ఓ బంపర్ ఆఫర్ ని తీసుకువచ్చింది.

త్రి గోల్డెన్ డేస్ పేరిట స్పెషల్ ప్రమోషన్ సేల్ నిర్వహిస్తోంది. ఆగస్టు 20 నుంచి 22 వరకు రూ.9 ప్రారంభ ధరతో సూపర్ సేవింగ్ టికెట్లను అందిస్తోది. ఈ మూడురోజుల్లో టికెట్లను కొనుగోలు చేసిన వారు తర్వాత ప్రయాణించే అవకాశం ఉంది. కాగా వియత్ జెట్ డిసెంబర్ 2011లో పనిచేయడం ప్రారంభించింది. ఈ సంస్థకు చెందిన కొన్ని విమానాల్లో సిబ్బంది బికినీలు ధరించి ఉంటారు.

అంతేకాదు, ప్రతి సంవత్సరం విమాన సంస్థ విడుదల చేసే క్యాలెండర్ లో కూడా అమ్మాయిలు బికినీల్లోనే దర్శనమిస్తారు. మరోవైపు చైనాలో జరిగిన ఆసియా కప్ పోటీలకు వియత్నాం అండర్-23 ఫుట్ బాల్ జట్టు ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానంలో బికినీలు ధరించిన మోడల్స్ ఉన్న కారణంగా సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ వియత్నాం జనవరి 2018లో వియత్ జెట్ కు జరిమానా కూడా విధించింది.