Asianet News TeluguAsianet News Telugu

Union Budget Key Points: ఈ బడ్జెట్‌లో కీలకమైన పది అంశాలేంటి..?

బడ్జెట్ అంటే ఒక ఏడాది కాలానికి దేశంలో ఖర్చులు. ఆదాయం వర్సెస్ ఖర్చుల వివరాలు. బడ్జెట్ అందరికీ అర్ధం కానే కాదు. అర్ధమవ్వాలంటే ఈ పది అంశాలు తెలుసుకుంటే మంచిది.
 

Union Budget Key Points
Author
Hyderabad, First Published Feb 1, 2022, 10:41 AM IST

బడ్జెట్ అంటే ఒక ఏడాది కాలానికి దేశంలో ఖర్చులు. ఆదాయం వర్సెస్ ఖర్చుల వివరాలు. బడ్జెట్ అందరికీ అర్ధం కానే కాదు. అర్ధమవ్వాలంటే ఈ పది అంశాలు తెలుసుకుంటే మంచిది.

కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరి కాస్సేపట్లో పార్లమెంట్ లో 2022-23 ఆర్ధిక సంవత్సరపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వరుసగా రెండేళ్లు కోవిడ్ ఉధృతి నేపధ్యంలో ఆర్ధిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతింది. ఈ క్రమంలో ఈసారి బడ్జెట్ ఎలా ఉంటుందనేది అందరికీ ఆసక్తిగా మారింది. ముఖ్యంగా మార్కెట్ అంతా ఎదురుచూస్తోంది. సాధారణంగా బడ్జెట్ అనేది సామాన్యుడికి అర్ధం కాని విషయం. కాస్త సంక్లిష్టంగానే ఉంటుంది. ప్రతి నెలా జీతం రాగానే ఇంటి ఖర్చులు, ఆదాయ వివరాలు ఎలా సరిచూసుకుంటామో..ఇంటికి సంబంధించిన బడ్జెట్ ఎలా ఉంటుందో..అలాగే దేశానికి సంబంధించిన ఏడాదికి సరిపడే బడ్జెట్. ఇందులో ఆ ఏడాది ఆదాయ వివరాలు, లోటు ఎంత ఉంది, మిగులు ఎంత ఉంది, ఖర్చులేమున్నాయి వంటివి కూలంకషంగా ఉంటాయి. అయితే ఈ బడ్జెట్‌ను సులభంగా అర్ధం చేసుకోవాలంటే కొన్ని కీలకమైన అంశాలు తెలుసుకుంటే..కొంతవరకూ అర్ధమవుతుంది. 

అన్నింటికంటే ముందుగా ఆర్ధిక సంవత్సరమంటే ఏంటనేది తెలుసుకోవాలి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమై..మరుసటి ఏడాది మార్చి 31 వరకూ ఉంటుంది. ఇప్పుడీ ఆర్ధిక సంవత్సరాన్ని జనవరి 1 నుంచి డిసెంబర్ 31కు మార్చాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. వ్యక్తిగత ఆదాయపు పన్నుకీలకమైంది. ప్రతిసారీ బడ్జెట్ వస్తుందనగానే ఉద్యోగులు ఎదురు చూసే మొదటి అంశమిదే. వ్యక్తిగత వార్షికాదాయం 2.5 లక్షల వరకూ మినహాయింపు ఉంది. ఈ పరిమితిని పెంచుతారనే ప్రచారం సాగుతోంది. 

ఇక ప్రత్యక్ష, పరోక్ష పన్నుల అంశం. ప్రజలు ప్రభుత్వానికి నేరుగా చెల్లించే పన్నుల్ని ప్రత్యక్ష పన్నులంటారు. ఉదాహరణకు ఇంటి పన్ను, నీటి పన్ను, ఆస్థి పన్ను వంటివి. ప్రత్యక్ష పన్నుల భారమనేది ప్రజలపై నేరుగా పడుతుంది. పరోక్ష పన్ను అనేది ప్రజలపై నేరుగా పడదు కానీ, పరోక్షంగా చెల్లించేది ప్రజలే. ఇందులో ప్రధానంగా విలువ ఆధారిత పన్ను అంటే వ్యాట్, సర్వీస్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్ , జీఎస్టీ వంటివి ఉన్నాయి. ఇంకొకటి మూలధన లాభాల పన్ను. అంటే ఏడాది వ్యవధిలో షేర్లపై వచ్చే లాభాలపై పన్ను ప్రస్తుతం 15 శాతముంది. ఈసారి ఈ విధానంలో మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది. 

ఇక మరో కీలకాంశం దేశ స్థూల జాతీయోత్పత్తి. అంటే ఒక ఏడాది సమయంలో దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువను జీడీపీగా పిలుస్తారు. దేశ ఆర్ధిక వ్యవస్థ సూచిని తెలిపే కీలకమైన అంశాల్లో ఇదొకటి. ఇక మరో అంశం ద్రవ్యలోటు. అంటే ప్రభుత్వ వ్యయాలు..ఆదాయాన్ని మించితే ద్రవ్యలోటు అంటే ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. ద్రవ్యలోటులో అప్పులనేవి లెక్కలో తీసుకోరని గమనించాల్సి ఉంటుంది. కరెంటు ఖాతా లోటు అనేది కూడా కీలకంగా గమనించాల్సిన విషయం. వస్తు సేవల దిగుమతి విలువ, ఎగుమతుల విలువ మధ్య ఉండే వ్యత్యాసాన్ని కరెంటు ఖాతా లోటుగా పిలుస్తారు. 

ఇక ఎప్పుడూ అందరి ఆసక్తి కన్పించేది పెట్టుబడుల ఉపసంహరణ. అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వం తన వాటాను పూర్తిగా అయినా లేదా పాక్షికంగా అయినా ప్రైవేటుకు విక్రయించడాన్నే పెట్టుబడుల ఉపసంహరణగా పిలుస్తారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ వాటాల్ని విక్రయించాలని నిర్ణయించడం లేదా ఎయిర్ ఇండియా పూర్తి వాటాను టాటాకు విక్రయించడం దీనికి ఉదాహరణ. ఇక ఆర్ధిక బిల్లు.. కొత్త పన్నులను, ఉన్న పన్నుల విధానంలో మార్పుల్ని ఆర్ధిక బిల్లులో పొందుపరుస్తారు. బడ్జెట్‌తో పాటే ఆర్ధిక బిల్లు ప్రవేశపెడతారు. బ్యాంకులకు సంబంధించి రెపో రేటు ఉంటుంది. అంటే ఆర్బీఐ తమకిచ్చే స్వల్పకాలిక రుణాలపై వాణిజ్య బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటును రెపో రేటుగా పిలుస్తారు. 

Follow Us:
Download App:
  • android
  • ios