Economic Survey: పార్లమెంట్ ముందుకు ఆర్థిక సర్వే.. జీడీపీ వృద్ది, ఇతర వివరాలు ఎలా ఉన్నాయంటే..?
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Parliament Budget session) ప్రారంభం అయ్యాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) 2021-2022 ఆర్థిక సర్వేను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Parliament Budget session) ప్రారంభం అయ్యాయి. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) 2021-2022 ఆర్థిక సర్వేను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చారు. 2022 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌కు ముందు ఆర్థిక స్థితికి సంబంధించిన వివరాలను ఆర్థిక సర్వే అందించింది.
ఈ సర్వే ప్రకారం..2021-22లో జీడీపీ వృద్ధి రేటు 9.2 శాతం ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2022 నుండి మార్చి 2023 వరకు) జీడీపీ వృద్ధి 8-8.5 శాతం ఉంటుందని లెక్కగట్టింది. 2020-21లో జీడీపీ 7.3 శాతానికి క్షీణించిందని సర్వే వెల్లడించింది.
ముఖ్య ఆర్థిక సలహాదారు డాక్టర్ వీ అనంత నాగేశ్వరన్.. దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు, తీసుకోవాల్సిన విధాన నిర్ణయాలు, జీడీపీ అంచనాలను సర్వేలో పొందుపర్చారు. దీనిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. ఇక, రేపు (ఫిబ్రవరి 1) ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్.. పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
వ్యవసాయ రంగం వృద్ధి 3.9 శాతం..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం వృద్ధి 3.9 శాతంగా ఉంటుందని సర్వే పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక వృద్ధి 11.8 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ వరకు ఐపీఓల ద్వారా రూ.89,000 కోట్లకు పైగా సమీకరించినట్లు ఆర్థిక సర్వేలోపేర్కొన్నారు. ఈ ద్రవ్యోల్బణం రేటు నియంత్రణలో ఉంటుందని.. ఇది ఆర్థిక వ్యవస్థకు మంచి విషయమని ఆర్థిక సర్వేలో చెప్పారు.
లాభాల్లో స్టాక్ మార్కెట్..
ఆర్థిక సర్వే తర్వాత స్టాక్ మార్కెట్ లాభాలు భారీగా పెరిగాయి. వెయ్యి పాయింట్లకు లాభంలో సెన్సెక్స్, 300 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ కొనసాగుతున్నాయి. నిఫ్టీ 17 వేల పాయింట్ల పైన ట్రేడ్ అవుతుంది. రేపు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై మదుపర్లు ఆశాజనంగా ఉన్నారు. మధ్యాహ్నం 1.13 గంటలకుసెన్సెక్స్ 1052 పాయింట్లు లాభపడి 58,253 పాయింట్ల పైన ట్రేడవుతోంది.