67లక్షలు: టీవీఎస్, సుజుకీ, పియాజియో విక్రయాల జోరు
టీవీఎస్ మోటార్ కంపెనీ, సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా, పియాజియో కంపెనీలు తమ మార్కెట్ వాటాను పెంచుకోగలిగాయని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) వెల్లడించిన గణాంకాల ద్వారా తెలుస్తోంది.
న్యూఢిల్లీ: గడచిన ఆర్థిక సంవత్సరం (2018-19)లో దేశవ్యాప్తంగా 67,01,469 స్కూటర్లు అమ్ముడయ్యాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం(67,19,909 యూనిట్లు)తో పోల్చితే అమ్మకాలు 0.27 శాతం మేర తగ్గాయి.
అయినప్పటికీ టీవీఎస్ మోటార్ కంపెనీ, సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా, పియాజియో కంపెనీలు తమ మార్కెట్ వాటాను పెంచుకోగలిగాయని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) వెల్లడించిన గణాంకాల ద్వారా తెలుస్తోంది.
అమ్మకాలపరంగా దేశీయ మార్కెట్లో రెండో అతిపెద్ద కంపెనీగా ఉన్న టీవీఎస్ మోటార్ 2018-19 ఆర్థిక సంవత్సరంలో 12,41,366 స్కూటర్లను విక్రయించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సర అమ్మకాల(10,99,133 యూనిట్లు)తో పోల్చితే వృద్ధి 12.94 శాతంగా నమోదైంది.
ఏడాదికాలంలో ఈ కంపెనీ మార్కెట్ వాటా 16.36 శాతం నుంచి 18.52 శాతానికి పెరిగింది. మార్కెట్ లీడర్ హోండా హోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా గత ఆర్థిక సంవత్సరంలో 36,80,403 స్కూటర్లను విక్రయించింది.
అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (38,21,542 యూనిట్లు)తో పోల్చితే అమ్మకాలు 3.7 శాతం తగ్గాయి. దీంతో కంపెనీ మార్కెట్ వాటా 56.86 శాతం నుంచి 54.91 శాతానికి తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరం (7,19,087 యూనిట్ల విక్రయం)లో హీరో మోటోకార్ప్ మార్కెట్ వాటా 13.14 శాతం నుంచి 10.73 శాతానికి తగ్గింది.
2019 ఆర్థిక సంవత్సరంలో సుజుకీ మోటార్‌సైకిల్ అమ్మకాలు 46 శాతం పెరిగి 6,15,520 యూనిట్లకు చేరాయి. మార్కెట్ వాటా 6.27 శాతం నుంచి 9.1 శాతానికి పెరిగింది. ఇదేకాలంలో పియాజియో అమ్మకాలు 14 శాతం పెరిగి 77,775 యూనిట్లకు చేరుకోగా.. మార్కెట్ వాటా 1.01 శాతం నుంచి 1.16 శాతానికి పెరిగింది.
ఇండియా యమహా మోటార్ స్కూటర్ల అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో 12.15 శాతం తగ్గి 3,64,879 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ కంపెనీ మార్కెట్ వాటా ఏడాది కాలంలోనే 6.18 శాతం నుంచి 5.44 శాతానికి తగ్గిపోయిందని సియామ్ గణాంకాల ద్వారా తెలుస్తోంది.