Union budget 2022... ట్యాక్స్ పేయర్స్ కు నిర్మలమ్మ గుడ్ న్యూస్: 2 ఏళ్లలోపు అప్‌డేటేడ్ ట్యాక్స్ కు అవకాశం
ఆదాయ పన్ను చెల్లింపు దారులకు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. ట్యాక్స్ రిటర్న్స్ ను అప్ డేట్ చేయడానికి రెండేళ్ల సమయం ఇచ్చారు.
న్యూఢిల్లీ: ట్యాక్స్ రిటర్న్స్ లో లోపాల సవరణకు ట్యాక్స్ పేయర్స్ కు అవకాశం కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ట్యాక్స్ రిటర్న్స్ అప్‌డేట్ చేయడానికి రెండేళ్ల సమయం కల్పిస్తున్నామని ఆమె వివరించారు. అంతేకాదు గతంలో ట్యాక్స్ లో చూపని ఆదాయాన్ని కూడా ఈ సమయంలో అప్‌డేట్ చేసుకోవచ్చని కూడా కేంద్ర మంత్రి వివరించారు.
కేంద్ర మంత్రి Nirmala Sitharaman మంగళవారం నాడు Budget ను ప్రవేశ పెట్టారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం ఇది వరుసగా నాలుగో సారి. ఇవాళ Parliament ఆవరణలో సమావేశమైన కేంద్ర కేబినెట్ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది.ట్యాక్స్ అసెస్‌మెంట్ ఇయర్ ముగింపు నుండి రెండేళ్లలోపు అప్‌డేటేడ్ ట్యాక్స్ ను చెల్లించవచ్చని కేంద్ర మంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎస్ పన్ను మినహాయింపు పరిమితిని 10 శాతం నుండి 14 శాతానికి పెంచినట్టుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. స్టార్టప్‌లకు పన్ను మినహాయింపు మరో ఏడాది పొడిగించనున్నట్టుగా తెలిపారు. కొత్తగా ఏర్పాటయ్యే దేశీయ తయారీ కంపెనీలకు పన్ను రాయితీలు ఇస్తామన్నారు.
కార్పోరేట్ సర్ చార్జ్ ను 12 శాతం నుండి 7 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. డిజిటల్ అసెట్స్ ఆస్తుల లాభాల స్వీకరణపై 30 శాతం ట్యాక్స్ విధిస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పారు. ఈ ఆస్తులను బదిలీ చేస్తే అదనంగా 1 శాతం టీడీఎస్ విధించనున్నామన్నారు.అయితే Income tax స్లాబుల్లో ఎలాంటి మార్పులు ప్రకటించలేదు. ఆదాయ పన్నుపై ఎలంటి కొత్త ప్రతిపాదనలను కేంద్ర మంత్రి ప్రస్తావించలేదు. ట్యాక్స్ కు సంబంధించిన అనుబంధ సెక్షన్లలో మార్పులేవని కేంద్ర ఆర్ధిక మంత్రి తేల్చి చెప్పారు.