Union Budget 2022: భారత్‌లో త్వరలో డిజిటల్ కరెన్సీ.. క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై 30 శాతం ట్యాక్స్
భారత్‌లో డిజిటల్ కరెన్సీకి (digital currency) సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు. అంతేకాకుండా క్రిప్టో కరెన్సీల లావాదేవీలపై 30 శాతం పన్ను విధించనున్నట్టుగా నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
భారత్‌లో డిజిటల్ కరెన్సీకి (digital currency) సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మంగళవారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. రిజర్వ్ బ్యాంక్ ఇండియా ద్వారా డిజిటల్ కరెన్సీని తీసుకురానున్నట్టుగా చెప్పారు.
రూపాయికి మరింత బలాన్ని చేకూర్చేలా డిజిటల్ రూపీ ఉండనుందని తెలిపారు. కరెన్సీ కార్యకలాపాల నిర్వహణలో డిజిటల్ కరెన్సీ ఉండనుందని చెప్పారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ సాయంతో రూపొందించనున్నట్టుగా వెల్లడించారు. డిజిటల్ రూపీ విడుదలతో ఆర్థిక వ్యవస్థకు ఉత్సాహం అందుతుందన్నారు. దీనిని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) అని పిలవనున్నారు. ప్రస్తుతం దేశంలో చెలామణీలో ఉన్న భౌతిక కరెన్సీతో పాటే డిజిటల్ కరెన్సీ కొనసాగనుంది.
ఇక, క్రిప్టో కరెన్సీల లావాదేవీలపై 30 శాతం పన్ను విధించనున్నట్టుగా నిర్మలా సీతారామన్ వెల్లడించారు. డిజిటల్ కరెన్సీ ద్వారా ఆదాయం, ఆస్తుల బదిలీపై 30 శాతం పన్ను విధించనున్నట్టుగా చెప్పారు. డిజిటల్ కరెన్సీల ఆదాయంపై పన్ను మినహాయింపుకు అవకాశం లేదని తెలిపారు.
వచ్చే ఏడాది నాటికి ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్లు 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రైవేట్ టెలికాం ఆపరేపటర్ల ద్వారా 5G మొబైల్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన స్పెక్ట్రమ్ వేలం 2022లో నిర్వహించబడుతుందని సీతారామన్ చెప్పారు. 2022-23లోపు 5G మొబైల్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. దేశంలోని అన్ని గ్రామాల్లో ఆప్టికల్ ఫైబర్ ఏర్పాటు 2025 నాటికి పూర్తవుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. విజువల్స్, యానిమేషన్ రంగంలో యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ ప్రచారం కోసం ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబడుతుందని తెలిపారు.